కాళేశ్వరం ఓ బృహత్తర యజ్ఞం
పద్దెనిమిది వేల ఏనుగుల బలం!
కాళేశ్వరం ప్రాజెక్టులో ఉపయోగిస్తున్న మోటరుపంపుల సామర్థ్యం అద్వితీయం
139 మెగావాట్ల శక్తి, సామర్థ్యాలతో ఒక్కో మోటరు
ఒక మెగావాట్‌కు.. 341 హెచ్‌పీ సామర్థ్యం
ఒక మోటరు శక్తి 1,86,402 హార్స్‌పవర్
సాగునీటికి వినియోగిస్తున్నవాటిలో ప్రపంచంలోనే అత్యంత
శక్తిమంతమైనదిగా పేరు ఒక్కో మోటరు పంప్ బరువు
1407 టన్నులు రోటర్ బరువే 120 టన్నులు.. స్టార్టర్ బరువు 260 టన్నులు
ఎక్కల్‌దేవి శ్రీనివాస్, గుండాల కృష్ణ, నమస్తే తెలంగాణ ప్రతినిధి
కాళేశ్వరం ప్రాజెక్టులో ఉపయోగిస్తున్న మోటరుపంపుల సామర్థ్యం అద్వితీయం
139 మెగావాట్ల శక్తి, సామర్థ్యాలతో ఒక్కో మోటరు
ఒక మెగావాట్‌కు.. 341 హెచ్‌పీ సామర్థ్యం
ఒక మోటరు శక్తి 1,86,402 హార్స్‌పవర్
సాగునీటికి వినియోగిస్తున్నవాటిలో ప్రపంచంలోనే అత్యంత
శక్తిమంతమైనదిగా పేరు ఒక్కో మోటరు పంప్ బరువు
1407 టన్నులు రోటర్ బరువే 120 టన్నులు.. స్టార్టర్ బరువు 260 టన్నులు
ఎక్కల్‌దేవి శ్రీనివాస్, గుండాల కృష్ణ, నమస్తే తెలంగాణ ప్రతినిధి
తెలంగాణను హరితనందనంగా మార్చాలనే సీఎం కేసీఆర్ ఉక్కు జలసంకల్పం.. హిమవన్నగ సమున్నత దీక్షాదక్షతలు.. ఆయన స్వప్నాలకు అనుగుణంగా కొండలను పిండి చేస్తూ పాతాళం లోతులు తీస్తున్న ఇంజినీర్ల ప్రజ్ఞాపాటవాలు.. అద్భుతాలను ఆవిష్కరిస్తున్నాయి. జలసిరులు తాండవమాడబోతున్న కాళేశ్వరం ప్రాజెక్టులో అపర మయులైన ఇంజినీర్లు అహోరాత్రాలు వేల ఏనుగుల బలమున్న లోహ బాహుబలులకు ప్రాణప్రతిష్ఠ చేస్తున్నారు. పరమాద్భుతమైన ఆధునిక మోటర్లకు మీటలు కూరుస్తున్నారు. తెలంగాణ గొంతుతడిపే ఊటలకు బాటలు తీస్తున్నారు. కాళేశ్వరం భూగర్భంలో సాగుతున్న జలయాగంపై ప్రత్యేక కథనం
మూడంతస్తుల ఇంట్లో బోరు నుంచి నీటిని వాడుకునేందుకు మనం సాధారణంగా రెండు హెచ్‌పీల సామర్థ్యం ఉన్న మోటరును వాడుతాం. మరి అలాంటి మోటర్లు ఒకటీ, రెండూ కాదు.. 93,201 మోటర్లను వరుసగా నిలబెట్టి నీటిని తోడుతుంటే ఎలా ఉంటుంది! అదే సామర్థ్యమున్న 6,52,407 మోటర్లతో ఒకేసారి నీటిని తోడితే? ఊహించడమే కష్టం! బాహుబలి కూడా బలాదూర్ అనేలా ఉన్న ఈ మోటర్లను ఏడింటిని అమర్చి రోజుకు రెండు టీఎంసీల గోదావరి జలాలను తెలంగాణ బీడు భూముల్లోకి పారించాలనే సీఎం కేసీఆర్ సంకల్పానికి అనుగుణంగా కాళేశ్వరం ఎత్తిపోతల పథకం రూపుదిద్దుకుంటున్నది. ఊహలకు కూడా అందని ఆ దృశ్యం మరికొన్ని నెలల్లోనే తెలంగాణలో ఆవిష్కారం కానున్నది. ఆసియాలోనే ప్రప్రథమంగా 139 మెగావాట్ల సామర్థ్యం ఉన్న మోటర్ల ద్వారా నీటిని లిఫ్టు చేయనున్నారు. పైగా ఈ మోటర్ల ద్వారా నీటిని ఎత్తిపోసేది 10-15 మీటర్ల ఎత్తులో కాదు.. ఏకంగా 115 మీటర్ల ఎత్తుకు తోడి పదమూడు జిల్లాల పరిధిలో 18 లక్షల ఎకరాలకుపైగా కొత్త ఆయకట్టుకు జీవం పోయనున్నారు. వచ్చే వర్షాకాలానికి గోదావరి నది నుంచి నీటిని మళ్లించాలన్న సీఎం కేసీఆర్ దృఢదీక్షకు అనుగుణంగా కాళేశ్వరం ఎత్తిపోతల పథకం పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో అందరినీ ఆకర్షిస్తున్న, ఆసక్తికరంగా మారిన కాళేశ్వరం మోటర్లు, పంపుహౌజ్‌ల నిర్మాణంపై నమస్తే తెలంగాణ ప్రత్యేక కథనం.
కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా మేడిగడ్డ వద్ద బరాజ్ నిర్మాణంతో గోదావరిజలాలను ఒడిసిపట్టడం మొదలవుతుంది. కన్నెపల్లి వద్ద నిర్మించే పంపుహౌస్‌తో జలాల మళ్లింపునకు శ్రీకారం చుడతారు. 40 మెగావాట్ల సామర్థ్యం కలిగిన 11 మోటర్ల ద్వారా 23 వేల క్యూసెక్కులకు పైగా గోదావరి జలాలను 49 మీట ర్ల ఎత్తులోకి లిఫ్టు చేస్తారు. ఆపై అన్నారం బరాజ్‌లో పోయడం.. అక్కడి నుంచి 40 మెగావాట్ల సామర్థ్యం ఉన్న ఎనిమిది మోటర్లతో తోడి 34 మీటర్ల ఎత్తులో ఉన్న సుందిల్లలో, తర్వాత సుందిల్ల నుంచి 40 మెగావాట్ల సామర్థ్యం ఉన్న తొమ్మిది మోటర్లతో జలాలను 40 మీటర్ల ఎత్తుకు లిఫ్టుచేసి ఎల్లంపల్లి ప్రాజెక్టులో పో స్తారు. ఎల్లంపల్లి నుంచి నీటిని మేడారం రిజర్వాయర్, ఆపై ఎస్సారెస్పీ వరద కాల్వ ద్వారా మిడ్‌మానేరులోకి తరలిస్తారు. మిడ్‌మానేరు నుంచి ఒకవైపు అప్పర్ మానేరుకు, మరోవైపు లోయర్ మానేరుకు.. ప్రధాన అలైన్‌మెంట్‌లో భాగంగా అనంతగిరి, ఇమాంబాద్ రిజర్వాయర్లకు జలాలను లిఫ్టు చేస్తారు. ఆపై ఇమాంబాద్ నుంచి 50 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించే మల్లన్నసాగర్ రిజర్వాయర్‌లోకి పోస్తారు. ఆ రిజర్వాయర్ నుంచి ఒకవైపు సింగూరు దిశగా, మరోవైపు యాదాద్రి-భువనగిరి జిల్లాలోని బస్వాపూర్, గంధంమల్ల రిజర్వాయర్లకు.. ఇంకోవైపు శామీర్‌పేట వైపున ఉండే కొం డపోచమ్మ రిజర్వాయర్‌లోకి గోదావరిజలాలను తరలిస్తారు. ఈ క్రమంలో 13 జిల్లాల పరిధిలో 18.25 లక్ష ల ఎకరాల కొత్త ఆయకట్టుకు సాగునీరు, 18.82 లక్షల ఎకరాలమేర ప్రాజెక్టుల ఆయకట్టును స్థిరీకరిస్తారు.
ఏనుగులను తలదన్నే మోటర్లు
ఏనుగులను తలదన్నే మోటర్లు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టులో మోటరుపంపుల విషయానికి వస్తే.. ప్రపంచంలోనే ఇంతటి భారీ మోటరు పంపులను ఇప్పటివరకు ఎవరూ సాగునీటికోసం ఉపయోగించలేదు. ఇదొక రికార్డు. వాటిలో 139 మోగావాట్ల సామర్థ్యంతో పనిచేసే 7 మహా మోటరుపంపులు ఉన్నాయి. ఇంతవరకు ప్రపంచంలోనే ఇంత భారీ మోటర్లను ఎక్కడా వాడలేదు. ఇది కాళేశ్వరం ప్రాజెక్టు లిఖిస్తున్న చరిత్ర. మొత్తంగా 82 మోటరుపంపులను కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా ఉపయోగిస్తున్నారు. ఇందుకోసం 4843.68 మెగావాట్ల విద్యుత్ అవసరం. ఈ పంప్‌హౌస్‌ల కోసమే ప్రత్యేకంగా 400 కేవీ సబ్ స్టేషన్లను నిర్మిస్తున్నారంటే, ఇక్కడి మోటరుపంపుల సామర్థ్యాలు ఎంతటివో అర్థం చేసుకోవచ్చు. కాళేశ్వరంలో భాగంగా రామడుగు పంపుహౌస్‌లో అమరుస్తున్న ఒక్కో పంపు, మోటరు బరువు అక్షరాలా 1407 టన్నులు. ఇందులో ప్రధాన భాగాలు-వాటి బరువును పరిశీలిస్తే... రూటర్-160 టన్నులు, స్టాటర్-185 టన్నులు, స్టేరింగ్-135 టన్నులు, డీటీ కోన్-15 టన్నులు, లోయర్ బ్రాకెట్-45 టన్నులు, గైడ్‌వెయిన్స్-160 టన్నులు, యాగ్జిలరీస్-500 టన్నులు, షాఫ్టులు-100 టన్నులు, ఇంపారెల్లర్-30 టన్నులు. మరి ఇంత బరువున్న పంపు, మోటరును మోసేందుకు దీటుగా భారీస్థాయిలో సిమెంట్ వేదిక (ఫౌండేషన్)ను నిర్మించాల్సిందే. ఆ నిర్మాణంలో వాడే స్టీలు పరిమాణం 1200 టన్నులు. సాధారణంగా 1200 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఒక ఇంటిని నిర్మించాలంటే వాడే స్టీలు కేవలం ఐదు టన్నులు. అలాంటిది 1200 టన్నులంటే దాదాపు 420కి పైగా ఇండ్ల నిర్మాణానికి వాడే స్టీలును కేవలం ఒకేఒక్క మోటారును పట్టి ఉంచేందుకు వాడుతున్నారన్న మాట. భౌగోళికంగా తెలంగాణకు సాగునీరు అందాలంటే ఎత్తిపోతల పథకాలే శరణ్యం. దీంతో మన ఇంజినీర్లు ఆధునిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటూ.. ఎత్తిపోతల పథకాల్లో రికార్డులను నెలకొల్పుతున్నారు.
దశాబ్దంన్నరగా ఆసియాలోనే అతిపెద్ద లిఫ్టు ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణాలు తెలంగాణ ఇంజినీర్లవే 2000-01 ప్రాంతంలో నల్లగొండ జిల్లాలో ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు ద్వారా వందమీటర్ల ఎత్తుకు నీటిని లిఫ్టు చేయడంతో ఆసియాలోనే పెద్ద లిఫ్టుఇరిగేషన్‌గా పరిగణించారు. ఆ ప్రాజెక్టులో ఒక్కోమోటరు సామర్థ్యం 18 మెగావాట్లు. అలాంటివి నాలుగు ఏర్పాటు చేశారు. తర్వాత కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలో 30 మెగావాట్ల సామర్థ్యం ఉన్న మోటర్లను ఏర్పాటు చేయడంతో ఆసియాలో అతిపెద్ద లిఫ్టు ఇరిగేషన్ స్థానం కల్వకుర్తి కాతాలో పడింది. ఇప్పుడు కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో 30, 120, 134 మెగావాట్ల సామర్థ్యం ఉన్న మోటర్లను బిగిస్తున్నారు. రామడుగు పంపుహౌస్‌లో అమరుస్తున్న మోటర్ల సామర్థ్యం 139 మెగావాట్లు. ఇది పూర్తయితే ఆసియాలో ఇదే అతిపెద్ద లిఫ్టు ఇరిగేషన్ మోటరుగా చరిత్రకెక్కుతుంది. ఈ రికార్డును కూడా తెలంగాణే అధిగమించనున్నది. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో ఏకంగా 145 మెగావాట్ల సామర్థ్యం ఉన్న మోటర్లను వినియోగించనున్నారు. అంటే మరి కొంతకాలంలో కాళేశ్వరం రికార్డును పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం అధిగమించనున్నదన్న మాట.
మోటర్ల ప్రత్యేకతలు
భూగర్భంలో 140 మీటర్ల లోతున సర్జ్‌పూల్‌లో ఉండే నీటిని ఉపరితలానికి పంపింగ్ చేసేందుకు ఉపయోగిస్తున్న ఒక్కో మోటరును నడిపించడానికి 139 మెగావాట్ల విద్యుచ్ఛక్తి అవసరం. సూటిగా చెప్పాలంటే.. ఒక్క మోటరు శక్తి 1,86,402 హార్స్‌పవర్‌తో సమానం. వ్యవసాయ అవసరాలకు పొలాల్లో వాడే 5 హెచ్‌పీ మోటార్లతో పోల్చుకుం టే.. 37,280 మోటర్లు కలిస్తే ఎంతో.. 139 మెగావాట్ల విద్యుత్‌తో నడిసే ఈ ఒక్క మోటారు అంత శక్తివంతమైనది.
సాధారణంగా ఇండ్లలో సంప్‌లోని నీటిని పైన ఉండే వాటర్‌ట్యాంక్‌లోకి తోడేందుకు ఒక హెచ్‌పీ మోటరును వాడుతాం. ఈ మోటర్‌తో నీటిని తోడితే.. సుమారు అంగుళం వ్యాసార్థ్యం ఉండే పైపులో నిం డుగా నీరు వస్తుంది. అదే చేనులు, పొలాల్లో వాడే వ్యవసాయ పంప్‌సెట్ (5 హెచ్‌పీ)తో అయితే సుమారు 2.5 నుంచి 3 అంగుళాల వ్యాసార్థం ఉండే పైపు నిండుగా నీళ్లు పోస్తుంది. కాళేశ్వరం ప్రాజెక్టు కోసం ఏర్పాటుచేస్తున్న 139 మెగావాట్ల విద్యుచ్ఛక్తితో పనిచేసే మోటర్ పంపు 115 మీటర్ల ఎత్తుకు నీటిని పంప్ చేస్తుంది. అదికూడా ఏకంగా 5 మీటర్ల వ్యాసంతో ఉండే పైపులో నిండుగా నీటిని పంప్ చేస్తుంది. అదీ దాని సామర్థ్యం!
కథలు.. పురాణాల్లో అత్యంత బలశాలి గురించి చెప్పాల్సిన సందర్భాల్లో వెయ్యి ఏనుగల శక్తితో పోల్చుతారు. తాజాగా బాహుబలి సినిమా తర్వాత మహాశక్తిమంతుడిని.. బాహుబలితో పోల్చుతున్నారు. కానీ 139 మెగావాట్ల విద్యుత్ మోటరు శక్తిసామర్థ్యాలను చూస్తే.. బాహుబలి కూడా బలాదూర్! కాళేశ్వరం ప్రాజెక్టు, ప్యాకేజీ 6లో కరీంనగర్ జిల్లా రామడుగు మం డలం లక్ష్మీపూర్ వద్ద భూఉపరితలానికి 140 మీటర్ల దిగువన అమరుస్తున్న ఒక్కో మోటరుపంపు సామర్థ్యం.. 1,86,402 గుర్రాల శక్తి.. 18,640 ఏనుగుల బలంతో సమా నం. సాధారణంగా 10 గుర్రాల శక్తి.. ఒక ఏనుగు బలంతో సమానం అని వ్యవహారంలో అంటుంటారు. ఈలెక్కన పద్దెనిమిది వేల ఏనుగుల బలం ఎంతో.. ఈ మోటరుపంపు శక్తికూడా అంతే.
No comments:
Post a Comment