Monday, 9 October 2017

హేతు దృక్పథం లేని చంద్రబాబు పాలన-- డాక్టర్‌ కత్తి పద్మారావు
మన రాష్ట్ర ప్రభుత్వం అప్పుల్లో కూరుకు పోయినట్టు ప్రచారం చేసుకుంటోంది. లక్షా 56 వేల కోట్ల వార్షిక బడ్జెట్‌ను దేనికి ఖర్చు పెట్టారో శ్వేతపత్రం విడుదల చేయాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఉంది.
పిల్లలకు బడులు పోయాయి. ఊరు దోమల మయమై తెల్ల పొడి చల్లే దిక్కు లేకుండా పోయింది. ఆస్పత్రులు నరక కూపాలయ్యాయి. ఉడికీ ఉడకని గుడ్లు, అన్నం పెట్టి బడి పిల్లల ఉసురు తీశారు. కార్పొరేట్‌ విద్యాలయాల్లో ఒత్తిడికి చిన్నారులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. యువకులు మత్తు మందులకు అలవాటు పడుతున్నారు. 80 శాతం పురుషులు తాగి జోగుతున్నారు.
రాజకీయ నాయకులు కాంట్రాక్టర్లుగా, సారా కాంట్రాక్టర్లుగా, భూదందాకోరులుగా, వ్యాజ్యాలు తీర్చే పెద్ద మనుషులుగా వివిధ మార్గాల్లో జీవిస్తున్నారు.
చదువుకున్న వారికి ఉద్యోగాలు లేవు. ఉద్యోగాలిప్పిస్తామని డబ్బు దండుకునే బ్రోకర్లు వారిని మోసం చేస్తున్నారు. ఉద్యోగం లేనిదే పెళ్ళి లేదని, పదుల ఎకరాల భూమి ఉన్నా కూడా ట్రాక్టర్‌ తోలుకునే వాడికి పిల్లనివ్వమనే న్యూనతా భావం రాష్ట్రంలో వచ్చింది. వ్యవసాయం మీద తక్కువ భావాన్ని కల్పించింది చంద్రబాబు గారే అనేది స్పష్టమైన విషయం.
ఈ ఆర్థిక సంవత్సరం వరకు రూ.2.16 లక్షల కోట్లు రుణ భారం ఉంటుందని అంచనా వేస్తే ఆగస్టు నెలాఖరుకే అది రూ. 2.26 లక్షల కోట్లకు చేరుకుంది. ఆగస్టు నెలాఖరుకు ఆర్థిక లోటు రూ.16,272 కోట్లు వుంది. ఈ ఏడాది ఇది రూ. 23,054 కోట్లుంటుందని అంచనా వేశారు. ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే రెట్టింపు అయ్యే సూచనలున్నాయి. అసలు ఆంధ్రప్రదేశ్‌ అప్పుల్లో మునగాల్సిన అవసరమే లేదు.
కోటి 20 లక్షల ఎకరాల భూమిని సాగుకు సిద్ధం చేసుకోవాల్సిన బాధ్యతను చంద్రబాబు మరచిపోయారు. కృష్ణపట్నం నుంచి కొత్తపట్నం వరకు ప్రపంచ ప్రఖ్యాతి చెందిన పోర్టులు ఎన్నో ఉన్నాయి. అవి అభివృద్ధికి నోచుకోలేదు.
చంద్రబాబు కాలంలో రవాణా రంగం వేగంగా ప్రయివేటీకరణ అవుతోంది. ఒక్క రవాణా రంగమే కాదు, అన్ని వ్యవస్థలను ప్రయివేటీకరించడమే చంద్రబాబు పనిగా వుంది. ప్రభుత్వ రంగాలు ప్రయివేటు పరమయ్యే కొద్దీ ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఉద్యోగాలు తగ్గి పోతున్నాయి. చంద్రబాబుకు ప్రభుత్వ రంగం మీదే కాదు, ప్రభుత్వ నిర్వహణ మీద కూడా ఆసక్తి లేదు.
-ప్రజాశక్తి ,Oct 10, 2017

No comments: