Tuesday, 1 May 2018

🌺ఓం నమో భగవతే శ్రీ రమణాయ🌸
ఒక భక్తుడు ఏడుస్తూ " స్వామి ! నేను మహా పాపిని ; తమ పాదాల దగ్గిరికి చాలాకాలం నుంచి వస్తున్నాను ; కాని నాలో ఏ మార్పు లేదు ; నేను బాగుపడేది ఎట్లా ... ? ఎన్నటికి ... ? ఇక్కడ ఉన్నంతకాలం యోగ్యుణ్నే , కాని ఇక్కడ నుంచి వెళ్లిన మరుక్షణం నేను మనిషిని కాదు , మహా పాపిని ” అని అన్నారు .
మహర్షి : నువ్వేమైతే నాకేం ! నా ముందు ఎందుకు
ఏడుస్తావు ! నీకూ , నాకు ఏం సంబంధం !
భక్తుడు : మీరే నా గురువు ; మీరే గతి ; మీరే అట్లా
అంటే , నేనేమైపోను ! నాకింక దిక్కేమిటి !
మహర్షి : నేను నీ గురువునా ! ఎవరు చెప్పారు , నేను నీ
గురువునని నేను అన్నానా !
భక్తుడు : మరి మీరు కాకపోతే , నా గురువు ఇంకెవరు !
ఈ లోకంలో నాకింక దిక్కెవరు ! మీరు
కరుణించి నన్ను పావనుణ్ని చేస్తావనే కదా
నేను బతుకుతోంది !
మహర్షి : నేను నీ గురువునైతే నాకు గురుదక్షిణ
ఏమి ఇచ్చావు !
భక్తుడు : మీరు ఏమీ తీసుకోరు గదా !
మహర్షి : నీ కెట్లా తెలుసు నేను తీసుకోనని ! నేను
చెప్పానా , నాకు గురుదక్షిణ అక్కర్లేదని !
సరే, ఇప్పుడడుగుతున్నాను ఇయ్యి. ఇస్తావా !
భక్తుడు : ఏమి కావాలో తీసుకోండి .
మహర్షి : ముందు నీ పుణ్యం నాకు ధారపొయ్యి .
భక్తుడు : నాకేమన్నా పుణ్యమనేది వుంటేగా ,
మీకు ఇవ్వడానికి !
మహర్షి : ఆ సంగతి నీ కెందుకు ... ?
ఉన్న పుణ్యమేదో నాకిచ్చెయ్యి , ఇచ్చేస్తావా !
భక్తుడు : ఎట్లా ఇయ్యను .... ?
ఇయ్యడం ఎలాగో మీరే చెప్పండి ఇస్తాను.”
మహర్షి : నా పుణ్యంతో నాకేమి నిమిత్తం లేదు . దాని
వల్ల వచ్చే ఫలితం నా కక్కరలేదు . అంతా
మీకిచ్చేస్తున్నాను అని మనస్ఫూర్తిగా చెప్పు .
భక్తుడు : అట్లాగే స్వామీ ! గురుదక్షిణ కింద నా
పుణ్యమంతా సంతోషంగా అర్పిస్తున్నాను .
మహర్షి : సరే ; ఇప్పుడు గురుదక్షిణ కింద నీ పాపం
అంతా ఇవ్వు.
భక్తుడు : అయ్యో ! మీకు తెలీదు స్వామీ ; నేనెటువంటి
పాపాలు చేశానో ! తెలిస్తే ఆ మాట మీరు
అనరు . నా పాపాలు తీసుకున్నారా, వాటి
ఘోరంతో తమ శరీరం ఉడికిపోతుంది .
వద్దు , వద్దు . నా పాపాలు కోరకండి .”
మహర్షి : ఆ సంగతి నేను చూసుకుంటాను . ఇచ్చెయ్యి .
భక్తుడు : నేను చేసిన పాపాలు నావి కావు .వాటి
ఫలితమూ అంతా రమణులదే.”
మహర్షి : సరే ; ఇక నుంచి నీకు పాపపుణ్యాలు లేవు .
పుణ్యపాపాలు లేని పరిశుద్ద ఆత్మవి నీవు .
నువ్వు నీలాగనే వుండిపో .
మహర్షి మాటలతో గొప్ప శాంతిని పొంది ఆనందంతో వెళ్లిపోయారు ఆ భక్తుడు ; ఏమైనాడో తెలియదు ; మళ్ళీ ఆశ్రమానికి తిరిగి రాలేదు .
🌺ఓం తత్సత్🌸

No comments: