Sunday, 14 January 2018

శ్రీ మద్భగవద్గీత

అందరికి నమస్కారములు. 

శ్రీ మద్భగవద్గీత ఆప్ ను డౌన్లోడ్ చేసినందుకు అందరికి పేరు పేరునా ధన్యవాదములు. మీకు నా హ్రుదయపూర్వక నమస్సులతొ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.

భగవద్గీతా కించిదధీతా 
గంగా జలలవ కణికాపీతా|
సకృదపి యేన మురారి సమర్చా
క్రియతే తస్య యమేన స చర్చా||

శ్లోకం అర్ధం :
భగవద్గీతను ఏ కొద్దిగా అధ్యయనము చేసినను, గంగానదీ జలములోని ఒక బిందువునైనా త్రాగినను, ఒక్కసారి అయినను మనసా కర్మణా భగవంతుని పూజించినను చాలు. అలాంటివాడికి యముని వలన ఏ మాత్రమూ భయము ఉండదు(దీనర్థము చావు అంటే భయం పోతుందని). 

శ్రీ కృష్ణుడు అర్జునుని వంక పెట్టి ప్రపంచానికి అందించిన ఒక మహత్తర బోధ "శ్రీ మద్భగవద్గీత". ఇది కేవలం హిందువు లదే అని భావించే వారు ఒట్టి మూర్ఖులు. విజ్ఞానం ఒకరి కోసమే పరిమితం అవుతుందా? విజ్ఞానం అనేది అందరికీ ఉద్దేశించినది. భగవద్గీతను వయసు మళ్ళిన వారి కోసం, అనుకునే వారు, గీతను చదివితే, సన్యాసం పుచ్చుకున్నట్లే అనుకునేవారు వెర్రివాళ్ళు. నిజం చెప్పాలంటే, గీతను, చిన్న వయసు నుంచే చదివి అర్ధం చేసుకోవడం మొదలుపెడితే, యవ్వనము, గృహస్తాశ్రమము, వానప్రస్తము అనే ఈ బాధ్యతలను ఎంతో సమర్ధవంతంగా నిర్వహించ వచ్చును. 

మానవుని జీవితం లో కలిగే అన్ని సందేహాలకు సమాధానం ఇచ్చేది గీత. ప్రత్యక్షం గా కాకపోయినా, మానవుడు తనను తాను తెలుసుకొని, తన లోపలికి తొంగి చూసుకుని, తన అంతరంగాన్ని విశ్లేషించుకొని, తను చేసే తప్పొప్పులను కనుగొనడానికి 'గీత' ఎంతగానో తోడ్పడుతుంది. పొగడ్తలకు పొంగిపోయి, విమర్శలకు కుంగిపోకుండా, సుఖాలలో ఒళ్ళు మరచిపోయి, దుఖాలలో మనో వేదనకు గురికాకుండా, ఒక స్థిరమైన మన:స్థితిని "గీత" మనకు నేర్పిస్తుంది. దీనినే "స్థితప్రజ్ఞత" అంటారు. 

మన బుద్ధిని పక్క దారులు పట్టనీయకుండా, మనలను మనము నియంత్రించుకునే పాటవం మనకు గీత చదవడం వలన లభిస్తుంది. 

తాను చేసే కర్మలు అన్నీ, తన కోసం కాకుండా, భగవంతుని కోసమే అనే భావనలో, సర్వ ప్రాణి మనుగడను, సర్వ లోక హితాన్ని, బోధిస్తుంది భగవద్గీత. అరిషడ్వర్గాలను జయించి, ప్రశాంత చిత్తమును కలిగి ఉండడం ఎలాగో గీత నుంచి మనం తెలుసుకోవచ్చు. 

ఇవన్నీ ఒక ధర్మనికో, మతానికో పరిమితం కాదు కదా, ఒక వయసుకు పరిమితం కాదు కదా, అటువంటప్పుడు భగవద్గీత ఒక్క హిందూ ధర్మానికే ప్రతీక అని ఎందుకు భావించాలి? ఎన్నో వ్యక్తిత్వ వికాసా గ్రంధాలు, నిపుణుల వలన పొందలేని ప్రయోజనాలు కేవలం భగవద్గీతను పఠించి, అర్ధం చేసుకుని ఆచరించడం వలన పొందవచ్చు. 

మానవాళి ప్రగతికి , మానవ జాతి యొక్క వికాసానికి, ధర్మ పరిరక్షణకు భూమి మిద అవతరించిన ఒక ఉద్గ్రంధం "శ్రీ మద్భగవద్గీత". దీనిని కేవలం ఒక మతానికో, ధర్మానికో పరిమితం చేయకండి. సంకుచితం గా ఆలోచించకండి. 

బాల్యం నుంచి, పురాణాలు, శాస్త్రాలలోని విషయాలు మీ పిల్లలకు చెప్తూ ఉండండి. వారు పెరిగి పెద్దవారికి, సమజానికి , దేశానికి ప్రయోజకులుగా తయారు అయ్యేలా పిల్లలను పెంచండి. 

శ్రీ మద్భగవద్గీత లోని విషయాలను మఱింత ఆకర్షణీయంగా, పొందికగా అమర్చటానికి లేదా ఇతర విషయాలను చేర్చటానికి తగిన సూచనలను హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము. ఇంచుక సమయం వెచ్చించి ఈప్రయత్న సాఫల్యానికి మీ సూచనలు/అభిప్రాయాలు తెలియచేయండి.

తప్పులు లేకుండా శోధించి శ్రీ మద్భగవద్గీత లోని భాగాలను కూర్చటానికి మా శక్తికొలది ప్రయత్నించాము. అయినప్పటికీ మాకు తెలియని తప్పులనేమైనా మీరు గమనిస్తే దయచేసి మాకు తెలియచేయగలరు. కృతజ్ఞతలతో వాటిని సరిదిద్దగలము.

మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు శ్రీ మద్భగవద్గీత ఆప్ ఉపయోగ పడుతుంది అని ఆసిస్తు మీకు అందిస్తున్నాం . 

ఈ ఆప్ మీకు నచ్చితే దయచేసి రేటింగ్ ఇవ్వండి. 

No comments: