Wednesday, 10 January 2018

జ్ఞానయోగః 1 (అథ చతుర్థోధ్యాయః, శ్రీ భగవద్గీత)

శ్రీ భగవానువాచ :-
ఇమం వివస్వతే యోగం
ప్రోక్తవా నహ మవ్యయమ్‌,
వివస్వాన్‌ మనవే ప్రాహ
మను రిక్ష్వాకవే బ్రవీత్‌.

భగవంతుడగు శ్రీకృష్ణపరమాత్మ యిట్ల పలికెను - ఓ అర్జునా! నాశరహితమగు ఈ నిష్కామకర్మయోగమును (తద్ద్వారా పొందబడు జ్ఞానానిష్ఠను) పూర్వము నేను సూర్యునకు జెప్పితిని. సూర్యుడు వైవస్వత మనువున కుపదేశించెను. మనువు ఇక్ష్వాకువునకు బోధించెను.

ఏవం పరంపరాప్రాప్త
మిమం రాజర్షయో విదుః,
స కాలేనేహ మహతా
యోగో నష్టః పరంతప‌‌‌.

ఓ అర్జునా! ఈ ప్రకారముగ పరంపరగా వచ్చిన ఈ నిష్కామ కర్మయోగమును రాజర్షులు తెలిసికొనిరి. చాలాకాలము గడచినందున ఆయోగ మిపుడీ లోకమున అదృశ్యమైనది. (ప్రచారములో లేకున్నది).

స ఏవాయం మయా తేద్య
యోగః ప్రోక్తః పురాతనః,
భక్తోసి మే సఖాచేతి
రహస్యం హ్యేత దుత్తమమ్‌.

నీవు నాభక్తుడుగను, మిత్రుడుగను నున్నావు. కావున ఆ పురాతనమైన నిష్కామకర్మ యోగమునే యిపుడు తిరిగి నీకు జెప్పితిని. అది మిగుల శ్రేష్ఠమైన దనియు రహస్యమైనదనియు నెఱుగుము.

అర్జున ఉవాచ:-
అపరం భవతో జన్మ 
పరం జన్మ వివస్వతః,
కథ మేత ద్విజానీయాం
త్వమాదౌ ప్రోక్తవానితి‌.

అర్జునుడు చెప్పెను:- ఓ కృష్ణా! మీ జన్మము ఇటీవలిది. సూర్యుని జన్మము బహు పురాతనమైనది. అట్టిచో మీరు సూర్యున కుపదేశించితిరను విషయమును నేనెట్లు గ్రహించగలను?

శ్రీ భగవానువాచ:-
బహూని మే వ్యతీతాని
జన్మాని తవ చార్జున,
తా న్యహం వేద సర్వాణి‌
న త్వం వేత్థ పరంతప

శ్రీ భగవానుడిట్లు పలికెను:- శత్రువులను తరింపజేయు ఓ అర్జునా! నీకును, నాకును ఇంతవర కనేక జన్మలు గడిచినవి. వాని నన్నిటిని నే నెఱుగుదును. నీ వెఱుగవు.

అజోపి సన్నవ్యయాత్మా
భూతానా మీశ్వరోపి సన్‌,
ప్రకృతిం స్వామధిష్ఠాయ
సంభవామ్యాత్మమాయయా.

నేను పుట్టుకలేనివాడను, నాశరహిత స్వరూపము కలవాడను. సమస్త ప్రాణులకు ఈశ్వరుడను అయి యున్నప్పటికి స్వకీయమగు ప్రకృతిని వశపరచుకొని నా మాయాశక్తి చేత పుట్టుచున్నాను. (అవతరించుచున్నాను). 

యదా యదా హి ధర్మస్య
గ్లానిర్భవతి భారత,
అభ్యుత్థాన మధర్మస్య
తదాత్మానం సృజామ్యహమ్‌‌.

ఓ అర్జునా! ఎప్పుడెప్పుడు ధర్మము క్షీణించి అధర్మము వృద్ధియగుచుండునో అప్పుడప్పుడు నన్ను నేనే సృష్టించుకొనుచుందును. (అవతరించు చుచందును).

పరిత్రాణాయ సాధూనాం
వినాశాయ చ దుష్కృతామ్‌,
ధర్మసంస్థాపనార్థాయ
సంభవామి యుగే యుగే‌‌.

సాధుసజ్జనుల సంరక్షించుట కొఱకును, దుర్మార్గులను వినాశ మొనర్చుటకొఱకును, ధర్మమును లెస్సగ స్థాపించుట కొఱకును నేను ప్రతియుగము నందును అవతరించు చుందును.

జన్మ కర్మ చ మే దివ్య
మేవం యో వేత్తి తత్త్వతః,
త్యక్త్వా దేహం పునర్జన్మ
నైతి మామేతి సోర్జున‌‌.

అర్జ్జునా! ఎవడీ ప్రకారముగ నాయొక్క దివ్యమైన జన్మమును, కర్మమునుగూర్చి యథర్థముగ తెలిసికొనుచున్నాడో, అట్టివాడు మరణానంతరము మఱల జన్మమునొందక నన్నే పొందుచున్నాడు. (మోక్షమును బడయుచున్నాడు). 

No comments: