Friday, 18 January 2019

జ్ఞానయోగః 2 (అథ చతుర్థోధ్యాయః, శ్రీ భగవద్గీత)

వీతరాగభయ క్రోధా
మన్మయా మా ముపాశ్రితాః,
బహవో జ్ఞానతపసా
పూతా మద్భావమాగతాః.

అనురాగము, భయము, క్రోధము విడిచినవారును, నాయందే లగ్నమైన చిత్తము కలవారును, నన్నే ఆశ్రయించినవారునగు అనేకులు ఇట్టీ జ్ఞానతపస్సుచే పవిత్రులై నా స్వరూపమును (మోక్షమును) బొందియుండిరి.

యే యథా మాం ప్రపద్యంతే
తాం స్తథైవ భజామ్యహమ్‌,
మమ వర్త్మానువర్తంతే
మనుష్యాః పార్థ సర్వశః.

ఓ అర్జునా! ఎవరే ప్రకారముగ నన్ను సేవింతురో వారి నా ప్రకారముగనే నేననుగ్రహింతును. మనుజులు సర్వవిధముల నా మార్గమునే అనుసరించుచున్నారు.

కాక్షంతః కర్మణాం సిద్ధిం
యజంత ఇహ దేవతాః,
క్షిప్రం హి మానుషే లోకే
సిద్ధిర్భవతి కర్మజా.

కర్మలయొక్క ఫలప్రాప్తిని అపేక్షించు మానవు లీ ప్రపంచమున దేవతల నారాధించుచున్నారు. ఏలయనగా కర్మఫలసిద్ధి ఈ మనుష్యలోకమున శీఘ్రముగ గలుగుచున్నది.

చాతుర్వర్ణ్యం మయా సృష్టం
గుణకర్మ విభాగశః,
తస్య కర్తారమపి మాం
విద్ధ్యకర్తార మవ్యయమ్‌.

బ్రాహ్మణ క్షత్రియాదులను నాల్గువర్ణములు సత్త్వ దిగుణముల యొక్కయు, ఆ గుణములచే చేయబడు కర్మలయొక్కయు, విభాగముననుసరించి నాచే సృజింపబడినవి. వానికి నేను కర్తనైప్పటికిని (ప్రకృతికి అతీతుడనగుటచే) వాస్తవముగ నన్ను అకర్తగను, నాశరహితునిగను (నిర్వికారునిగను) ఎఱుగుము. 

న మాం కర్మాణి లింపంతి
న మే కర్మఫలే స్పృహా,
ఇతి మాం యోభిజానాతి
కర్మభిర్న స బధ్యతే.

నన్ను కర్మలంటవు. నాకు కర్మఫలమునందపేక్షయులేదు. ఈ ప్రకారముగ నన్ను గూర్చి యెవడు తెలిసికొనునో ఆతడు కర్మములచే బంధింపబడడు.

ఏవం జ్ఞాత్వా కృతం కర్మ
పూర్వైరపి ముముక్షుభిః,
కురు కర్మైవ తస్మాత్త్వం
పూర్వైః పూర్వతరం కృతమ్‌.

(తాను వాస్తవముగ కర్తకాదు. తనకు కర్మఫలమునందపేక్ష యుండరాదు - అని) ఈ ప్రకారముగ (భగవంతుని యొక్క కర్మాచరణముద్వారా) తెలిసికొని పూర్వ మెందఱో ముముక్షువులు నిష్కామముగ కర్మల నాచరించియుండిరి. కావున (ఓ అర్జునా!) నీవున్ను పూర్వులచే చేయబడిన అట్టి పురాతనమైన నిష్కామకర్మమునే చేయుము.

కిం కర్మ కిమకర్మేతి
కవయోప్యత్ర మోహితాః,
తత్తే కర్మ ప్రవక్ష్యామి
యజ్జ్ఞా త్వా మోక్ష్య సే శుభాత్‌.

కర్మయెట్టిది? అకర్మయెట్టిది? అను ఈ విషయమును పండితులు కూడ సరిగా తెలుసుకొన జాలకున్నారు. దేని నెఱిగినచో నీవు సంసారబంధము నుండి విముక్తుడవు కాగలవో అట్టి కర్మరహస్యమును నీకిపుడు తెలుపుచున్నాను.

కర్మణో హ్యపి బోద్ధవ్యం
బోద్ధవ్యం చ వికర్మణః,
అకర్మణశ్చ బోద్ధవ్యం
గహనా కర్మణోగతిః.

శాస్త్రములచే విధింపబడిన కర్మములయొక్కయు, నిషేధింపబడిన వికర్మలయొక్కయు, ఏమియు చేయక యూరకుండుటయను అకకర్మముయొక్కయు స్వరూపమును బాగుగ తెలిసికొనవలసియున్నది. ఏలయనగా కర్మముయొక్క వాస్తవతత్త్వము చాలా లోతైనది. (ఎఱుగుట మిగుల కష్టతరము)

కర్మణ్యకర్మ యః పశ్యే
దకర్మణి చ కర్మయః,
స బుద్ధిమాన్‌ మనుష్యేషు
స యుక్తః కృత్స్నకర్మకృత్‌.

ఎవడు కర్మమునందు అకర్మమును, అకర్మము నందు కర్మమును జూచునో, అతడు మనుజులలో వివేకవంతుడును, యోగయుక్తుడును సకలకర్మల నాచరించినవాడును నగుచున్నాడు. 

No comments: