Noorbasha Rahamthulla
వర్గాతీత మానవుణ్ణి చూపించండి (ఆంధ్రజ్యోతి 30.6.2018)
శ్రమలు చెయ్యనివాళ్ళు, ఏ ఉత్పత్తులతో జీవిస్తారు? - రాత్రింబవళ్ళూ శ్రమలు చేసే బానిసలు చేసే ఉత్పత్తులతోనే! అంటే, బానిసల శ్రమలలో, అత్యధిక భాగం, ఏ శ్రమలూ చేయని యజమానుల వాడకాల కోసమే! స్వంత శ్రమ లేకుండా, యజమానితనాలతో, ఇతరుల శ్రమలతో జీవించడమే ‘శ్రమ దోపిడీ!’
‘‘వర్గాలు కాదు, వ్యక్తులు ముఖ్యం’’ అనే పేరుతో, గుమ్మా వీరన్నగారు రాసిన వ్యాసం చూశాను (ఆంధ్రజ్యోతి, జూన్ 21). ఆ వ్యాసంలో, వ్యాసకర్త, ‘మార్క్సు నియంతృత్వాన్ని ఆమోదించాడు’ అనీ, ఎం.ఎన్.రాయ్ అయితే, ‘నిర్మాణాత్మక ప్రజాస్వామ్యాన్ని ప్రతిపాదించాడు’ అనీ, వ్యాఖ్యానాలు చేశారు.
ఈ వ్యాసకర్త, ‘మార్క్సిజం వైఫల్యం చెందింది’ అని తేల్చి, అలా వైఫల్యం చెందడానికి కొన్ని కారణాలు కూడా చెప్పారు. ఆ కారణాలు ఇవీ: ‘‘ఆర్ధిక నియతివాదం, శ్రామిక వర్గ విప్లవ అనివార్యత, రాజ్యం రాలిపోవడం, కార్మిక వర్గ నియంతృత్వం, వర్గ దృక్పధం, సాపేక్ష నీతి, లక్ష్య సాధనాల మధ్య సమన్వయం లేకపోవడం, భావాల స్థానాన్ని గుర్తించకపోవడం, వంటివి వున్నాయి’’ అన్నారు. అంటే, మార్క్సిజం, ఆ అంశాలన్నిటినీ చెప్పిందనీ, కానీ అవి అన్నీ తప్పులు అనీ! కానీ, ఆ అంశాల్లో ‘‘వర్గ దృక్పధం’’ అనే ఒక్క అంశాన్ని మాత్రమే తీసుకున్నా, దాని వల్ల, ఆ ఇతర అంశాలన్నీ ఎంతెంత సత్యాలో; ఆ సత్యాల్ని తప్పులుగా భావించేవారి భావాలే ఎంతెంత అసత్యాలో, తెలుస్తాయి. మార్క్సిజంలో తప్పులుగా ఈ వ్యాసకర్త చూపించిన అంశాల్లో, ‘‘శ్రమ సంబంధాలు’’ అనే మాట గానీ, ‘‘శ్రమ దోపిడీ’’ అనే మాట గానీ, లేవు! ‘శ్రమ దోపిడీ’ జరిగే సమాజంలో మానవులు, ఏ ‘వర్గం’తోటీ సంబంధం లేకుండా విడి విడి వ్యక్తులుగా వుండరనీ, ఏదో ఒక వర్గంలోనే వుంటారనీ, ఈ వీరన్నగారి గురువు అయిన ఎమ్మెన్ రాయ్ గ్రహించలేదు. గురువునే నమ్ముకున్న శిష్యులు, గురువు బోధించని విషయాల్ని గ్రహించలేరు. గురువుని ఎన్నడూ ఏ సందేహాలతోనూ ప్రశ్నించలేరు!
మానవుల సంబంధాలు, ‘శ్రమ సంబంధాలు’గా వుంటాయనే అవగాహన లేని వాళ్ళు, మానవులు, వేల వేల సంవత్సరాల కిందటే ‘యజమానులూ-–బానిసలూ’ అనే ‘శతృ వర్గాలు’గా విడిపోయారనీ; ఆ శతృ వర్గాలే, ఈ నాటికీ, ‘పెట్టుబడిదారులూ–-కార్మికులూ’ అనే సంబంధాలతో కొనసాగుతున్నారనీ, తెలుసుకోలేరు!
సమాజంలో వున్న మానవులైన ఆడా–-మగా; పిల్లా –జెల్లా; అందరూ జీవించడానికి తిండీ–-బట్టా, ఇల్లూ-–వాకిలీ, చదువూ-–సంధ్యా వంటి అవసరాల కోసం, సమాజంలో అనేక వందల రకాల శ్రమలు జరగాలి. కానీ, సమాజంలో, ‘యజమానీ–-బానిస’ భేదాలు ఏర్పడిన నాడే మానవులు, ‘శ్రమలు చేసేవాళ్ళూ-–శ్రమలు చెయ్యనివాళ్ళూ’ అనే ‘శతృ వర్గాలు’గా ఏర్పడి పోయారు.
శ్రమలు చెయ్యనివాళ్ళు, ఏ ఉత్పత్తులతో జీవిస్తారు? - రాత్రింబవళ్ళూ శ్రమలు చేసే బానిసలు చేసే ఉత్పత్తులతోనే! అంటే, బానిసల శ్రమలలో, అత్యధిక భాగం, ఏ శ్రమలూ చేయని యజమానుల వాడకాల కోసమే! స్వంత శ్రమ లేకుండా, యజమానితనాలతో, ఇతరుల శ్రమలతో జీవించడమే ‘శ్రమ దోపిడీ!’ వెనకటి బానిసల యజమానుల లాగే, ఈ నాటి పెట్టుబడిదారులు కూడా అనంతమైన, సిరి సంపదల తోటీ, వెనకటి బానిసల లాగే, ఈ నాటి కార్మికులు కూడా బికారితనాల తోటీ, ఆ పాత కాలపు ‘శతృ వర్గాల’ లాగే జీవిస్తున్నారు! ఈ వాస్తవాల్ని, లెక్కలతో సహా వివరించిన మార్క్సు సిద్ధాంతాన్ని వీరన్నగారు తప్పు పట్టి, ‘‘వర్గాలు కాదు, వ్యక్తులే ముఖ్యం’’ అన్నారు. అంటే, ‘వర్గాలతో సంబంధం లేకుండా వ్యక్తులు, తమ జీవితాల్ని మార్చుకోవాలి’ అనే అర్ధం అది! ఈ మాట ఆయన స్పష్టంగానే చెప్పారు తర్వాత.
ఒక్క ప్రశ్నకి జవాబు చెప్పండి! ప్రపంచంలో, ఏ దేశంలో అయినా; స్త్రీలలో అయినా–-పురుషుల్లో అయినా; ‘శతృ వర్గాల్లో ఏ వర్గానికీ చెందని’ ఒక్క వ్యక్తిని చూపించగలరా? చూపించండి!
సమాజంలో వున్న ఏ వ్యక్తీ, ఏ వర్గానికీ చెందని విడి వ్యక్తిగా వుండడు. స్త్రీ పురుషుల్లో ఏ వ్యక్తి అయినా, ఏదో ఒక శ్రమ చేసే వ్యక్తి అయితే, ఆ వ్యక్తి ‘శ్రామిక వర్గ’ వ్యక్తి! ఏ శ్రమా చెయ్యని వ్యక్తి అయితే, ఆ వ్యక్తి, ఇతరుల శ్రమలతో జీవించే ‘దోపిడీ వర్గ’ వ్యక్తి!
‘శ్రమ దోపిడీ’ అదృశ్యమై, ‘శతృ వర్గాలే వుండని’ సమాజంలో అయినా, ఏ మానవుడూ, తోటి మానవుల శ్రమలతో సంబంధాలు లేని ‘విడి వ్యక్తి’గా జీవించలేడు. ఆ మానవుల మధ్య, ‘సమానత్వ శ్రమ సంబంధాలు’ సాగవలిసిందే.
‘పెట్టుబడిదారీ రాజ్యాలతో పోరాడడానికి, కమ్యూనిస్టులు హింసా మార్గాన్ని ఆశ్రయించారు’ అని వ్యాసకర్త విమర్శ! కానీ, శ్రామిక వర్గం, తన విముక్తి కోసం చేసే పోరాటం ‘హింస’ అవదు. అది ఆత్మరక్షణ! అసలు, ‘హింస’ జరిగేది, ‘శ్రమ దోపిడీ వర్గం’ ద్వారానే. ఏ దేశంలో అయినా, పెట్టుబడిదారీ రాజ్యాంగ యంత్రంతో, కుప్ప తెప్పలుగా ‘ఆయుధాలు’ ఎందుకు వున్నాయి? ఎవరి మీద ప్రయోగించడానికి? దోపిడీ చేసే వర్గ రాజ్యాంగం చేతిలో ఆయుధాలు వుండడం అంటే, అదీ అసలైన హింస! దోపిడీ వర్గం, తన తప్పుని గ్రహించి ఆయుధాల్ని కింద పెడితే, హింస, ఏ పక్షం వల్లా ఉండదు. శ్రామిక వర్గం, తన ఆత్మ రక్షణా పోరాటాన్ని సరైన మార్గంలో చేసుకోలేకపోతే, ఆ నష్టాన్ని ఆ వర్గమే భరిస్తుంది.
‘మార్క్సు అయితే, మానవ జాతి చరిత్రని వర్గ పోరాటాల చరిత్రగా అంటే, ఎం.ఎన్.రాయ్ అయితే మానవజాతి చరిత్రని, స్వేచ్ఛా, పోరాటాల చరిత్రగా అన్నారు.’ వ్యాసకర్త.
‘స్వేచ్ఛ’ కోసం పోరాటం చేయవలిసి వస్తే, వీరి స్వేచ్ఛని హరించే ఎదటి పక్షం ఎవరు? మొదట, ఆ శతృపక్షాల్ని చెప్పండి! ఒక పక్షపు స్వేచ్ఛని అడ్డుకోవడం, ఎదటి పక్షానికి ఎలా ప్రయోజనమో, అది కూడా చెప్పండి!
‘‘కమ్యూనిస్టు రాజ్యాల వల్ల సమ సమాజాలు ఏర్పడలేదంటే, దానికి కారణాలు మార్క్సు సిద్ధాంతంలోనే వున్నట్టు అవగతమవుతోంది.’’–వ్యాసకర్త.
కమ్యూనిస్టు రాజ్యాలు ఏర్పడిన చోట్ల, ఆ కమ్యూనిస్టు పార్టీలే ఏవైనా పొరపాట్లు చేసి వుంటే, అది ఆ పార్టీల తప్పు అవుతుంది. అంతేగానీ, అది, ‘శ్రమ దోపిడీ నించి విముక్తి చెందాలి’ అని చెప్పిన సిద్ధాంతం తప్పు అవదు.
‘మానవులలో ఎన్ని విభేదాలు వున్నాయో’ అని చెపుతూ, వ్యాసకర్త, ‘వర్గ భేదాల’ మాట కూడా ఎత్తారు. మళ్ళీ ఆ నోటితోనే, ‘వర్గాల’ మాటని తిరస్కరించి, ‘మానవులు స్వేచ్ఛగా జీవించే హక్కుని, శ్రేయస్సుని, కలిగి వుండాలనడమే మానవ వాదం’ అన్నారు. అంటే, పెట్టుబడిదారీ వర్గానికి ‘శ్రమ దోపిడీ’తో జీవించే స్వేచ్ఛ వుండాలి– అని: దాని శ్రేయస్సు దానిది– అని చెప్పడమే!
మరి, కార్మిక వర్గం స్వేచ్ఛగా జీవించడానికి ఏం చెయ్యాలి? దోపిడీ వర్గాన్ని ఎదిరించే పోరాటం చెయ్యకూడదు. అది హింస! అది తప్పు! అయితే, శ్రామికులు స్వేచ్ఛని ఎలా సాధించాలి?
వ్యాసకర్త చెప్పిన మార్గం: ‘మానవ వాదం సహకార ఆర్ధిక విధానాల్ని ప్రతిపాదిస్తుంది. ఉత్పత్తి సాధనాల మీద యాజమాన్యం, ఆ ఉత్పత్తి సంఘాలదే అవుతుంది’ - అని! శ్రామిక సంఘాలకు, ‘ఉత్పత్తి సాధనాలు’ ఎలా రావాలి? భూమీ, గనులూ, ఫ్యాక్టరీలూ, రవాణా సాధనాలూ - అన్నీ పెట్టుబడిదారుల నించీ శ్రామికులు ఎలా స్వాధీనం చేసుకోవాలి? ‘వర్గ పోరాటం’ వద్దంటున్నారు; సైన్యమూ, పోలీసులూ, ఆయుధాలూ వంటి హింసా యంత్రాంగం కలిగిన పెట్టుబడిదారులు, శ్రామికులు అడగ్గానే ‘ఉత్పత్తి సాధనాల్ని’ ఇచ్చేస్తారా? ఏ శ్రమా చెయ్యని దోపిడీ వర్గం ఎవరి శ్రమ వల్ల జీవిస్తోందో చెప్పండి! స్వేచ్ఛా పోరాటం ఎలా సాగాలో చెప్పండి! తమ ఉత్పత్తి సంఘాల్ని శ్రామికులు ఎలా నిర్మించుకోవాలో చెప్పండి!
కర్రా, కత్తీ లేని మంచి దారి వుంటే అంతకన్నా ఏం కావాలి?
రంగనాయకమ్మ
Like
No comments:
Post a Comment