నెలనెలా మామూళ్లు మా వల్లకాదు
Sakshi | Updated: June 24, 2017 06:50 (IST)
నెలకు రూ.కోటి ఎక్కడ నుంచి తేగలం?
సాక్షి, అమరావతి బ్యూరో : ‘నెల నెలా రూ.కోటి టార్గెట్ ఇస్తారు.. పోలీస్ స్టేషన్‌కు వచ్చే వారిని పీడించాలి.. ఇసుకను కూడా మేమే అక్రమంగా ఇతర రాష్ట్రాలకు తరలించి వచ్చిన సొమ్మును అధికార పార్టీ నేతలతోపాటు మా శాఖ అధికారులకు పంపాలి. ఇలా ప్రతి నెలా వసూలు చేయడం మావల్ల కావడం లేదు. మీరైనా చర్యలు తీసుకోండి’... అంటూ శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందిన ఓ ఎస్‌ఐ ఏకంగా జిల్లా కలెక్టర్‌కు లిఖిత పూర్వకంగా మొరపెట్టుకున్నారు. ఆ ఎస్‌ఐ ఆవేదన రాజకీయ, అధికారవర్గాల్లో తీవ్ర సంచలనం కలిగించింది. కానీ దీనిపై రాజకీయ పెద్దలు భగ్గుమన్నారు. ఆ ఎస్‌ఐను బదిలీచేసి ఎక్కడా పోస్టింగ్ ఇవ్వకుండా వీఆర్‌లో ఉంచారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఉదంతం రాష్ట్రంలో తాజా పరిస్థితికి అద్దంపడుతోంది.
నెలకు రూ.కోటి వసూళ్లు..: గూడూరు డివిజన్ ప్రాంతంలో పోలీస్‌స్టేషన్లలో పనిచేసే ఎస్‌ఐలు ప్రతినెలా రూ.కోటి వరకు వసూలు చేసి ఇవ్వాలి. ఈ అవినీతి సొమ్ముతో టీడీపీ నేతలతో పాటు జిల్లా స్థాయి అధికారుల వరకు పంపకాలు ఉంటాయనేది ఆ ఎస్‌ఐ ఆరోపణ. ఈ క్రమంలో ఇటీవల సూళ్లూరుపేటలో పనిచేస్తున్న ఎస్‌ఐ నెలవారీ టార్గెట్‌లు వసూళ్లు చేయలేక ఏకంగా జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. అయితే ఎస్‌ఐ ఫిర్యాదుపై విచారణ జరిపించాల్సిన కలెక్టర్ జిల్లా ఎస్పీ దృష్టికి తీసుకెళ్లడంతో ఉలిక్కిపడ్డ పోలీస్ ఉన్నతాధికారులు హుటాహుటినా ఆ ఎస్‌ఐపై బదిలీ వేటు వేశారు. ఆయనకు ఎక్కడా పోస్టింగ్ కూడా ఇవ్వకుండా వేకెన్సీ రిజర్వు(వీఆర్)లో ఉంచారు.
No comments:
Post a Comment