Friday, 12 January 2018


 ఏకవింశత్యవతారములు

 1-63-వ.

వచనము

అది సకలావతారంబులకు మొదలి గని యైన శ్రీమన్నారాయణ దేవుని విరాజమానం బయిన దివ్యరూపంబు; దానిం బరమ యోగీంద్రులు దర్శింతురు; అప్పరమేశ్వరు నాభీకమలంబువలన సృష్టికర్తలలోన శ్రేష్ఠుండైన బ్రహ్మ యుదయించె; నతని యవయవస్థానంబుల యందు లోకవిస్తారంబులు గల్పింపంబడియె; మొదల నద్దేవుండు కౌమారాఖ్య సర్గంబు నాశ్రయించి బ్రహ్మణ్యుండై దుశ్చరంబైన బ్రహ్మచర్యంబున చరియించె; రెండవ మాఱు జగజ్జననంబుకొఱకు రసాతలగత యయిన భూమి నెత్తుచు యజ్ఞేశుండయి వరాహదేహంబుఁ దాల్చె; మూడవ తోయంబున నారదుం డను దేవర్షియై కర్మనిర్మోచకంబైన వైష్ణవతంత్రంబు సెప్పె; నాలవ పరి ధర్మభార్యా సర్గంబు నందు నరనారాయణాభిధానుం డై దుష్కరంబైన తపంబు సేసెఁ; బంచమావతారంబునం గపిలుం డను సిద్ధేశుం డయి యాసురి యను బ్రాహ్మణునకుఁ దత్త్వ గ్రామ నిర్ణయంబు గల సాంఖ్యంబు నుపదేశించె; నాఱవ శరీరంబున ననసూయాదేవి యందు నత్రిమహామునికిం గుమారుండై యలర్కునికిఁ బ్రహ్లాద ముఖ్యులకు నాత్మవిద్యఁ దెలిపె; నేడవ విగ్రహంబున నాకూతి యందు రుచికి జన్మించి,యజ్ఞుం డనఁ ప్రకాశమానుండై యామాది దేవతల తోడం గూడి, స్వాయంభువమన్వంతరంబు రక్షించె; అష్టమ మూర్తిని మేరుదేవి యందు నాభికి జన్మించి యురుక్రముం డనం బ్రసిద్ధుండై విద్వజ్జనులకుఁ బరమహంస మార్గంబుం బ్రకటించె; ఋషులచేతఁ గోరంబడి; తొమ్మిదవ జన్మంబునఁ బృథుచక్రవర్తియై భూమిని ధేనువుం జేసి సమస్త వస్తువులం బిదికె; చాక్షుష మన్వంతర సంప్లవంబున దశమం బైన మీనావతారంబు నొంది మహీరూపం బగు నావ నెక్కించి వైవస్వతమనువు నుద్ధరించె; సముద్ర మథన కాలంబునం బదునొకొండవ మాఱు కమఠాకృతిని మందరాచలంబుఁ దన పృష్ఠకర్పరంబున నేర్పరియై నిలిపె; ధన్వంతరి యను పండ్రెండవ తనువున సురాసుర మధ్యమాన క్షీరపాథోధి మధ్య భాగంబున నమృత కలశ హస్తుండై వెడలెఁ; బదమూఁడవది యయిన మోహినీ వేషంబున నసురుల మోహితులం జేసి సురల నమృతాహారులం గావించెఁ; బదునాలుగవది యైన నరసింహరూపంబునం గనకకశిపుని సంహరించెఁ; బదునేనవది యైన కపట వామనావతారంబున బలిని బదత్రయంబు యాచించి మూఁడులోకంబుల నాక్రమించెఁ; బదునాఱువది యైన భార్గవరామాకృతిని గుపితభావంబుఁ దాల్చి బ్రాహ్మణ ద్రోహు లయిన రాజుల నిరువదియొక్క మాఱు వధియించి భూమి నిఃక్షత్త్రంబు గావించె; బదునేడవది యైన వ్యాస గాత్రంబున నల్పమతు లయిన పురుషులం గరుణించి వేదవృక్షంబునకు శాఖ లేర్పఱచెఁ; బదునెనిమిదవ దైన రామాభిధానంబున దేవకార్యార్థంబు రాజత్వంబు నొంది సముద్రనిగ్రహాది పరాక్రమంబు లాచరించె; నేకోనవింశతి వింశతితమంబు లైన రామకృష్ణ రూపంబులచే యదువంశంబు నందు సంభవించి; విశ్వంభరా భారంబు నివారించె; నేకవింశతితమం బైన బుద్ధనామధేయంబునం గలియు గాద్యవసరంబున రాక్షస సమ్మోహనంబుకొఱకు మధ్యగయా ప్రదేశంబున జినసుతుండయి దేజరిల్లు; యుగసంధి యందు వసుంధరాధీశులు చోరప్రాయులై సంచరింప విష్ణుయశుం డను విప్రునికిఁ గల్కి యను పేర నుద్భవింపంగలం" డని; యిట్లనియె.

అవతారాలు

ప్రతిపదార్ధముబావం

అది అన్ని అవతారాలకు మూలవిరాట్టయిన అదినారాయణుని దేదీప్యమానమైన దివ్యరూపం. ఆ దివ్యరూపాన్ని మహాత్ములైన యోగీంద్రులు దర్శిస్తారు. శ్రీమన్నారాయణ దేవుని నాభికమలం నుంచి సృష్టికర్తలలో ఆద్యుడైన బ్రహ్మదేవుడు ఉద్భవించాడు. శ్రీహరి అవయవ స్థానాలనుంచి లోకాలు సమస్తము ఆవిర్భవించాయి.
1) ఆదినారాయణదేవుడు మొదట కౌమార మనే స్వర్గాన్ని ఆశ్రయించి సనకసనందనాది రూపాలతో కఠోరమైన బ్రహ్మచర్యాన్ని ఆచరిస్తు బ్రహ్మణ్యుడై చరించాడు.
2) రెండవసారి యజ్ఞవరాహదేహం ధరించి విశ్వసృష్టి నిమిత్తం రసాతలం నుంచి భుమండలాన్ని ఉద్ధరించాడు.
3) మూడవ పర్యాయం నారదు డనే దేవర్షిగా జన్మించి మోక్షదాయకమైన వైష్ణవధర్మాన్ని బోధించాడు.
4) నాలుగవ అవతారంలో ధర్ముడను వానికి మూర్తి యందు నరనారాయణ స్వరూపుడై ఆవిర్భవించి ఆత్మశాంతికోసం అపారమైన తపస్సు చేశాడు.
5) ఐదవ అవతారం కపిలావతారం. దేవహూతి కర్దములకు జనించి ఆసురి అనే బ్రాహ్మణునికి తత్త్వనిరూపకమైన సాంఖ్యాన్ని ఉపదేశించాడు.
6) ఆరవ అవతారంలో అత్రి అనసూయలకు దత్తాత్రేయుడై పుట్టి అలర్కుడు, ప్రహ్లాదుడు మొదలైవారికి ఆత్మవిద్య ప్రబోధించాడు.
7) ఏడవ పర్యాయం యజ్ఞుడనే నామంతో రుచికి, ఆకూతికి కుమారుడై, యమాది దేవతలతో స్వాయంభువ మన్వంతరాన్ని సంరక్షించాడు.
8) ఎనిమిదవ రూపంలో నాభికి మేరుదేవియందు ఉరుక్రముడను పేర ప్రభవించి పండితులకు పరమహంస మార్గాన్ని ప్రకటించాడు.
9) తొమ్మిదవ జన్మలో ఋషుల ప్రార్థన మన్నించి పృథుచక్రవర్తి యై భూదేవిని గోవు గావించి సర్వ ఓషధులను పిదికాడు.
10) పదవదైన మత్స్యావతారం దాల్చి చాక్షుష మన్వంతరంలో సంభవించిన జలప్రళయంలో నావపై నెక్కించి వైవస్వత మనువును కాపాడాడు. 
11) పదకొండవ పర్యాయం కూర్మావతారం స్వీకరించి మున్నీటిలో మునగిపోతున్న మందరపర్వతాన్ని నేర్పుగా వీపుపై ధరించాడు.
12) పన్నెండవ అవతారంలో ధన్వంతరి యై దేవదానవులు మథిస్తున్న పాలసముద్రంలో నుంచి అమృతకలశం హస్తాన ధరించి సాక్షాత్కరించాడు.
13) పదమూడవ అవతారంలో మోహిని వేషంలో రాక్షసులను వంచించి దేవతలకు అమృతం పంచి పెట్టాడు.
14) పద్నాలుగవ సారి నరసింహమూర్తిగా అవచతరించి ధూర్తుడైన హిరణ్యకశిపుణ్ణి రూపుమాపాడు.
15) పదిహేనవ అవతారంలో మాయా వామనుడై బలిచక్రవర్తిని మూడడుగులు దానమడిగి ముల్లోకాలు ఆక్రమించాడు.
16) పదహారవమారు పరశురాముడై రౌద్రాకారంతో బ్రాహ్మణ ద్రోహులైన రాజులను, ఇరవై ఒక్కమారు సంహరించి ధాత్రిని క్షత్రియహీనం కావించాడు.
17) పదిహేడవసారి వేదవ్యాసుడై అల్పప్రజ్ఞులైన వారికోసం వేదశాఖలను విస్తరింపజేశాడు.
18) పద్ధెనిమిదవ పర్యాయం శ్రీరాముడై సముద్రబంధనాది వీరకృత్యాలు ఆచరించి దేవకార్యం నిర్వర్తించాడు.
19) పందొమ్మిదవ అవతారంలో బలరాముడుగా, 
20) ఇరవయ్యో అవతారంలో శ్రీకృష్ణుడుగా సంభవించి భూభారాన్ని హరించాడు.
21) ఇరవై ఒకటవసారి బుద్ధుడై మధ్య గయా ప్రదేశంలో తేజరిల్లి రాక్షసులను సమ్మోహపరచి ఓడిస్తాడు.
22) ఇరవై రెండవ పర్యాయం కల్కి రూపంతో విష్ణుయశుడనే విప్రునికి కుమారుడై జన్నించి కలియుగాంతంలో కలుషాత్ములైన రాజులను కఠినంగా శిక్షిస్తాడు అని పలికి సూతుడు ఇంకా ఇలా అన్నాడు.

No comments: