Sunday, 7 January 2018

విశ్వరూపసందర్శనయోగః 6 (అథ ఏకాదశోధ్యాయః, భగవద్గీత)

కిరీటినం గదినం చక్రహస్త
మిచ్ఛామిత్వాంద్రష్టుమహంతథైవ
తేనైవ రూపేణ చతుర్బుజేన
సహస్రబాహో భవ విశ్వమూర్తే‌.

(ఓ కృష్ణమూర్తీ!) నేను మిమ్ము మునుపటివలెనే కిరీటము, గద, చక్రము చేతధరించినవారుగ చూడదలంచుచున్నాను. అనేక హస్తములుగలదేవా! జగద్రూపా! నాలుగు భుజములుగల ఆ పూర్వ రూపమునే మరల ధరింపుడు.

శ్రీ భగవానువాచ:-
మయా ప్రసన్నేన తవార్జునేదం
రూపంపరందర్శితమాత్మయోగాత్‌
తేజోమయం విశ్వమనంతమాద్యం
యన్మేత్వదన్యేననదృష్టపూర్వమ్‌.

శ్రీ భగవానుడు చెప్పెను: అర్జునా! ప్రకాశముచే పరిపూర్ణమైనదియు, జగద్రూపమైనదియు అంతములేనిదియు, మొదటిదియు, నీవు తప్ప ఇతరులచే నిదిర కెన్నడును జూడబడనిదియునగు ఏయీ సర్వోత్తమమైన విశ్వరూపముగలదో, అయ్యది ప్రసన్నుడనగు నాచే స్వకీయయోగశక్తి వలన నీకు చూపబడినది.

న వేద యజ్ఞాధ్యయనైర్న దానై
ర్న చ క్రియాభిర్న తపోభిరుగ్రైః
ఏవం రూపశ్శక్య అహంనృలోకే
ద్రష్టుం త్వదన్యేన కురుప్రవీర.

కురువంశ శ్రేష్ఠుడవగు ఓ అర్జునా! ఈ నా విశ్వరూపమును నీవుతప్ప మరియొకరెవరును ఈ మనుష్యలోకమున చూచియుండలేదు. (నా యనుగ్రహముచే) నీవు చూడగల్గితివి. మరియు వేదాధ్యయన యజ్ఞాధ్యయనములచేగాని, దానములచేగాని, (అగ్నిహోత్రాది శ్రౌతస్మార్తాది) క్రియలచే గాని, ఘోర తపస్సులచే గాని (ఇట్టి విశ్వరూపుడనగు) నన్ను చూచుటకు శక్యముగాదు.

మాతే వ్యథా మా చ విమూఢభావో
దృష్ట్వా రూపం ఘోరమీదృజ్మమేదమ్‌
వ్య పేతభీః ప్రీతమనాః పునస్త్వం
తదేవ మే రూపమిదం ప్రపశ్య.

ఇటువంటి భయంకరమైన నా (విశ్వరూపమును జూచి నీవు భయమునుగాని, చిత్తవికలత్వమునుగాని పొందకుము. నీవు నిర్భయుడవును ప్రసన్న చిత్తుడవును అయి నా యీ పూర్వరూపమునే మరల బాగుగ జూడుము. 

సంజయ ఉవాచ :-
ఇత్యర్జునం వాసుదేవ స్తథోక్త్వా
స్వకంరూపందర్శయామాస భూయః
ఆశ్వాసయామాస చ భీత మేనం
భూత్వా పునస్సౌమ్యవపుర్మహాత్మా.

సంజయుడు చెప్పెను- (ఓ ధృతరాష్ట్రమహారాజా!) ఈ ప్రకారముగ శ్రీకృష్ణుడు అర్జునునకు జెప్పి ఆ ప్రకారమే తన పూర్వరూపమును మరల జూపెను. మహాత్ముడగు ఆ శ్రీకృష్ణమూర్తి తన సౌమ్యరూపమును వహించి భయపడియున్న అర్జునుని ఓదార్చెను .

అర్జున ఉవాచ:-
దృష్ట్వేదం మానుషం రూపం
తవ సౌమ్యం జనార్దన‌,
ఇదానీమస్మి సంవృత్త
స్సచేతాః ప్రకృతిం గతః.

అర్జునుడు చెప్పెను- ఓ కృష్ణా! ఈ మనుష్య రూపమును జూచి యిపుడు నామనస్సు కుదుటపడినది. మరియు నేను స్వస్థతను బొందితిని.

శ్రీ భగవానువాచ :-
సుదుర్దర్శమిదం రూపం
దృష్టవానసి యన్మమ,
దేవా అప్యస్య రూపస్య
నిత్యం దర్శనకాక్షి ణః‌‌.

శ్రీ భగవానుడు చెప్పెను- నా యొక్క ఏ రూపమును నీ విపుడు చూచితివో అది మహా దుర్లభమైనది. దేవతలుకూడా నిత్యము అద్దానిని దర్శనము చేయగోరుచుందురు.

నాహం వేదైర్న తపసా
న దానేన న చేజ్యయా,
శక్య ఏవం విధో ద్రష్టుం
దృష్టవానసి మాం యథా.

నన్ను ఏ రీతిగ నీవు చూచితివో, అటువంటి రూపముగల నేను వేదములచే (వేదాధ్యయనపరులచే) గాని - తపస్సుచేగాని, దానముచేగాని యజ్ఞముచేగాని చూచుటకు శక్యుడనుగాను.

భక్త్యా త్వనన్యయా శక్య
అహమేవంవిధోర్జున,
జ్ఞాతుం ద్రష్టుం చ తత్త్వేన
ప్రవేష్టుం చ పరంతప.

శత్రువులను తపించజేయువాడా! ఓ అర్జునా! ఈ విధమగు రూపముగల నేను అనన్యభక్తిచేత మాత్రమే యథార్థముగ తెలిసికొనుటకును, చూచుటకును ప్రవేశించుటకును, సాధ్యమైనవాడనగుచున్నాను.

మత్కర్మకృన్మత్పరమో
మద్భక్తస్సజ్గవర్జితః
నిర్వైరస్సర్వభూతేషు
యస్స మామేతి పాణ్డవ.

అర్జునా! ఎవడు నాకొరకే కర్మలజేయునో {లేక నా సంబంధమైన (దైవసంబంధమైన) కార్యములనే జేయునో}, నన్నే పరమప్రాప్యముగ నమ్మియుండునో నాయందే భక్తిగలిగియుండునో, సమస్తదృశ్యపదార్థము లందును సంగమును (ఆసక్తిని, మమత్వమును) విడిచివేయునో, సమస్తప్రాణులయందును ద్వేషము లేక యుండునో అట్టివాడు నన్ను పొందుచున్నాడు.

ఇతి శ్రీమద్భాగవద్గీతానూపనిషత్సు, బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే, శ్రీకృష్ణార్జునసంవాదే, విశ్వరూపసందర్శనయోగోనామ ఏకాదశోధ్యాయః 

No comments: