పాట స్వరకర్త సృష్టి. ఇది ఎవ్వరూ కాదనలేని నిజం. ఓ ట్యూన్ పుట్టించడానికి సంగీత దర్శకుడు అహర్నిశలూ కష్టపడతాడు. ఏ సందర్భానికి ఎలాంటి వాయిద్యం వినిపించాలో, ఏ రాగంతో పాట అందుకోవాలో.. ఆ పాటని ఏ గాయకుడి చేత పాడించాలో.. అంతా సంగీత దర్శకుడి ఇష్టం. పాట స్వరపరచడం ఒక యెత్తు. ఆ పాట తన ఆశలకు, ఆలోచనలకు అనుగుణంగా బయటకు రావడం మరో ఎత్తు. ఏ ట్యూనూ ఈజీగా పుట్టేయదు. వాటి వెనుక భారీ కసరత్తే జరుగుతుంటుంది. అలాంటప్పుడు ఓ పాట బయటకు రాగానే.. దాన్ని యదేచ్ఛగా వేడుకలపై పాడుకోవడం, తద్వారా వచ్చే సంపాదనని ఎవరి జేబుల్లో వాళ్లు వేసుకోవడం ఒక విధంగా సదరు సంగీత దర్శకులకు అన్యాయం చేసినట్టే. ఇళయరాజా వాదన కూడా ఇదే. ‘నా పాటని నా అనుమతి లేకుండా వ్యాపారాత్మక వేదికల మీద పాడొద్దు. ఒక వేళ పాడితే ఆ రాయల్టీ నాకు అందేలా చూడండి’ అంటూ గతంలోనే ఇళయరాజా కోర్టుకెక్కారు. మద్రాస్ హైకోర్టు ఇళయరాజాకి అనుకూలంగా తీర్పునిచ్చింది. కానీ... చాలామంది ఆ తీర్పుని పట్టించుకోలేదు. దేశ విదేశాల్లో సాగుతున్న సంగీత కార్యక్రమాల్లో ఇళయరాజా పాటల్ని పాడేస్తున్నారు. తద్వారా వస్తున్న ఆదాయాన్ని తమ ఖాతాల్లోకి మళ్లించుకొంటున్నారు. అందుకే... ఇళయరాజా ఇప్పుడు సీరియస్ అవ్వాల్సివచ్చిందన్న వాదన వినిపిస్తోంది.
రాయల్టీ విషయంలో కోర్టుకెక్కిన మొట్ట మొదటి సంగీత దర్శకుడు ఇళయరాజా అనుకొంటాం గానీ.. అంతకు ముందే ఏఆర్ రెహమాన్ రాయల్టీ విషయంలో రాజీ లేని పోరాటం చేశారు. ఆయనా కోర్టు ద్వారా పోరాడి.. తన పాట వేదికలకు ఎక్కకుండా జాగ్రత్త పడ్డారు. ప్రైవేటు ఫంక్షన్లలో రెహమాన్ పాట పెద్దగా వినిపించకపోవడానికి కారణం ఇదే. అయితే ఈ రాయల్టీ విషయంపై అటు సంగీత దర్శకులకు, ఇటు గాయకులకు, గీత రచయితలకు సరైన అవగాహన లేకపోవడంతో గందరగోళం నెలకొంది. ఒకవేళ పాటపై రాయల్టీ ఉంటే... అది పాడిన గాయకుడికి చెందదా? అనే వాదన బలంగా వినిపిస్తోంది. నిజమే.. ఓ పాట జనంలోకి వెళ్లిందంటే అందులో గాయకుడి పాత్ర కూడా ఉంటుంది. బాలు, జేసుదాస్, హరిహరన్, శంకర్ మహదేవన్, చిత్ర, జానకి, సుశీలలాంటి గాయనీ గాయకులు కేవలం తమ గాత్ర మాధుర్యంతోనే ఎన్ని పాటల్ని బ్రతికించలేదు..? గాయకుడు లేకుండా పాట ఉంటుందా?
అలాంటప్పుడు గీత రచయిత కష్టాన్నీ తక్కువ అంచనా వేయలేం. వేటూరి, సిరివెన్నెల లాంటి లబ్ద ప్రతిష్టులు ఎన్ని పాటలకు తమ పదాలతో వన్నెలు అద్దారో? స్వరం, గాత్రం, పదం... మూడూ కలిస్తేనే పాట. ఇందులో ఏది ఎక్కువ ఏది తక్కువ అనుకోవడానికి చోటే లేదన్నది కొంతమంది గాయనీ గాయకుల మాట. అయితే.. వీళ్లందరికీ పారితోషికాలు అందించి, ఆ పాటపై ఖర్చు పెట్టిన ప్రతీ రూపాయీ తన జేబులోంచి తీసిన నిర్మాత ఏమైపోవాలి? అనే కోణంలోనూ చర్చ సాగాల్సిందే. ఓ వస్తువు ఓ వినియోగదారుడు కొనుక్కొంటే.. దానిపై హక్కు పూర్తిగా వినియోగ దారుడి సొంతం అవుతుంది. దాన్ని అతడు ఏ విధంగా ఉపయోగించుకొన్నా.. ఎవ్వరూ ప్రశ్నించలేరు. పాటని కొనుక్కొన్న నిర్మాత కూడా ఓ వినియోగ దారుడే కదా! ఆ పాట ఎవరు తయారు చేస్తే ఏంటి? - ఈ దిశగా ఆలోచిస్తే ఆ పాటపై సర్వ హక్కులూ నిర్మాతకు, ఆడియో కంపెనీలకూ చెందుతుందన్నది నిర్వివాద అంశం.
ఎఫ్.ఎమ్ కంపెనీల జోరు పెరిగింది. పాటకు రాయల్టీ రూపంలో కొంత సొమ్ము అందిస్తున్నవి ఎఫ్ ఎమ్ ఛానళ్లే. ఓ పాటని ఎఫ్.ఎమ్‌లో వాడుకొంటే ఆ పాటకు సంబంధించిన రాయల్టీ సంగీత దర్శకుడు, గీత రచయిత, నిర్మాతలకు తలా కొంత వెళ్తుంది. వీటన్నింటికీ సంబంధించిన ఓ వ్యవస్థ చాలా కాలం నుంచి సమర్థంగా పనిచేస్తోంది కూడా. ఈ విషయమై సంగీత దర్శకుడు, గాయకులు, రచయితలు, నిర్మాతలు, ఆడియో కంపెనీలు ఓ ముందస్తు ఒప్పందానికి రావాల్సిన అవసరం ఉందనిపిస్తోంది. అందరూ కూర్చుని మాట్లాడుకొంటే..ఇలాంటి వివాదాలు పరిష్కారమైపోతాయి. ఆ దిశగా సంగీత ప్రపంచం ముందడుగు వేయాలి. అప్పుడే ఇలాంటి ప్రశ్నలు, వివాదాలకూ చోటు లేకుండా ఉంటుంది.
Both the songs are from the divini trance of His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
No comments:
Post a Comment