Wednesday, 9 August 2017

17-11-గీతా మకరందము.
శ్రద్ధాత్రయ విభాగయోగము
-పూజ్యశ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు,
శ్రీశుకబ్రహ్మాశ్రమము, శ్రీకాళహస్తి.
అll ఇక యజ్ఞములను గూర్చి చెప్పబోవుచు మొట్టమొదట సాత్త్విక యజ్ఞము యొక్క లక్షణములను వివరించుచున్నాడు –
అఫలాకాంక్షిభిర్యజ్ఞో
విధిదృష్టో య ఇజ్యతే |
యష్టవ్యమేవేతి మనః
సమాధాయ స సాత్త్వికః ||
తా:- " ఇది చేయదగినదియే” యని మనస్సును సమాధానపఱచి శాస్త్రసమ్మతమగు ఏ యజ్ఞము ఫలాపేక్షలేనివారిచేత చేయబడుచున్నదో అది సాత్త్వికయజ్ఞమనబడును.
వ్యాఖ్య:- ప్రతివాడును తానుచేయు కార్యము శాస్త్రసమ్మతమైనదో, కాదో బాగుగ విచారించుకొని శాస్త్రవిరుద్ధమైనదానిని త్యజించివేసి శాస్త్రసమ్మతమైన దానినే గ్రహించవలెను. కనుకనే "విధిదృష్టః” అని చెప్పబడినది. మఱియు “ఇది చేయదగినది" యను కర్తవ్యబుద్ధి అద్దానియందు లెస్సగనుంచుకొని ఫలాపేక్షలేక అద్దాని నాచరించవలెను. అపుడది సాత్త్వికకార్యమై చెన్నొందును. ఇచట యజ్ఞమని చెప్పబడినదాని యర్థము పశుహింసాదులతో గూడిన యాగములనికాదు. భగవద్ధ్యానము, పరోపకారము, దైవసంబంధమైన కార్యములు మున్నగునవి, లేక ఏ సత్కార్యమైనను - అనియే యగును.
"మనః సమాధాయ” - అని చెప్పబడినందువలన, ప్రతివారును తాము కార్యమును ప్రారంభించుటకు ముందుగా మనస్సును బాగుగ కుదుటపఱచుకొని సంశయములకు తావీయక నిశ్చయబుద్ధితో నద్దాని నుపక్రమించవలెనని తెలియుచున్నది. మనస్సును సమాధానపఱచక, నిశ్చలపఱచక, ఆరంభింపబడు ఏ కార్యమున్ను చక్కగ జరుగదు. కావున చేయబోవు కార్యముయొక్క బాగోగులను బాగుగ నిర్ణయించుకొని శాస్త్రాదులద్వారా, ఆప్తవాక్యములద్వారా నిశ్చయమునకువచ్చి మనస్సును స్థిరపఱచుకొని నిష్కామబుద్ధితో అట్టి శాస్త్రసమ్మతకార్యము నాచరించినచో అద్భుతఫలితముల నొసంగగలదు. అదియే సాత్త్వికకార్యము, సాత్త్వికయజ్ఞము నగును.
ప్ర:- సాత్త్వికయజ్ఞ మెట్టిది?
ఉ:- (1) శాస్త్రోక్తమైనదియు (2) ఫలాపేక్షరహితముగ చేయబడునదియు (3) ఇదిచేయదగినది. అని మనస్సును సమాధానపఱచుకొని మనుజునిచే నాచరింపబడునదియు సాత్త్వికయజ్ఞమనబడును.

No comments: