Thursday, 28 September 2017

పొగడ్తలు, సత్కారాల మాయలో చిక్కుకుపోయారంటే గనుక... సాలెగూటిలో చిక్కుకుంటున్నట్లే....!
సినిమా నటులకు ఫంక్షన్లు చేసుకోవడం, అభినందనలు అందుకోవడం, నలుగురూ పొగుడుతూ ఉంటే ఆనందించడం అనేవిషయాలు ఏమాత్రం థ్రిల్ ఇవ్వవు. నిజానికి వారి జీవితాల్లో అనునిత్యం ఇలాంటివి తారసపడుతూనే ఉంటాయి. సినిమా ఆడియో తదితర ఫంక్షన్ల వేదికల మీద, మన ఊహకు కూడా అందనంత దారుణంగా పొగిడించుకోవడం అనేది కేవలం సినిమా వారికి మాత్రమే సాధ్యం అవుతుంది. అయితే... ఈ సినిమా ఫంక్షన్ల పొగడ్తలు మొత్తం.. వీరబీభత్స హిపోక్రసీతో నిండి ఉంటాయి.
ఆ సంగతి వారికి కూడా తెలుసు. పైకి ఆ పొగడ్తలకు మురిసిపోతున్నట్లు కనిపించినా.. వారి అంతరంగం వారికి పూర్తి సంతృప్తి ఇవ్వదు. అదే సమయంలో.. సినిమాయేతర ప్రతిభ విషయంలో వీసమెత్తు పొగడ్త వచ్చినా కూడా.. వారు ఎంతో మురిసిపోతారు.
ఇప్పుడు పవన్ కల్యాణ్ ను చూస్తోంటే అలాగే అనిపిస్తోంది. ఆయనను ఇండో యూరోపియన్ ఎక్సలెన్స్ అవార్డు ఒకటి వరించింది. ఉద్దానం కిడ్నీ బాధితుల విషయంలో చూపించిన చొరవకు సంబంధించి ఈ అవార్డుకు ఎంపిక చేసినట్లు ప్రదాతలు ప్రకటించారు. అయితే చాలా మంది పవన్ అభిమానులు, హితులు మాత్రం... దీనిమీద భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. పవన్ కు ఇలాంటి అవార్డులతో కొత్తగా వచ్చే కీర్తి ప్రతిష్టలు ఏమీ లేదని.. అయితే.. ఇలాంటి మాయలో పవన్ పడ్డారంటే గనుక.. రాజకీయ జీవితంలో ఇలాంటి ఎర వేసి.. ఆయనను డైవర్ట్ చేయడానికి చూసేవారు చాలా మందే అడుగడుగునా తారసపడుతుంటారనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
తద్వారా తప్పుడు సంకేతాలను ప్రజల్లోకి పంపినట్లు అవుతుందని అనుకుంటున్నారు. అసలే రాజకీయ నాయకులు కూడా పొగడ్తలకు పడిపోతూ ఉంటారు. సినిమా హీరో నుంచి రాజకీయ నాయకుడిగా ట్రాన్స్ ఫార్మ్ అయ్యే దశలో ఉన్న పవన్ కల్యాణ్ తొలిదశలోనే ఇలాంటి అవార్డులకు లొంగారంటే గనుక... ఇక ఆ మాయలోనే ఉండిపోతారని... ఆయనకు ఎరవేయాలనుకునే వారంతా సన్మానాలు , సత్కారాలు, అవార్డులు ఏర్పాటు చేస్తుంటారని భయపడుతున్నారు. అసలే ఈ సన్మానాల ఊబిలో చిక్కుకున్న నాయకులు ఎలా వాటికోసం వెంపర్లాడుతూ గడుపుతుంటారో కళ్ల ముందు అనేక తార్కాణాలు ఉన్నాయని కూడా అనుకుంటున్నారు. మరి పవన్ తన హితుల అభ్యంతరాల్ని పరిగణిస్తారో లేదో...?

No comments: