శ్రీ శుక బ్రహ్మఆశ్రమం శ్రీకాళహస్తి
15-13-గీతా మకరందము
పురుషోత్తమప్రాప్తియోగము
-పూజ్యశ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు,
శ్రీశుకబ్రహ్మాశ్రమము, శ్రీకాళహస్తి.
అll భూమియందు ప్రవేశించి సస్యాదుల నభివృద్ధిపఱచునది తానే యని భగవానుడు పలుకుచున్నాడు -
గామావిశ్య చ భూతాని ధారయామ్యహ మోజసా |
పుష్ణామి చౌషధీస్సర్వాః
సోమో భూత్వా రసాత్మకః ||
తా:- మఱియు నేను భూమిని ప్రవేశించి శక్తిచేత సమస్త ప్రాణికోట్లను ధరించుచున్నాను (నిలుపుచున్నాను). రసస్వరూపుడగు చంద్రుడనై సస్యము లన్నింటిని పోషించుచున్నాను.
వ్యాఖ్య:- 'ధారయామి ఓజసా’ - అని చెప్పుటవలన జగత్తునందలి సమస్త పదార్థములకును, ప్రాణికోట్లకును శక్తిని, సామర్థ్యమును, బలమును ఒసంగునది ఆ పరాత్పరుడే యని తెలియుచున్నది. పైవాక్యమువలన శ్రీకృష్ణమూర్తి వసుదేవునకు జన్మించిన ఒకానొక చిన్నఉపాధి మాత్రమే కాదనియు, విశ్వవ్యాపి, జగద్భర్తకూడ యనియు స్పష్టమగుచున్నది. మఱియు సస్యములను అభివృద్ధిపఱచునది తానేయని చెప్పుటచే జీవులు భుజించు ఆహారము సాక్షాత్ పరమాత్మవలననే సంభవించుచున్నదని తెలియుచున్నది. కావున, ఆహారమును భుజించునపుడు ఈ అన్నమెవరివలన మనకు వచ్చినది? అని ఆలోచించి అన్నస్రష్ట, అన్నదాత యగు ఆ సర్వేశ్వరునకు సర్వులును కృతజ్ఞత చూపవలసియున్నారు. మనుజుడు తాను ఆహారమును భుజించుటకుముందు అద్దానిని ఆ దేవదేవునకు సమర్పించి తదుపరి దైవభావనతో దానిని భుజించవలెను. సస్యములను భగవానుడు పోషించనిచో జనులకు అన్నము దొఱకదు; సూర్యచంద్రాగ్నులకు ప్రకాశమివ్వనిచో లోకము అంధకారావృతమై యుండును. కాబట్టి ఎన్నియో అనుకూలములుచేసి ప్రాణులను భరించుచున్న ఆ జగద్ధాత్రికి మనుజులు సదా కృతజ్ఞులై వర్తించవలెను. సర్వకాలములందును. వారిని స్మరించుచు, కీర్తించుచు నుండవలెను.
ప్ర:- భగవాను డే యేప్రకారములుగ ప్రజలకు మేలొనర్చుచున్నారు?
ఉ:- (1) భూమియందు ప్రవేశించి బలముచే సమస్తప్రాణులను భరించుచున్నారు. (2) చంద్రుడయి సస్యములన్నిటిని పోషించుచున్నారు.
ప్ర:- కావున జీవు లేమి చేయవలెను?
ఉః - అతనికి కృతజ్ఞులై వర్తించుచు, సంకీర్తన, జప, పూజాదులచే నిరంతర మాతనిని స్మరించుచుండవలెను.
No comments:
Post a Comment