జ్ఞానయోగః 3 (అథ చతుర్థోధ్యాయః, శ్రీ భగవద్గీత)
యస్య సర్వే సమారంభాః
కామసంకల్పవర్జితాః,
జ్ఞానాగ్ని దగ్ధకర్మాణం
తమాహుః పణ్డితం బుధాః.
ఎవనియొక్క సమస్తకర్మలు కోరిక, సంకల్పము అనునవిలేకుండునో, జ్ఞానమను అగ్ని చేత దహింపబడిన కర్మలుగల అట్టివానిని పండితుడని విజ్ఞులు పేర్కొందురు.
త్యక్త్వా కర్మఫలాసజ్గం
నిత్యతృప్తో నిరాశ్రయః,
కర్మణ్యభి ప్రవృత్తోపి
నైవ కించిత్కరోతి సః.
ఎవడు కర్మఫలములందాసక్తిని విడనాడి నిరంతరము సంతృప్తిగలవాడై దేనిని ఆశ్రయించకయొండునో, అట్టివాడు కర్మములందు ప్రవర్తించినను ఒకింతైనను చేయనివాడే యగును .
నిరాశీర్యతచిత్తాత్మా
త్యక్త సర్వపరిగ్రహః,
శారీరం కేవలం కర్మ
కుర్వన్నాప్నోతి కిల్బిషమ్.
ఆశలేనివాడును, ఇంద్రియమనంబులను నిగ్రహించినవాడును, ఏ వస్తువును పరిగ్రహింపనివాడునగు మనుజుడు శరీరమాత్రముచేత (దేహధారణాది) కర్మమును చేసినను పాపము నొందడు.
యదృచ్ఛాలాభ సంతుష్టో
ద్వంద్వాతీతో విమత్సరః,
సమః సిద్ధావసిద్ధౌ చ
కృత్వాపి న నిబధ్యతే.
అప్రయత్నముగ లభించినదానితో సంతుష్టిని బొందువాడును, సుఖదుఃఖాది ద్వంద్వములను దాటినవాడును, మాత్సర్యములేనివాడును, ఫలముయొక్క ప్రాప్తాప్రాప్తములందు సమబుద్ధిగలవాడు (లేక కార్యము సిద్ధించినను సిద్ధింపకున్నను సమభావముతో నుండు వాడు) నగు మనుజుడు కర్మము చేసినను బంధింపబడడు..
గతసజ్గస్య ముక్తస్య
జ్ఞానావస్థితచేతసః,
యజ్ఞాయాచరతః కర్మ
సమగ్రం ప్రవిలీయతే.
దేనియందును సంగము (ఆసక్తి) లేనివాడును (రాగద్వేష కామక్రోధాదిరూప సంసారబంధముల నుండి) విముక్తుడును, ఆత్మజ్ఞానమందే మనస్సు నిలుకడకలవాడును, భగవత్ప్రీత్యర్థము (లేక పరప్రాణి హితార్థము, లేక ధర్మము నిమిత్తము) కర్మము నాచరించువాడునగు మనుజుని యొక్క కర్మయావత్తు విలీనమై పోవుచున్నది. జన్మబంధాదులను గలిగింపక నశించుచున్నది.
బ్రహ్మార్పణం బ్రహ్మహవి
ర్బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతమ్,
బ్రహ్మైవ తేన గంతవ్యం
బ్రహ్మకర్మ సమాధినా.
యజ్ఞమునందలి హోమసాధనములు, హోమద్రవ్యములు. హోమాగ్ని, హోమము చేయువాడు హోమము చేయబడినది - అన్నియును బ్రహ్మస్వరూపములే యనెడి ఏకాగ్రభావముతో ఆ యజ్ఞాది కర్మలను జేయు మనుజుడు బ్రహ్మమునే పొందగలడు.
దైవ మేవాపరే యజ్ఞం
యోగినః పర్యుపాసతే,
బ్రహ్మాగ్నావపరే యజ్ఞం
యజ్ఞేనై వోపజుహ్యతి.
కొందఱు యోగులు దేవతారాధనరూపమైన యజ్ఞమునే అనుష్టించుచున్నారు. మఱికొందఱు జీవబ్రహ్మైక్యభావనచే జీవుని పరబ్రహ్మమను అగ్నియందు హోమము చేయుచున్నారు. (ఆహుతి నొనర్చుచున్నారు).
శ్రోత్రాదీనీంద్రియాణ్యన్యే
సంయమాగ్నిషు జుహ్వతి,
శబ్దాదీన్విషయానన్య
ఇంద్రియాగ్నిషు జుహ్వతి
కొందఱు చెవి మొదలగు ఇంద్రియములను నిగ్రహమనెడి అగ్నులందును, మఱికొందఱు శబ్దాది విషయములను ఇంద్రియములనెడి అగ్నులందును హోమము చేయుచున్నారు.
సర్వాణీంద్రియకర్మాణి
ప్రాణకర్మాణి చాపరే,
ఆత్మసంయమయోగాగ్నౌ
జుహ్వతి జ్ఞానదీపితే.
మఱికొందరు ఇంద్రియములయొక్క వ్యాపారము లన్నిటీ ప్రాణములయొక్క వ్యాపారములన్నిటిని జ్ఞానముచే ప్రకాశింపజేయబడిన 'మనోనిగ్రహ' యోగమను (సమాధియోగమను) అగ్నియందు హోమము చేయుచున్నారు.
No comments:
Post a Comment