గురువులకో దండం!
27-08-2017 00:44:56
దేవుడి పేరు చెప్పి వెధవ వేషాలు వేయడం మన దేశంలో చాలామంది చేస్తున్నారు. వారిలో గుర్మీత్ సింగ్ పాపం ఇప్పుడు పండింది. భౌతిక సంపద పట్ల మక్కువ పెంచుకోవద్దని స్వాములైనా, సన్యాసులైనా, గురువులైనా బోధించాలి. కానీ ఆచరణలో అందుకు విరుద్ధంగా జరుగు తున్నది. ఎవరివద్ద సంపద ఎక్కువగా ఉంటున్నదో వారే గొప్ప స్వామిగా, గురువుగా చలామణి అవుతున్నారు. ఆధ్యాత్మిక తత్వాన్ని బోధించవలసినవారు మౌలిక సూత్రాన్ని విస్మరించి విలాస జీవితాలకు అలవాటు పడుతున్నారు.
డేరా సచ్చా సౌదా సంస్థ అధిపతి గుర్మీత్ రామ్ రహీం సింగ్ తన శిష్యురాళ్లు ఇద్దరిపై అత్యాచారానికి పాల్పడ్డారని సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి నిర్ధారించడంతో పంజాబ్, హరియాణాలలో అల్లర్లు చెలరేగాయి. ఈ అల్లర్లలో 30 మందికి పైగా మరణించగా, కోట్లాది రూపాయల విలువ చేసే ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులు కాలి బూడిద అయ్యాయి. ఈ సందర్భంగా టీవీ చానెళ్లలో ప్రసారం అయిన దృశ్యాలు చూసిన వారికి మనుషులు ఇంత దుర్బలురుగా ఎందుకు మారతారో అన్న ఆవేదన కలుగక మానదు. దేవుడైనా, మతమైనా మనలో ఆత్మ విశ్వాసాన్ని పెంపొందించడానికి దోహదపడాలే గానీ, మూఢ విశ్వాసాలను ప్రోత్సహించడానికి కాదు. దేవుడు, మతం పేరిట కొంతమంది సాగిస్తున్న అరాచకాలకు బలవుతున్నవారు కూడా మనుషులే! ఆత్మ విశ్వాసం ఉండాల్సిన చోట మూఢ విశ్వాసం ప్రవేశిస్తే ఇలాంటి అల్లర్లే జరుగుతుంటాయి. డేరా సచ్చా సౌదా అధిపతి గుర్మీత్‌సింగ్ రామ్‌రహీం గురించి పంజాబ్, హరియాణ ప్రజలకు తప్ప మిగతా రాష్ర్టాల ప్రజలకు పెద్దగా తెలియదు. 1948లో మస్తానా బెలూచిస్థానీ అనే గురువు డేరా సచ్చా సౌదాను నెలకొల్పాడు. ఆయన బోధనలతో ప్రభావితులైన లక్షలాది మంది ప్రజలు ఇందులో చేరారు. కుల వివక్షకు అతీతమైన డేరా సచ్చా సౌదాలో పేద ధనిక అన్న తేడా కూడా ఉండదు.. అందరూ సమానమే! పంజాబ్, హరియాణలలో అగ్రకుల ఆధిపత్యం ఎక్కువ కాబట్టి సహజంగానే దళితులు, వెనుకబడిన వర్గాలు అధిక సంఖ్యలో ఈ సంస్థలో చేరారు. ఇందులో చేరిన సభ్యులకు సబ్సిడీతో కూడిన ఆహారాన్ని అందిస్తారు.
ప్రాణాంతక వ్యాధులకూ ఇక్కడ ఉచితంగా చికిత్స జరుగుతుంది. ఇలాంటి ఎన్నో అంశాలరీత్యా సంస్థ పట్ల అత్యధిక ప్రజానీకం ఆకర్షితులయ్యారు. లౌకికవాదం, సమానత్వాన్ని ప్రచారం చేయడంతో పాటు భౌతిక సంపదను ప్రోత్సహించకూడదు-– ఆమోదించకూడదు అన్న లక్ష్యాలతో ఏర్పాటైన డేరా సచ్చా సౌదా సంస్థకు గుర్మీత్‌సింగ్ రామ్‌రహీం ప్రస్తుతం మూడవ అధిపతిగా ఉన్నారు. సంస్థ లక్ష్యాలతో సంబంధం లేకుండా ఈయనగారి జీవితం సాగుతూ వచ్చింది. భౌతిక సంపదకు దూరంగా ఉండటం సంస్థ లక్ష్యాలలో ఒకటి కాగా, గుర్మీత్ సింగ్ మాత్రం సంపద ప్రదర్శనకు ప్రాధాన్యం ఇచ్చేవారు. నిన్నటికి నిన్న కోర్టుకు వెళ్లడానికి 200 కార్లతో ర్యాలీగా బయలుదేరారు. వంటి మీద బంగారు ఆభరణాలు ధరించడం అంటే భౌతిక సంపద పట్ల మక్కువ పెంచుకోవడం అన్న మాటే కదా! ఇలాంటి గురువుకు కూడా లక్షల సంఖ్యలో అనుచరులు ఉండటం ఆశ్చర్యం కలిగిస్తుంది. తన వద్ద శిష్యురాళ్లుగా ఉన్న ఇద్దరిపై గుర్మీత్ సింగ్ అత్యాచారానికి పాల్పడ్డారన్న ఆరోపణలను సీబీఐ ప్రత్యేక కోర్టు శుక్రవారంనాడు నిర్ధారించింది. ఈ నేరానికి శిక్ష ఇంకా ఖరారు కావలసి ఉంది.
తమ గురువుగారిని నేరస్తుడిగా నిర్ధారించడంతోనే శిష్య బృందం పూనకం వచ్చినట్టు ఊగిపోతూ దాడులకు పాల్పడింది. ఆయనగారికి శిక్ష ప్రకటిస్తే ఇంకెంత విధ్వంసం సృష్టిస్తారో తెలియదు. గుర్మీత్ సింగ్ ఏమి బోధిస్తున్నారని ఆయనకు ఇన్ని లక్షల మంది శిష్యులు ఉన్నారో తెలియదు. దేవుడి పేరు చెప్పి వెధవ వేషాలు వేయడం మన దేశంలో చాలామంది చేస్తున్నారు. వారిలో గుర్మీత్ సింగ్ పాపం ఇప్పుడు పండింది. భౌతిక సంపద పట్ల మక్కువ పెంచుకోవద్దని స్వాములైనా, సన్యాసులైనా, గురువులైనా బోధించాలి. కానీ ఆచరణలో అందుకు విరుద్ధంగా జరుగుతున్నది. ఎవరి వద్ద సంపద ఎక్కువగా ఉంటున్నదో వారే గొప్ప స్వామిగా, గురువుగా చలామణి అవుతున్నారు.
ఆధ్యాత్మికతత్వాన్ని బోధించవలసినవారు మౌలిక సూత్రాన్ని విస్మరించి విలాస జీవితాలకు అలవాటు పడుతున్నారు. గురువులు, స్వాములు చేయవలసింది మనుషులలో సత్ప్రవర్తనను ప్రోత్సహించడమే కదా! అలాంటివారే కామ క్రోధ మద మాత్సర్యాలకు బానిసలవుతున్నారు. ఒకవైపు శిష్య బృందం– మరోవైపు సంపద పెరిగిపోవడంతో తామే దేవుళ్లమన్న భావనకు లోనవుతున్నారు. దీని ఫలితమే జరుగుతున్న అనర్థాలు. గుర్మీత్ సింగ్ పట్ల అన్ని లక్షల మంది ఎందుకు ఆకర్షితులయ్యారో తెలియదు. ఆయనేమీ దేవుడు కాదు.
అతీంద్రియ శక్తులు ఉన్నట్లు కూడా దాఖలాలు లేవు. దైవత్వం ఉన్నవాడు అయితే ఏమి జరుగుతుందో ముందుగానే తెలియాలి కదా! లైంగిక నేరారోపణపై తనకు శిక్ష పడబోతున్నదన్న విషయాన్ని ముందుగానే తెలుసుకోలేకపోయిన ఈయన గారికి అన్ని లక్షల మంది శిష్య బృందం ఏమిటో అర్థం కాదు. న్యాయస్థానం విధించబోయే శిక్షకు గురవుతున్న గురువు తమను ఏమి కాపాడతారన్న ప్రశ్న కూడా ఆ శిష్య గణంలో కలుగకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. బలహీనతలు ఉన్న చోటే దోపిడీ కూడా ఉంటుంది. ఆ స్కీమ్‌లు, ఈ స్కీమ్‌లు పేరిట పలువురు మోసపోవడాన్ని మనం చూస్తూనే ఉన్నాం. చుక్క చెమట చిందించకుండా ఉన్న పళాన కోట్లు వచ్చిపడాలన్న స్వార్థం ఉన్నప్పుడు దాన్ని అలుసుగా తీసుకుని మోసం చేసేవారు ఉండకుండా ఎలా ఉంటారు? అలాగే ఫలానా దేవుడిని నమ్ముకుంటే, ఫలానా స్వామి దగ్గరకు వెళితే మంచి జరుగుతుందని అంటారు. ఇక్కడ మంచి అంటే లాభం. దేవుడు ఎక్కడైనా దేవుడే కదా! ఫలానా గుడి మాత్రమే ప్రశస్తమైనది ఎలా అవుతుంది? ఫలానా గుళ్లో ఉన్న దేవుడు చాలా పవర్‌ఫుల్ అని కూడా అంటారు.
ఒకే దేవుడు ఒకచోట పవర్‌ఫుల్‌గా, మరోచోట బలహీనుడిగా ఎందుకుంటాడన్న ఆలోచన మనకు రాదు. ఎందుకంటే ఏదో లాభం కలుగుతుందన్న స్వార్థం మనలో ఉన్నందునే పవర్‌ఫుల్ దేవుళ్ల దగ్గరకే వెళతాం. అలాగే స్వాములు, గురువులు కూడా! శిష్యులకు ఎంతో కొంత లాభం చేకూర్చినప్పుడే స్వాములు, గురువుల పరపతి పెరుగుతూ ఉంటుంది. ఈ మొత్తం వ్యవహారంలో ఉభయపక్షాలకు లాభాపేక్షే ఉంటుంది. గుళ్లు– గోపురాలకు పాపులారిటీ పెరిగేకొద్దీ భక్తుల తాకిడి ఎక్కువై ఆదాయం పెరుగుతుంది. దీంతో పాలకవర్గాలకు సౌఖ్యాలు పెరగడంతో పాటు పరపతి కూడా పెరుగుతుంది. అలా పెరిగిన పరపతిని వ్యక్తిగత ప్రయోజనాలకు వాడుకుంటారు. తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్మన్ పదవి కోసం పలువురు పోటీపడటాన్ని మనం చూస్తున్నాం. వీళ్లల్లో పలువురు స్వామివారి సేవ కోసం కాకుండా, ఆ పదవి ద్వారా తమ వ్యక్తిగత పరపతిని పెంచుకుని తద్వారా లాభపడాలన్న ఉద్దేశంతోనే ఈ పదవిని కాంక్షిస్తున్నారు. గతంలో టీటీడీ చైర్మన్‌గా పనిచేసిన ఒకాయన ఉత్తరాదికి చెందిన పారిశ్రామికవేత్తలు, ఢిల్లీకి చెందిన ఉన్నతాధికారులు వచ్చినప్పుడు దగ్గరుండి మరీ దర్శనం చేయించి, వారి మనస్సులు చూరగొనేవారు. ఆ తర్వాత వ్యక్తిగత పైరవీలు చేసుకునేవారు. ఇందులో దైవ చింతన ఎక్కడుంది? అందుకే ‘దేవుడు చేసిన మనుషుల్లారా... మనుషులు చేసిన దేవుళ్లారా’ అనే పాటను ఎప్పుడో మహాకవి శ్రీశ్రీ ‘దేవుడు చేసిన మనుషులు’ సినిమా కోసం రాశారు. భక్తులు లేని గుళ్లు, శిష్యులు లేని స్వాములు– గురువులు వెలవెలబోతుంటారు. డేరా సచ్చా సౌదా అధిపతి గుర్మీత్ సింగ్ కూడా ఈ కోవకు చెందినవాడే! ఈయనగారు ఏకంగా రెండు చిత్రాలు నిర్మించి వాటిల్లో తానే హీరోగా నటించారు కూడా! సంస్థ లక్ష్యాలకు దూరంగా ఇలాంటి వికారాలు కలిగి ఉన్న వ్యక్తికి ఇన్ని లక్షల మంది శిష్యులు ఉండటం ఏమిటో అర్థం కాదు. ఇంట్లో వారికి ఏమైనా జరిగితే కొద్దిసేపు బాధపడి మర్చిపోయే మనుషులు తాము నమ్మే మతం కోసం, గురువుల కోసం మాత్రం చంపడానికైనా, చావడానికైనా సిద్ధపడటం విషాదం!
మాయమైపోతారు జాగ్రత్త!
శాస్ర్తాలు, మత గ్రంథాలకు వక్రభాష్యం చెప్పి బతికేయడం మన దేశంలో మామూలు విషయమైపోయింది. సాంఘిక దురాచారాలన్నీ ఇందులోంచి వచ్చినవే! ఇలాంటివి అన్ని మతాలలోనూ ఉంటాయి. మనుషులలో ఉండే బలహీనతలతో మత గురువులు అనేవారు ఆడుకుంటుంటారు. ట్రిపుల్ తలాక్ వ్యవహారం కూడా ఇందులో భాగమే! ఎప్పుడుపడితే అప్పుడు, ఎలా పడితే అలా మూడుసార్లు తలాక్ అని చెప్పి విడాకులు ఇవ్వవచ్చునని ముస్లింలు పరమ పవిత్ర గ్రంథంగా భావించే ఖురాన్‌లో పేర్కొనలేదని సుప్రీంకోర్టు విచారణ సందర్భంగా మరోమారు రుజువైంది. అయినా పురుషాధిక్య సమాజంగా చెల్లుబాటు అవుతున్న ముస్లింలలో మహిళలకు ట్రిపుల్ తలాక్ పేరిట అన్యాయం చేస్తున్నారు. అదేమని ప్రశ్నించే వారిని ఖురాన్‌లో చెప్పారంటూ బుకాయిస్తూ వచ్చారు. విడాకులు అనేవి భార్యాభర్తల పరస్పర అంగీకారంతోనే జరగాలి. అట్లాంటిది ఏకపక్షంగా పురుషులు మాత్రమే విడాకులు ఇస్తున్నట్టు ప్రకటించడం చెల్లదని సుప్రీంకోర్టు చక్కటి తీర్పు ఇచ్చింది. ఈ తీర్పుతో ముస్లిం మహిళలకు ఎంతో ఊరట లభించినట్లయ్యింది. ఏ మతమైనా మనుషుల హితం కోరేదిగానే ఉండాలి. మతం పేరిట సాంఘిక దురాచారాలను ప్రోత్సహించేవారు అప్పుడూ, ఇప్పుడూ, ఎప్పుడూ ఉంటారు. హిందూ మతంలో కూడా ఇలాంటి దురాచారాలు ఎన్నో ఉండేవి. ఉంటున్నాయి. ఒకప్పుడు కన్యాశుల్కం, సతీ సహగమనం వంటి దురాచారాలు ఉండేవి.
డబ్బున్న వృద్ధులు ముక్కుపచ్చలారని బాలికల తల్లిదండ్రులకు కన్యాశుల్కం పేరిట ఎదురు కట్నం ఇచ్చి పెళ్లి చేసుకునేవారు. కాలక్రమంలో హిందూ మతంలో ఈ రెండు దురాచారాలూ అంతమయ్యాయి. ఇప్పుడు హైదరాబాద్ పాతబస్తీకి చెందిన పేద ముస్లిం కుటుంబాలలో బాలికలను అరబ్ షేక్‌లుగా చలామణి అవుతున్న వృద్ధులు డబ్బు ఇచ్చి పెళ్లి పేరిట కొనుగోలు చేస్తున్నారు. పేదరికం, అవిద్య ఉన్నచోట ఇలాంటి దురాచారాలు, మూఢ నమ్మకాలు ఉంటూనే ఉంటాయి. ఇందుకు ఏ మతం కూడా మినహాయింపు కాదు. ఉదాహరణకు క్రైస్తవ మతాన్నే తీసుకుందాం. హిందువులలో పేదరికంలో ఉన్నవారిని గుర్తించి వారికి డబ్బులు ఇచ్చి క్రైస్తవ మతంలోకి మారుస్తున్నారు. ఇలా చేయడం వల్ల మతవ్యాప్తి చేస్తున్నవారికి ఉపాధి లభిస్తోంది. మత మార్పిడికి గురైనవారు ఎప్పుడైనా తిరిగి పాత మతంలోకి వెళ్లిపోతారేమోనన్న భయంతో వారిలో పూర్వ మతంపై ద్వేషం నూరిపోస్తుంటారు. ఈ కారణంగానే హిందూ మతం నుంచి క్రైస్తవ మతంలోకి మారినవాళ్లు హిందూ దేవుళ్లను, ప్రసాదాలను ద్వేషిస్తుంటారు. విదేశాలకు చెందిన క్రైస్తవులు మాత్రం ఇవేమీ పట్టకుండా హిందూ దేవాలయాలను సందర్శించుకుని పూజలు కూడా చేస్తారు. హిందూ దేవుడిని పూజించినా, దర్శించుకున్నా, ప్రసాదం తిన్నా పాపం తగులుతుందని ఇక్కడివాళ్లు కొత్తగా మతం మార్చుకున్నవారికి నూరిపోస్తుంటారు. కేన్సర్ వంటి రోగాలు కూడా ఏసు ప్రభువు దయతో నయం అవుతాయని ప్రచారం చేస్తుంటారు. అదే నిజమైతే క్రైస్తవ మతాన్ని ఆచరించే పాశ్చాత్య దేశాలలో ఆసుపత్రులు ఉండకూడదు కదా!
మతంమత్తులో చిక్కుకున్న వారికి ఈ విచక్షణ ఉండదు. హిందూ మతంలో కూడా మంత్రాలతో రోగాలు నయం చేస్తామనే వాళ్లు, వారిని నమ్మి ప్రాణాలు పోగొట్టుకుంటున్న వారిని చూస్తున్నాం. 14 వందల సంవత్సరాల క్రితం ఇస్లాం మతం లేదు. 2017 సంవత్సరాల క్రితం క్రైస్తవ మతం లేదు. కొన్ని వేల సంవత్సరాల వెనక్కి వెళితే హిందూ మతం లేదు. మతాలను, దేవుళ్లను మనమే సృష్టించుకున్నాం. మనల్ని దేవుడు సృష్టించాడో లేదో తెలియదు. మనుషులలో సత్ప్రవర్తనను పెంపొందించడానికే మతాలు, శాస్ర్తాలు, ఆచారాలు పెట్టి ఉంటారు. కాలక్రమంలో వాటికి వక్ర భాష్యాలు చెప్పేవారు పుట్టుకువచ్చారు. క్రైస్తవ మతంతో విభేదించినవారే ఇస్లాం మతాన్ని సృష్టించారని చెబుతారు. అందుకే కాబోలు ఈ రెండు మతాలకు చెందినవారి పేర్లలో కొన్నింటికి సారూప్యత ఉంటుంది. ఇబ్రహీం-– అబ్రహాం, జాన్– జానీ వంటివి మచ్చుకు కొన్ని. ఏ మతంలోనైనా దాన్ని ఆచరించేవారి సంఖ్య పెరిగేకొద్దీ ఆధిపత్యం కోసం కొత్త వర్గాలు ఏర్పడతాయి. హిందూ మతంలో శైవులు, వైష్ణవులు ఉన్నట్టుగానే, క్రైస్తవ మతంలో రోమన్ క్యాథలిక్కులు, ప్రొటెస్టెంట్లు– ఇస్లాంలో షియాలు– సున్నీలు వంటి తెగలు ఏర్పడటం ఇందుకు నిదర్శనం! మత గ్రంథాలను రూపొందించినవారికి ఏ దురుద్దేశాలూ లేవు. విశ్వ మానవాళి సౌభ్రాతృత్వాన్నే ఆయా మత గ్రంథాలు ఆకాంక్షించాయి. కాల క్రమంలో మత పెద్దలుగా చెప్పుకొనేవారు రకరకాల దురాచారాలను, క్రతువులను ఆచరణలోకి తీసుకొచ్చారు. లింగ వివక్ష కూడా ఇందులో భాగమే! తెలుగునాట ఇటీవలి కాలంలో భక్తి అనేది వ్యాపారంగా మారిపోయింది. ఇదివరకు ఎన్నడూ లేని కొత్త కొత్త పూజా విధానాలను పుట్టించారు. రంగు రంగుల దుస్తులలో స్వాములు తయారవుతున్నారు. దీక్షలను సృష్టించారు. మనం మర్చిపోయిన యజ్ఞయాగాదులకు మళ్లీ పురుడు పోశారు. ఇదివరకు పెళ్లిళ్లలో ఒకే బ్రాహ్మణుడు పెళ్లి జరిపించేవాడు. ఇప్పుడు ఆర్థిక స్తోమత ఉన్నవారు డజన్ల కొద్దీ బ్రాహ్మణులతో పెళ్లిళ్లు జరిపిస్తున్నారు. పెళ్లి చేసుకుంటున్నవారికి గానీ, పెళ్లికి వచ్చిన వారికి గానీ సదరు బ్రాహ్మణులు చదివే మంత్రాలు అర్థం కూడా కావు. పెళ్లి అనేది ఇప్పుడు ఆడంబరం అయ్యింది.
ఆంధ్రప్రదేశ్‌లోని కోస్తా జిల్లాలలో ఎప్పుడుచూసినా ఏదో ఒకచోట క్రైస్తవ ప్రార్థనా కూటములు జరుగుతుంటాయి. పాశ్చాత్య దేశాలలో మాత్రం ఇలాంటి కూటములు పెద్దగా జరగవు. రాజ్య విస్తరణ కాంక్ష వలె మత విస్తరణ కాంక్ష కూడా పెరిగిపోతోంది. వీటన్నింటి వెనుక ఎవరి ప్రయోజనాలు వారికి ఉన్నాయి. రాముడు గానీ, క్రీస్తు గానీ, అల్లా గానీ తమను మాత్రమే ఆరాధించాలని చెప్పలేదు. ఆ మాటకొస్తే తాము దేవుళ్లమవుతామన్న విషయం వారికే తెలిసి ఉండదు. ఫలానా గుడికి, ఫలానా మసీదుకు, ఫలానా చర్చికి వెళితే మేలు జరుగుతుందనడం వెనుక ఎవరివో వ్యక్తిగత ప్రయోజనాలు ఇమిడి ఉంటున్నాయి. మతం పేరిట మంచి చేస్తున్నవారి కంటే, మనుషులను బలహీనులుగా చేసి చెడు చేస్తున్నవారి సంఖ్య ఎక్కువగా ఉంటోంది. శాస్త్ర-– విజ్ఞాన– సాంకేతిక రంగాలలో ఎంతగా పురోగమిస్తున్నామో అంతే స్థాయిలో మనలో మూఢ నమ్మకాలు పెరిగిపోతున్నాయి. ఏ దేవుడైనా ఎంత మంది కోరికలు తీర్చగలడు? దేవుళ్లకు మాత్రం విశ్రాంతి ఉండవద్దా? 24 గంటలూ ఎక్కడో ఒకచోట పూజలు చేస్తూ విసిగిస్తే పాపం దేవుళ్ల పరిస్థితి ఏమిటి? మన స్వార్థపూరిత కోరికలు తీర్చలేక దేవుళ్లు కూడా ఎప్పుడో ఒకప్పుడు మాయమైపోతారు జాగ్రత్త!
ఒక దెబ్బకు రెండు పిట్టలు!
ఇప్పుడు మళ్లీ ట్రిపుల్ తలాక్ విషయానికి వద్దాం. మత గ్రంథాలకు వక్రభాష్యం చెప్పడం వల్లనే ఈ దురాచారం పుట్టుకొచ్చింది. ఈ అంశంపై సుప్రీంకోర్టు తాజాగా ఇచ్చిన తీర్పు వల్ల ముస్లిం మహిళలకు ఏ మేరకు మేలు జరుగుతుందో తెలియదు గానీ, కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీకి మాత్రం చాలానే మేళ్లు జరిగే అవకాశం ఉంది. ట్రిపుల్ తలాక్ విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో సెక్యులరిజం పేరిట చొక్కాలు చింపుకొంటున్న నాయకులు, పార్టీల నోటికి తాళం పడింది. ట్రిపుల్ తలాక్ వల్ల ముస్లిం మహిళలకు అన్యాయం జరుగుతున్నదని తెలిసి కూడా ముస్లిం పురుషులకు కోపం వస్తుందన్న భయంతో సెక్యులర్ పార్టీలు, నాయకులు ఇంతకాలం నోరు మెదపలేదు. శంఖంలో పోస్తే తీర్థం అవుతుందన్నట్టుగా ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పుతో ఈ సమస్యకు పరిష్కారం లభించింది. కాగల కార్యం గంధర్వులే నెరవేరుస్తారు అన్నట్టుగా ప్రధానమంత్రి కోరుకున్నది సుప్రీంకోర్టు తీర్పు రూపంలో వెలువడింది. దీంతో ప్రధాని మోదీకి బహుళ ప్రయోజనాలు నెరవేరాయి. సెక్యులరిజం అని అరిచే ప్రతిపక్షాల నోటికి తాళం వేయడంతో పాటు ముస్లిం మహిళల అభిమానాన్ని చూరగొనడం మోదీ సాధించిన విజయాలు. ట్రిపుల్ తలాక్‌కు వ్యతిరేకంగా నరేంద్ర మోదీ మాట్లాడటం మొదలు పెట్టిన నాటి నుంచి ముస్లిం మహిళల్లో ఆయన పట్ల ఆదరణ పెరుగుతున్న దాఖలాలు కనిపిస్తున్నాయి. ఉత్తరప్రదేశ్‌లో ఇటీవల జరిగిన ఎన్నికల ఫలితాలే ఇందుకు నిదర్శనం. ముస్లింలు అధికంగా ఉన్న నియోజకవర్గాలలో కూడా అక్కడ భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు గెలుపొందడం పలువురిని ఆశ్చర్యానికి గురిచేసింది.
ఫలితాల తర్వాత ఏమి జరిగి ఉంటుందా? అని రాజకీయ విశ్లేషకులు ఆరా తీస్తే అసలు విషయం బయటపడింది. ముస్లిం మహిళలు పెద్దపెట్టున తమకు ఓట్లు వేయడం వల్లనే ఆయా నియోజకవర్గాలలో బీజేపీ అభ్యర్థులు గెలుపొందారంటూ ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ముస్లిం వ్యతిరేక పార్టీగా ముద్రపడిన భారతీయ జనతాపార్టీకి చెందిన ప్రధానమంత్రి అయిఉండీ ముస్లిం మహిళల మద్దతును కూడగట్టుకోగలిగారన్న మాట నిజమే అయితే అది నరేంద్రమోదీ సాధించిన రాజకీయ విజయాలలో అతి గొప్ప విజయంగా నిలుస్తుందని చెప్పవచ్చు. ఈ పరిణామాన్ని ఎవరూ ఊహించి ఉండరు. ఉత్తరప్రదేశ్ తరహాలో దేశవ్యాప్తంగా ముస్లిం మహిళలందరూ భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇచ్చే ఆలోచన చేస్తే మోదీకి అంతకంటే కావలసింది ఏమి ఉంటుంది? అదే సమయంలో ముస్లింల ఓటు బ్యాంకుపై ఆధారపడి బతుకుతున్న రాజకీయ పార్టీలకు గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్లు అయ్యింది. సుప్రీంకోర్టు తీర్పు పుణ్యమా అని నరేంద్ర మోదీకి ఒక దెబ్బకు రెండు పిట్టలను కొట్టిన అనుభూతి మిగిలింది. రాజకీయ కోణంలో చూస్తే ఇదంతా బాగానే ఉంది కానీ, ఈ దేశంలో ఉంటున్న ముస్లింలలో అభద్రతాభావం నానాటికీ పెరిగిపోతోంది. ఇటీవల ఒక ముస్లిం మిత్రుడిని ఎలా ఉన్నావు అని ప్రశ్నించగా.. ‘ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నాం’ అని బదులిచ్చాడు. ‘మా చెల్లెలి కూతురు పెళ్లి పక్క రాష్ట్రంలో జరుగుతోంది. పెళ్లి కోసం మాంసం తీసుకు రమ్మంటారా అని అడిగితే, వద్దు వద్దు మాంసం తీసుకుని మీరు రైల్లో వస్తే గోమాంసం అని భావించి ఎవరైనా మిమ్మల్ని చంపేయవచ్చునని మా చెల్లెలు భయంగా అంది’ అని ఆ ముస్లిం మిత్రుడు చెప్పాడు. ముస్లిం మహిళల మనస్సు చూరగొనడానికి ప్రయత్నించినట్టుగానే.. పురుషులలో నెలకొన్న భయాందోళనలు పోగొట్టడానికి కూడా నరేంద్రమోదీ చర్యలను చేపడితే దేశానికి మంచిది!
No comments:
Post a Comment