Tuesday, 23 January 2018

సుభాష్ చంద్రబోస్...!
నాకు మీ రక్తాన్ని ఇవ్వండి , నేను మీకు స్వాతంత్ర్యాన్ని తెస్తాను,
స్వాతంత్ర్యం అంటే బిచ్చమడిగి తీసుకునేది కాదు పోరాడి సాధించుకునేది అంటూ యువతలో చైతన్యాన్ని రగిల్చి , దేశం కోసం సర్వస్వం అర్పించి , దేశనాయకుల ముసుగు వేసుకున్న మేధావుల వెనుక అనామకుడిలా మిగిలిపోయి అజ్నాతంలోకి వెళ్ళిపోయి అనాధలా చచ్చిపోయిన మరొక దురదృష్ట దేశభక్తుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్.
మన దేశానికి స్వాతంత్ర్యాన్ని ఎలా సాధించాలి అనే విషయంలో సుభాష్ చంద్రబోస్ కు గాంధీకీ మద్య తీవ్ర విభేధాలు ఉండేవి. సాయుధ పోరాటంతోనే స్వాతంత్ర్యం సాధించగలమని భావించే సుభాష్ చంద్రబోస్ ను అణచివేయాలనీ , అతన్ని ఓడించి కాంగ్రేస్ నుంచి బయటకు పంపాలనీ ఎంతో ప్రయత్నించాడు గాంధీ. కానీ గాంధీ ప్రయత్నాలు సుభాష్ చంద్రబోస్ ముందు సాగలేదు. గాంధీకి వ్యతిరేకంగా నిలబడి ఏకంగా కాంగ్రేస్ అద్యక్షుడిగా ఎన్నికైనా , గాంధీ వైఖరిని, కాంగ్రేస్ నాయకుల చేతకానితనాన్నీ నిరసిస్తూ కాంగ్రేస్ కు రాజీనామా చేసి బయటకు వచ్చి తనదైన శైలిలో రేడియో ఉపన్యాసాలు ఇచ్చి ఎంతోమందికి స్పూర్తినిచ్చి, ప్రభావితం చేసి , యువకులను పోరాటయోధులుగా మార్చాలనే ఉద్దేశ్యంతో ఆజాద్ హింద్ ఫౌజ్ ను స్ధాపించి యువతకు యుద్దవిద్యల్లో బ్రిటీష్ ప్రభుత్వం గడగడలాడేలా అత్యద్భుతమైన శిక్షణ ఇచ్చాడు బోస్.
తమ ఉనికికి భంగం కలుగుతుందని భయపడే దుర్మార్గులతో పాటు తమ అధికారానికి కాలం చెల్లుతుందని భయపడే ఆంగ్లేయులు కోరుకునేది ఒక్కటే బోస్ ని జైలులో బంధించి తమకు అడ్డు తొలగించుకోవడం. బోస్ ను పట్టుకోవడానికీ, పట్టించడానికీ తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్న సమయంలో 1945లో సుభాష్ చంద్రబోస్ విచిత్రంగా అదృశ్యం అయ్యాడు. ఆ తరువాత అతను తైవాన్ వద్ద విమాన ప్రమాదంలో మరణించాడని వార్తలు వచ్చాయి. కానీ బ్రిటీష్ గవర్నమెంట్ తో పాటు బోస్ అభిమానులు కూడా ఇది నిజమని నమ్మలేదు. బోస్ అజ్నాతంలోకి వెళ్ళేందుకే ఈ వ్యూహాన్ని పన్నినట్లు భావించారు.
బోస్ మరణంపై 1956 లో ఏర్పాటు చేసిన షానవాజ్ కమిటీ బోస్ మరణించాడని చెప్తే, అదే కమిటీలో సభ్యుడిగా ఉన్న బోస్ సోదరుడు నిజనిర్ధారణ విషయంలో తప్పుడు అభిప్రాయాలను బలవంతంగా రుద్ది కాంగ్రేస్ ప్రభుత్వం ఉద్దేశ్యపూర్వకంగా నిజాలను సమాధి చేస్తుందని ఆరోపించాడు. ఆ తరువాత 1999 నుంచి 2006 వరకూ విచారణ చేసిన ముఖర్జీ కమీషన్ అసలు బోస్ మరణించాడని చెబుతున్న సమయంలో తైవాన్ లో ఏ విమాన ప్రమాదమూ జరగలేదని నివేదిక సమర్పించడం విశేషం. సైనిక పత్రాలలో కూడా బోస్ మరణించినట్లు ఎక్కడా లేకపోవడం గమనార్హం.
దేశప్రయోజనాలకు సంబంధించిన కొన్ని పరస్పర ఒప్పందాల దృష్ట్యా సుభాష్ చంద్రబోస్ ను సైబీరియా జైల్లో బంధించినమాట వాస్తవం. రష్యాలోని భారత రాయభారిగా ఉన్న నెహ్రూ సోదరి విజయలక్ష్మి పండిట్ కు ఆయన్ను చూసే అవకాశం కల్పించినట్లు రామకృష్ణ మిషన్ ప్రతినిధి రధిన్ మహరాజ్ ఆరోపించిన విషయం కూడా నిజమే. తరువాత సోవియట్ గూఢచార సంస్ధకు చెందిన ఒక ఉద్యోగి కూడా తన జీవితచరిత్రలో ఇదే విషయాన్ని బయటపెట్టాడు. 1946 అక్టోబర్ నెలలో రష్యా కేబినెట్ చర్చల్లో బోస్ ను ఎక్కడ ఉంచాలనే విషయం మీద కూడా చర్చలు జరిగినట్లు రికార్డులు ఉన్నాయి.
బోస్ అదృశ్యం వెనుక ఉన్న రహస్యాలు గాంధీ, నెహ్రూలకి తెలుసని చాలామంది నమ్ముతారు. బోస్ ని విడిపించే అవకాశం ఉన్నా అతనిని ఇండియాకు తీసుకువస్తే అతనికి తమకన్నా అధిక ప్రాధాన్యత చేకూరుతుందనీ , తమ గుర్తింపుకే ప్రమాదమనీ భావించి బోస్ అదృశ్యం గురించిన ఎటువంటి సమాచారాన్నీ అప్పటి కాంగ్రేస్ ప్రభుత్వం కానీ, నాయకులు కానీ సేకరించే ప్రయత్నం చేయలేదు. దేశంలో అల్లరు జరుగుతాయన్న కారణంతోనూ, బోస్ విషయంలో తమ వ్యవహారశైలిపై ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందన్న కారణం తోనూ విజయలక్ష్మీ పండిట్ నోరు నొక్కి నిజాన్ని సమాధి చేయడంలో గాంధీ నెహ్రూల పాత్ర చాలా ఉంది. వీరి భయానికి అర్ధం ఉంది, అసలు స్వాతంత్ర్యం వచ్చే సమయానికి సుభాష్ చంద్రబోస్ గనుక భారతదేశంలో ఉండి ఉంటే భారత ప్రధాని అయ్యేది ముమ్మాటికీ సుభాష్ చంద్రబోస్ యే గానీ జవహార్ లాల్ నెహ్రూ కాదు.
బోస్ చనిపోయాడని ప్రకటించాక కూడా బోస్ కుటుంబీకులకు, బంధుమిత్రులకు వచ్చే ఉత్తరాలను చించి చదివి, బోస్ ఆచూకీకి సంబంధించిన ఉత్తరాలనూ, ప్రభుత్వానికి ఇబ్బంది కలిగించే ఉత్తరాలనూ ప్రభుత్వ ఆధీనంలోని రహస్యపత్రాలతోపాటు భద్రపరచమని స్వయంగా నెహ్రూ ఆదేశించడం , ఆ తరువాత ఇందిరాగాంధీ కూడా దాదాపుగా 1971 వరకూ బోస్ కుటీంబీకులకు వచ్చే ఉత్తరాల మీద , కలిసే వ్యక్తుల మీద నిఘా ఉంచడం వంటివి చూస్తే ఏం జరిగి ఉంటుందో ప్రజలు ఊహించుకోవచ్చు.
నేతాజీ సుభాష్ చంద్రబోస్ మరణాన్ని గురించి కొత్తగా చెప్పడానికేం లేదు, దేశం కోసం అన్నీ పోగొట్టుకుని అనాధల్లా, అభాగ్యుల్లా మారిన వేలాది నాయకుల్లో అతనూ ఒకడు, అంతే...! దేశ చరిత్రలో అతని మరణం ఒక మిస్టరీ. సైబీరియా జైలులో చిత్రహింసలు అనుభవించి చివరిస్ధితిలో అత్యంత దీనమైన స్ధితిలో సరైన ఆహారం , సరైన వస్త్రాలు లేక అనారోగ్యంతో క్రుంగి కృశించి అనాధలా మరణించాడు. చివరికి అతని మృతదేహం కూడా మనకి దక్కలేదు. దటీజ్ ఇండియన్ పాలిటిక్స్....!
సుప్రసిద్ధ స్వాతంత్ర్య సమరయోధుడు, ఇండియన్ నేషనల్ ఆర్మీ 'ఆజాద్ హింద్ ఫౌజ్' స్ధాపకుడు, సాయుధపోరాట యోధుడు, ధైర్యశాలి, స్పూర్తిప్రధాత , విప్లవవీరుడు, బ్రిటీష్ ప్రభుత్వ క్రౌర్యానికీ, అహింసావాదుల మూఢత్వానికీ , కాంగ్రేస్ ప్రభుత్వ నిర్లక్ష్యానికీ, మనదేశాన్ని ఏలిన కొన్ని రాజకీయ కుటుంబాల కుట్రలకీ, పదవీకాంక్షతో నోరు మెదపని కొందరు మూర్ఖుల స్వార్ధానికీ, బలి అయిపోయిన సుభాష్ చంద్రబోస్ జయంతి నేడు (23/1/1897).
LikeShow more reactions
Comment
Comments

No comments: