Thursday, 20 April 2017



గోదావరి-పెన్నా అనుసంధానం :
గోదావరి-పెన్నా అనుసంధానం ద్వారా సోమశిల రిజర్వాయరుకు తీసుకెళ్ళాలనే ప్రతిపాదిత 400 టిఎంసిల నీటిని 754 అడుగులు లిఫ్ట్‌ చేసి తీసుకెళ్ళాలి. మొత్తం 709 కిలోమీటర్లు నీరు ప్రయాణం చేయాలి. 13.5 కిలోమీటర్లు సొరంగాలు తవ్వాలి. 4 కిలోమీటర్లు అక్విడెక్టులు నిర్మించాల్సి ఉంటుంది. గోదావరి నుంచి తీసుకొచ్చే నీరు లిఫ్ట్‌ చేయడానికి ప్రతి సంవత్సరం రూ.3,393 కోట్లు విద్యుత్‌ బిల్లు చెల్లించాల్సి వస్తుంది (యూనిట్‌ విద్యుత్‌ రూ.5 చొప్పున లెక్కిస్తే). ఇందుకు 9,900 మెగావాట్ల విద్యుత్‌ అవసరమని చెబుతున్నారు. వీటన్నింటికీ మించి ప్రస్తుత ధరల ప్రకారం గోదావరి-పెన్నా అనుసంధానానికి సుమారు రూ.1 లక్ష కోట్లు అవుతుందని అంచనా.
గోదావరి నీటి వివరాలు
కృష్ణానదిపై నీటి ఒత్తిడి అధికంగా ఉంది. అవసరాలను తీర్చే అవకాశం లేదు. కానీ, గోదావరి నదిలో పుష్కలంగా నీరున్నాయి. 2005-06, 2014-15 మధ్య దశాబ్ద కాలంగా సగటున ప్రతి సంవత్సరం గోదావరి నుంచి 2,695.582 టిఎంసిల నీరు సముద్రం పాలవుతున్నాయి. ఒకవేళ గోదావరి పైభాగంలో ప్రాజెక్టులు నిర్మిస్తే మనకు నీటి కొరత వస్తుందనే అభిప్రాయానికి కూడా తావులేదు. ఎందుకంటే గోదావరిలో 75 శాతం ఆధారంగా లభించే నీరు 3,000 టిఎంసిలు. అందులో బచావత్‌ ట్రిబ్యునల్‌ తీర్పు ఆధారంగా పునరుత్పత్తి జలాలు 108.50 టిఎంసిలతో కలిపి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ 1,588.15 టిఎంసిల నికరజలాలు వాడుకోవడానికి అవకాశం కల్పించింది. నిర్మాణం పూర్తి అయిన, నిర్మాణంలోనున్న, ప్రతిపాదనలో ఉన్న ప్రాజెక్టులన్నీ కలిపి తెలంగాణ 732.56 టిఎంసిలు, ఆంధ్ర 588.30 టిఎంసిల నీటిని మాత్రమే వినియోగించుకుంటున్నాయి. ఆంధ్ర, తెలంగాణ కలిపి ప్రతిపాదనలోనున్న ప్రాజెక్టులతో కలిపి 1,320.86 టిఎంసిలను మాత్రమే వాడుకోగలిగి ఉన్నాయి. మిగిలిన 267.29 టిఎంసిల నికర జలాలను ఆంధ్ర రాష్ట్రం మాత్రమే వాడుకోవాల్సి ఉంది. ఇవిగాక సగటున ప్రతి సంవత్సరం 1,882 టిఎంసిల వరద జలాలు గోదావరి నుంచి సముద్రం పాలవుతున్నాయి. కనుక నీటికి కొరత అన్నది లేదు.
కరువు పీడిత ప్రాంతాల అవసరాలు ఎలా తీర్చాలి?
రాష్ట్రంలో నిరంతరం కరువుకు గురవుతూ, అత్యల్ప వర్ష పాతం కలిగిన రాయలసీమ నాలుగు జిల్లాలతో పాటు రాయలసీమను అనుకొని ఉన్న ప్రకాశం, నెల్లూరు జిల్లా ప్రాంతాలు కూడా తక్కువ వర్షపాతం కలిగి కరువుకు గురవు తున్న ప్రాంతాలే. వీటి అవసరాలు తీర్చాలంటే గోదావరి నీటిని కృష్ణాడెల్టాకు పూర్తిగానూ, సాగర్‌ ఎడమగట్టు కాలువ క్రింద కొంత భాగానికి నేరుగానూ సాగుకు అందించాలి. అలాగే పులిచింతల ప్రాజెక్టు నుంచి 45 టిఎంసిల నీటిని సాగర్‌ కుడిగట్టు కాలువ ప్రాంతానికి అందిస్తే, శ్రీశైలంలో నీటిని ఆ మేరకు నిల్వ చేసి పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ ద్వారా హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్‌ లిఫ్ట్‌ ద్వారానూ, వెలిగొండ ప్రాజెక్టు ద్వారానూ సాగు, తాగునీరు అందించవచ్చు.
మొదట కృష్ణా డెల్టాను పరిశీలిద్దాం. ప్రకాశం బ్యారేజీ పూర్తి స్థాయి నీటిమట్టం(ఎఫ్‌ఆర్‌ఎల్‌) 57 అడుగులు మాత్రమే. అదే పోలవరం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం(ఎఫ్‌ఆర్‌ఎల్‌) 150 అడుగులుగా ఉంది. అందువల్ల కృష్ణాడెల్టాకు అవసరమైన 160 టిఎంసిలను పోలవరం నుంచి గ్రావిటీ (భూమ్యాకర్షణ) కాలువల ద్వారా ఎలాంటి ఇబ్బంది లేకుండా జూన్‌/జులై నెలలోనే అందించవచ్చు. సాగర్‌ ఎడమగట్టు కాలువ ద్వారా సాగయ్యే కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని సాగు ఆయకట్టుకు 30 టిఎంసిలు పోల వరం ద్వారా అందించవచ్చు. సాగర్‌ కుడిగట్టు కాలువ ద్వారా గుంటూరు, ప్రకాశం జిల్లాలకు 140 టిఎంసిలను అంది స్తున్నారు. పోలవరం నుంచి 150 అడుగులు లిఫ్ట్‌ ద్వారా పులి చింతలకు 70 టిఎంసిలను పంప్‌ చేసి, పులి చింతల ద్వారా 115 టిఎంసిల నీటిని గుంటూరు, ప్రకాశం జిల్లాల సాగర్‌ ఆయకట్టుకు అందించవచ్చు.
కృష్ణా డెల్టా, సాగర్‌ ఆయకట్టు కృష్ణా, పశ్చిమగోదావరి, గుంటూరు, ప్రకాశం జిల్లాలకు పోలవరం నీరు అందించడం వల్ల సుమారు 305 టిఎంసిల నీటిని ఆదా చేసి శ్రీశైలం నుంచి అటు రాయలసీమ నాలుగు జిల్లాలు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు కరువు, మెట్ట ప్రాంతాల సాగు, తాగునీరు అందించవచ్చును. ఇందుకు 758 అడుగులు మూడు అంచెలుగా లిఫ్ట్‌ అవసరం లేదు. ప్రస్తుతం నిర్మాణంలోనున్న తెలుగుగంగ, గాలేరు-నగరి, హంద్రీ-నీవా, వెలిగొండ, సోమశిల-స్వర్ణముఖి కాలువలు సరిపోతాయి. అందువల్ల రూ.97 వేల కోట్లు అవసరం లేకుండానే సాగునీరు అందించడానికి సులువైన మార్గం. అన్నింటికీ మించి అదనపు జలాల ఆధారంగా ప్రాజెక్టులు నిర్మించే అవసరం ఉండదు. అన్ని ప్రాంతాల ప్రాజెక్టులకు నికర జలాలను అందించవచ్చు. ప్రాంతీయ విభేదాలు, ప్రాంతీయ అసమానతలు నిర్మూలించే వీలుంటుంది.
అయితే ఇవన్నీ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి తెలి యవా! తెలియదని అనుకోవడం నిజంగానే పెద్ద తప్పిదం అవుతుంది. అన్నీ తెలిసి కూడా ప్రభుత్వం ఎందుకు ఇలా వ్యవహరిస్తోంది అనేది పెద్ద ప్రశ్న.
ఇందుకు వారికి, వారి వర్గ ప్రజలకు ప్రత్యేక ప్రయోజనాలు తప్పక ఉన్నాయనే చెప్పాలి.
లక్ష కోట్లు పెన్నా-గోదావరి అనుసంధానానికి ఖర్చు చేస్తానని చెప్పడం చూస్తుంటే ''గాలిలో మేడలు కట్టడం అంటే ఇదే కాబోలు'' అనిపిస్తోంది. అయినా ఇంతకన్నా తక్కువ ఖర్చుతో కరువు పీడిత ప్రాంతాల సాగు, తాగునీటి అవసరాలు తీర్చే మార్గాలు లేవా?

No comments: