Saturday, 13 January 2018

కర్మయోగః 1 (అథ తృతీయోధ్యాయః, శ్రీ భగవద్గీత)

అర్జున ఉవాచ:
జ్యాయసీ చేత్కర్మణస్తే
మతా బుద్ధి ర్జనార్దన,‌
తత్కిం కర్మణి ఘోరేమాం
నియోజయసి కేశవ.

అర్జునుడు చెప్పెను: ఓకృష్ణా! జ్ఞానము కర్మము కంటె శ్రేష్ఠమైనదని మీ యభిమతమగుచో, మఱి యీ భయంకరమైన (యుద్ధ) కర్మమునందు నన్నేల ప్రవర్తింప జేయుచున్నారు?

వ్యామిశ్రేణేవ వాక్యేన
బుద్ధిం మోహయసీవ మే
తదేకం వద నిశ్చత్య
యేన శ్రేయోవామాప్నుయామ్‌.

(ఓ కృష్ణా!) మిశ్రమమైన దానివలెనున్న, వాక్యముచేత నా బుద్ధిని కలవర పెట్టువానివలెనున్నారు. కావున నేను దేనిచే శ్రేయమును పొందగలనో అట్టి యొకదానిని (కర్మ, జ్ఞానములలో) నిశ్చయించి నాకు జెప్పుడు. 

శ్రీ భగవానువాచ:
లోకేస్మిన్‌ ద్వివిధా నిష్ఠా
పురా ప్రోక్తా మయానఘ,
జ్ఞానయోగేన సాంఖ్యానాం
కర్మయోగేన యోగినామ్‌‌.

శ్రీ భగవానుడు చెప్పెను. పాపరహితుడవగు ఓ అర్జునా! పూర్వమీలోకమున సాంఖ్యులకు (తత్త్వ విచారణాపరులకు) జ్ఞానయోగము, యోగులకు కర్మ యోగము అను రెండు విధములగు అనుష్ఠానము నాచే జెప్పబడియుండెను.

న కర్మణా మనారంభా
న్నైష్కర్మ్యం పురుషోశ్నుతే,
న చ సన్న్యసనాదేవ
సిద్ధిం సమధిగచ్ఛతి.

మనుజుడు కర్మలనాచరింపకపోవుటవలన నిష్క్రియమగు ఆత్మస్వరూపస్థితిని పొందజాలడు. కర్మత్యాగమాత్రముచే మోక్షస్థితిని ఎవడును పొందనేరడు.

న హి కశ్చిత్ష్కణమపి
జాతు తిష్ఠత్యకర్మకృత్‌,
కార్యతే హ్యవశః కర్మ
సర్వః ప్రకృతిజై ర్గుణైః.

(ప్రపంచమున) ఎవడును ఒక్క క్షణకాలమైనను కర్మము చేయక ఉండనేరడు. ప్రకృతివలన బుట్టిన గుణములచే ప్రతివాడును బలత్కారముగ కర్మములను చేయుచునే యున్నాడు.

కర్మేంద్రియాణి సంయమ్య
య ఆస్తే మనసా స్మరన్‌
ఇంద్రియార్థాన్విమూఢాత్మా
మిథ్యాచార స్స ఉచ్యతే.

ఎవడు కర్మేంద్రియ జ్ఞానేంద్రియములను అణచిపెట్టి మనస్సుచేత ఇంద్రియములయొక్క శబ్దాది విషయములను చింతించుచుండునో, మూఢచిత్తుడగు అట్టి మనుజుడు కపటమైన ఆచరణగలవాడని చెప్పబడుచున్నాడు.

యస్త్వింద్రియాణి మనసా‌
నియమ్యారభతే ర్జున,
కర్మేంద్రియైః కర్మయోగ
మసక్తస్స విశిష్యతే.

ఓ అర్జునా! ఎవడు ఇంద్రియములన్నిటిని మనస్సుచే నియమించి, వానిచే కర్మయోగమును సంగములేనివాడై ఆచరించునో ఆతడుత్తముడు.

నియతం కురు కర్మత్వం
కర్మజ్యాయో హ్యకర్మణః,
శరీరయాత్రాపి చ తే
న ప్రసిద్ధ్యేదకర్మణః

(ఓ అర్జునా!) నీవు (శాస్త్రములచే) నియమితమైన కర్మను జేయుము. కర్మచేయకుండుటకంటె చేయుటయే శ్రేష్ఠము. మఱియు కర్మ చేయకపోవుట వలన నీకు దేహయాత్రకూడా సిద్ధింప నేరదు.

యజ్ఞార్థాత్కర్మణోన్యత్ర
లోకోయం కర్మబంధనః,
తదర్థం కర్మ కౌంతేయ
ముక్తసజ్గ స్సమాచర.

ఓ అర్జునా! యజ్ఞముకొఱకైన ( భగవత్ప్రీతికరమైన లేక లోకహితార్థమైన) కర్మముకంటె ఇతరమగు కర్మముచే జనులు బంధింపబడుదురు. కాబట్టి ఆ యజ్ఞముకొఱకైన కర్మమునే సంగరహితుడవై (ఫలాసక్తి లేక) యాచరింపుము. 

No comments: