పురుషోత్తమప్రాప్తియోగః 1 ( అథ పంచదశోధ్యాయః, భగవద్గీత)
శ్రీ భగవానువాచ:-
ఊర్ధ్వమూలమధఃశాఖం
మశ్వత్థం ప్రాహురవ్యయమ్,
ఛందాంసి యస్య పర్ణాని
యస్తం వేద స వేదవిత్.
శ్రీ భగవంతుడు చెప్పెను: (ఓ అర్జునా!) దేనికి వేదములు ఆకులుగానున్నవో, అట్టి సంసారమను అశ్వత్థవృక్షము (రావిచెట్టు) ను పైనవేళ్ళుగలదిగను, క్రింద కొమ్మలు గలదిగను, (జ్ఞానప్రాప్తిపర్యంతము) నాశము లేనిదిగను (పెద్దలు) చెప్పుదురు. దాని నెవడు తెలిసికొనుచున్నాడో అతడు వేదార్థము నెఱిగినవాడు అగుచున్నాడు.
అధశ్చోర్ధ్వం ప్రసృతాస్తస్యశాఖా
గుణప్రవృద్ధా విషయ ప్రవాలాః,
అధశ్చ మూలాన్యనుసంతతాని
కర్మానుబంధీని మనుష్యలోకే.
ఆ (సంసార) వృక్షముయొక్క కొమ్మలు సత్త్వరజస్తమోగుణములచే వృద్ధిబొందింపబడినవియు, (శబ్దాది) విషయములనెడు చిగుళ్ళుగలవియునై, క్రిందికిని (స్థావరము మొదలుకొని) మీదికిని (బ్రహ్మలోకము వఱకు) వ్యాపించియున్నవి. మనుష్యలోకమునందు కర్మసంబంధమును (కర్మవాసనలను) గలుగజేయునవియగు దాని వేళ్ళు క్రిందను (మీదనుగూడ) బాగుగ విస్తరించి (దృఢముగ నాటుకుని) యున్నవి.
న రూపమ స్యేహ తథోపలభ్యతే
నాంతో న చాదిర్న చ సంప్రతిష్ఠా,
అశ్వత్థమేనం సువిరూఢమూలం
అసజ్గశస్త్రేణ దృఢేన ఛిత్వా.
తతః పదం తత్పరిమార్గితవ్యం
యస్మిన్ గతా న నివర్తంతిభూయః,
తమేవ చాద్యం పురుషం ప్రపద్యే
యతః ప్రవృత్తిః ప్రసృతాపురాణీ.
ఈ సంసారవృక్షము యొక్క స్వరూపము ఆలాగున (ఇపుడు వర్ణింపబడినరీతిగా) ఈ ప్రపంచమున (సంసారాసక్తిగలవారిచేత) తెలియబడకున్నది. దాని ఆదిగాని, అంతముగాని, మధ్యము (స్థితి) గాని కనబడకున్నది. గట్టిగ వేళ్ళుపాఱిన ఈ సంసారమను అశ్వత్థవృక్షమును అసంగమను బలమైన ఆయుధముచే నఱికివైచి ఆ పిమ్మట ఏ స్థానమందు ప్రవేశించిన వారు మఱల వెనుకకు (సంసారమునకు) రారో, ఎవనినుండి అనాదియైన ఈ సంసారవృక్షముయొక్క ప్రవృత్తి వ్యాపించెనో, (అట్టి) ఆదిపురుషుడగు పరమాత్మనే శరణుబొందుచున్నాను - అనునట్టి (భక్తి) భావముతో ఆ పరమాత్మపదమును వెదకవలయును.
నిర్మానమోహా జితసజ్గదోషా
అధ్యాత్మనిత్యా వినివృత్తకామాః,
ద్వంద్వైర్విముక్తాః సుఖదుఃఖసంజ్ఞై
ర్గచ్ఛంత్యమూఢాః పదమవ్యయం తత్.
అభిమానము (లేక,అహంకారము) అవివేకము లేనివారును, సంగము దృశ్యపదార్థములందాసక్తి అనుదోషమును జయించినవారును, నిరంతరము ఆత్మజ్ఞానము (బ్రహ్మనిష్ఠ) గలవారును, కోరికలన్నియు లెస్సగ (వాసనాసహితముగ) తొలగినవారును, సుఖదుఃఖములగు ద్వంద్వములనుండి బాగుగ విడువబడినవారును అగు జ్ఞానులు అట్టి అవ్యయమగు బ్రహ్మపదమును (మోక్షమును) బొందుచున్నారు.
న తద్భాసయతే సూర్యో
న శశాజ్కో న పావకః,
యద్గత్వా న నివర్తంతే
తద్ధామ పరమం మమ.
ఆ (పరమాత్మ) స్థానమును సూర్యుడుకాని, చంద్రుడుకాని, అగ్నికాని ప్రకాశింపజేయజాలరు. దేనిని పొందినచో (జనులు) మఱల (ఈ సంసారమునకు) తిరిగిరారో అదియే నాయొక్క శ్రేష్ఠమైన స్థాణము అయియున్నది.
మమైవాంశో జీవలోకే
జీవభూత స్సనాతనః,
మనఃషష్ఠానీంద్రియాణి
ప్రకృతిస్థాని కర్షతి.
నాయొక్కయే అనాదియగు (నిత్యమగు) అంశము జీవలోకమందు జీవుడై ప్రకృతియందున్న త్వక్ చక్షు శ్శ్రోత్ర జిహ్వాఘ్రాణ మనంబులను ఆరు ఇంద్రియములను ఆకర్షించుచున్నది.
శరీరం యదవాప్నోతి
యచ్చాప్యుత్ర్కామతీశ్వరః,
గృహీత్వైతాని సంయాతి
వాయుర్గంధానివాశయాత్.
(దేహేంద్రియాది సంఘాతమునకు) ప్రభువగు జీవుడు శరీరమును విడిచుచున్నప్పుడును, నూతన శరీరమును పొందుచున్నపుడును - పుష్పాది స్థానము లనుండి గాలి వాసనలను గ్రహించిపోవు చందమున - పంచేంద్రియములు, మనస్సు అను ఆరింటిని గ్రహించి వెడలుచున్నాడు.
శ్రోత్రం చక్షుః స్పర్శనం చ
రసనం ఘ్రాణమేవ చ
అధిష్టాయ మనశ్చాయం
విషయానుప సేవతే.
ఈ జీవుడు (జీవాత్మ) చెవిని, కంటిని, చర్మమును, (త్వగింద్రియమును), నాలుకను, ముక్కును, మనస్సును ఆశ్రయించి (శబ్దాది) విషయములను అనుభవించుచున్నాడు.
No comments:
Post a Comment