Saturday, 6 January 2018

విశ్వరూపసందర్శనయోగః 2 (అథ ఏకాదశోధ్యాయః, భగవద్గీత)

అనేక వక్త్రనయన
మనేకాద్భుతదర్శనమ్‌,
అనేక దివ్యాభరణం
దివ్యానేకోద్యతాయుధమ్‌.

దివ్యమాల్యాంబరధరం
దివ్యగంధానులేపనమ్‌‌,
సర్వాశ్చర్యమయం దేవ
మనంతం విశ్వతోముఖమ్‌.

(అత్తఱి) పెక్కు ముఖములు, నేత్రములుగలదియు, అనేకములగు అద్భుతవిషయములను జూపునదియు, దివ్యములైన పెక్కు ఆభరణములతో గూడినదియు, ఎత్తబడియున్న అనేక దివ్యాయుధములుగలదియు, దివ్యములైన పుష్పమాలికలను, వస్త్రములను ధరించినదియు, దివ్యమగు గంధపూతతో గూడియున్నదియు, అనేక ఆశ్చర్యములతో నిండియున్నదియు, ప్రకాశమాన మైనదియు, అంతములేనిదియు, ఎల్లడెల ముఖములు గలదియు (నగు తన విశ్వరూపమును భగవానుడర్జునుకు జూపెను).

దివి సూర్యసహస్రస్య
భవేద్యుగపదుత్థితా,
యది భాస్సదృశీ సా స్యా
ద్భాసస్తస్య మహాత్మనః‌.

ఆకాశమునందు వేలకొలది సూర్యుల యొక్క కాంతి ఒక్కసారి బయలుదేరినచో ఎంత కాంతియుండునో అది ఆ మహాత్ముని యొక్క కాంతిని బోలియున్నది.

తత్త్రైకస్థం జగత్కృత్స్నం
ప్రవిభక్త మనేకధా
అపశ్యద్దేవదేవస్య
శరీరే పాణ్డవస్తదా.

అప్పు డర్జునుడు నానావిధములుగ విభజింపబడియున్న సమస్త జగత్తును దేవదేవుడగు శ్రీకృష్ణభగవానుని యొక్క శరీరమున (అవయవములవలె) ఒక్క చోటనున్న దానినిగ చూచెను.

తతః స విస్మయావిష్టో
హృష్టరోమా ధనంజయః,
ప్రణమ్య శిరసా దేవం
కృతాఞ్జిలిరభాషత‌.

అటు పిమ్మట ఆ అర్జునుడు ఆశ్చర్యముతో గూడినవాడును, గగుర్పాటు కలవాడును అయి విశ్వరూపమును ధరించిన భగవానునకు శిరస్సుచే నమస్కరించి చేతులు జోడించుకొని ఈ ప్రకారముగ పలికెను.

అర్జున ఉవాచ:- 
పశ్యామి దేవాంస్తవ దేవదేహే
సర్వాంస్తథా భూతవిశేషసజ్ఘౌన్‌,
బ్రహ్మాణమీశం కమలాసనస్థ
మృషీంశ్చ సర్వానురగాంశ్చ దివ్యాన్‌.

అర్జునుడు చెప్పెను - దేవా! మీ శరీరమందే సమస్తదేవతలను, అట్లే చరాచర ప్రాణికోట్ల సమూహములను, కమలాసనుడైన సృష్టికర్తయగు బ్రహ్మదేవుని, సమస్త ఋషులను, దివ్యములగు సర్పములను చూచుచున్నాను. 

అనేక బాహూదరవక్త్రనేత్రం
పశ్యామి త్వాం సర్వతో నంత రూపమ్‌,
నాంతం న మధ్యం న పునస్తవాదిం
పశ్యామి విశ్వేశ్వర విశ్వరూప.

ప్రపంచాధిపతీ! జగద్రూపా! మిమ్ము సర్వత్ర అనేక హస్తములు, ఉదరములు, ముఖములు, నేత్రములు, గలవారుగను, అనంతరూపులుగను నేను చూచుచున్నాను. మరియు మీయొక్క మొదలుగాని, మధ్యముగాని, తుదగాని నేను గాంచజాలకున్నాను.

కిరీటినం గదినం చక్రిణం చ
తేజోరాశిం సర్వతో దీప్తిమంతమ్‌,
పశ్యామి త్వాం దుర్నిరీక్ష్యం సమంతా
ద్దీప్తానలార్కద్యుతిమప్రమేయమ్‌.

మిమ్ము ఎల్లడలను కిరీటముగల వారుగను, గదను ధరించిన వారుగను, చక్రమును బూనినవారుగను, కాంతిపుంజముగను, అంతటను ప్రకాశించువారుగను, జ్వలించు అగ్ని, సూర్యులవంటి కాంతిగల వారుగను, అపరిచ్ఛిన్నులుగను, (పరిమితిలేని వారుగను) చూచుచున్నాను .

త్వమక్షరం పరమం వేదితవ్యం
త్వమస్య విశ్వస్య పరం నిధానమ్‌,
త్వమవ్యయశ్శాశ్వత ధర్మగోప్తా
సనాతనస్త్వం పురుషో మతోమే.

మీరు తెలియదగిన సర్రోత్తమ అక్షర పరబ్రహ్మస్వరూపులు. మీరీ జగత్తున కంతటికి గొప్ప ఆధారభూతులు. మీరు నాశరహితులు. శాశ్వతములగు ధర్మములను కాపాడువారు. మీరు పురాణపురుషులు అని నా అభిప్రాయము. 

No comments: