శివపురాణం -16 వ భాగం: వైద్యనాథ లింగము : పూర్వోత్తరే ప్రజ్వలికానిధానే సదావసంతం గిరిజా సమేతం! సురాసురాధితపాదపద్మం శ్రీవైద్యనాథం తమహం నమామి!! ‘ఓ వైద్యనాథుడా, నీకు మేము నమస్కరించుచున్నాము’ అంటారు. మనవాళ్ళు ఏది చేసినా దాని చిట్టచివరి ప్రయోజనం పరబ్రహ్మమును చేరటమే. అభిషేకంలో శివునికి ఒక నామం ఉంది. ‘ప్రథమో దైవ్యో భిషక్’. ఈశ్వరుడు ఈ లోకమునకు మొట్టమొదటి వైద్యుడు. వైద్యుడు సాధారణంగా నాది నాది అని చెప్పిన ఈ శరీరంలో మీకే తెలియకుండా ప్రవేశించిన రుగ్మతను తొలగిస్తాడు. మనకి భవరోగము అని ఒక రోగం ఉంటుంది. అంటే ఎప్పుడూ సంసారంలో పడి కొట్టుకుంటూ ఉండడం. ఈ భవ రోగమునకు ప్రధాన కారణం అహంకారం. ఇటువంటి భవరోగములో పది కొట్టుకునే వాడిని పైకెత్తి తన పాదముల దగ్గరకి చేర్చుకుంటాడు. కాబట్టి కూడా ఆయన వైద్యనాథుడు. వైద్యులకు నాథుడయినవాడు లేదా వైద్యులయందు పెద్ద వైద్యుడు – రెండు కారణముల చేత ఆయనను వైద్యనాథ లింగము అని పిలుస్తారు. ఒకానొక సమయంలో లంకా పట్టణమును రావణాసురుడు పరిపాలిస్తూ ఉండేవాడు. లంకా పట్టణం ఎప్పుడూ దక్షిణ దిక్కునే ఉంటుంది. ఊరికి దక్షిణ దిక్కున శ్మశానం ఉంటుంది. జీవన యాత్రలో చిట్టచివరి ప్రయాణం అక్కడకు వెళ్ళడంతో పూర్తయిపోతుంది. రావణాసురుడు అజ్ఞాని కాదు. వేదమును చదువుకున్న వాడు, త్రికాలముల యందు సంధ్యావందనం చేసేవాడు, లింగార్చన చేసేవాడు, ఘన జట చెప్పేవాడు. కానీ ఈ చదువు ఒక స్థాయి యందు నిజమయిన చదువు కాదు. అంత గొప్పవాడయిన రావణుడు ఒకసారి కైలాసమునకు వెళ్ళాడు. శరీరము నేను అనే అహంకారంతో ఉన్నవాడికి కైలాసాచలాధీశుని దర్శనం దొరకడం కష్టం. కానీ రావణుడు ఈశ్వరుని పట్టుకోవడానికి చాలా బింకంతో కూడిన తపస్సు మొదలుపెట్టాడు. అనగా రజోగుణ ప్రకృతితో కూడిన తపస్సు మొదలుపెట్టాడు. ఇటువంటి పట్టుదలతో కూడిన తపస్సు చాలా అనర్థహేతువుగా, మనిషిని పాడు చేసేదిగా ఉంటుంది. ఈ తపస్సు సాత్త్వికంగా ఉండదు. అది ఈశ్వరుడిని కదపలేక పోయింది. పరమేశ్వరుడు రాలేదు. రావణుడు చేసే తపస్సులో దోషం ఉంది. ఈశ్వరుడి మీద అలక వహించాడు రావణుడు. అందుకని తొమ్మిది తలలు కోసేసుకున్నాడు. వాటిని అగ్నిహోత్రమునందు వ్రేల్చాడు. రావణుడు చేసే తపస్సు యందు వినయము లేదు. రావణుడు తన పదవ తలను కూడా నరుక్కుందుకు సిద్ధపడ్డాడు. సరిగ్గా ఆసమయంలో శంకరుడు వచ్చాడు. ఆయన వచ్చి ఎదురుగుండా నిలబడే సరికి రావణుని పది తలలు మరల మొలిచాయి. అపుడు శంకరుడు రావణునితో “రావణా, నీకు ఏమి కావాలి?” అని అడిగాడు. రావణుడు అపుడు తనకు విపరీతమయిన బలం కావాలి అన్నాడు. రెండవ కోరికగా శంకరుడిని వచ్చి లంకలో కూర్చోమన్నాడు. అపుడు శివుడు ‘నేను లింగమునందు ఉంటాను. నీవు దీనిని తెలివితో నీ పట్టణమునకు తీసుకువెళ్ళు’ అన్నాడు. రావణుడి ఒంటికి బలం ఉందికాని మనస్సుకి తెలివిలేదు. ఉత్తర క్షణం రావణుడి ఒంటికి బలం వచ్చింది. కానీ అతని ప్రవృత్తిలో మార్పు రాలేదు. రావణుడు ఆ శివలింగమును పట్టుకుని లంకకు బయలుదేరాడు. పరమాత్మ వానికి పాఠం చెప్పాలని అనుకున్నాడు. పిండాండ బ్రహ్మాండ అనుసంధానం అని ఒకటి ఉంది. ఈ శరీరమునకు ఆకలి వేస్తుంది. బ్రహ్మాండంలో లభించే ఏదో ఒక ఆహారపదార్ధం తీసుకు వెళ్లి ఈ పిండాండంలో పడెయ్యాలి. మళ్ళీ పిండాండంలో మిగిలిపోయిన శేషమును బ్రహ్మాండం పుచ్చుకుంటుంది. పిండాండమునకు దాహం వేస్తే బ్రహ్మాండమే ఇవ్వాలి. దాహార్తిని తీర్చడమే కాకుండా ఇందులో ఈశ్వర ప్రక్రియ ఒకటి ఉంది. ఇందులోని మలినములను పట్టుకుని ఆ నీళ్ళు బయటికి రావాలి. నీళ్ళను మరల బ్రహ్మాండంలో విడిచిపెట్టాలి. ఇది ఈశ్వరుడు. దాహం వేయించిన వాడు ఈశ్వరుడు, నీటిని ఇచ్చిన వాడు ఈశ్వరుడు, ఈ నీటిని మరల మూత్రముగా మార్చిన వాడు ఈశ్వరుడు, బయటకు పంపిన వాడు ఈశ్వరుడు. అందువల్ల ఈశ్వరానుగ్రహం లుప్తం అయితే అవతలి వాడు పాడైపోవడానికి ఒక్క కారణం చాలు. మూత్ర విసర్జన చేయవలసిన అవసరం రావణాసురుణ్ణి పాడు చేసేసింది. శివలింగాన్ని చేతితో పట్టుకుని మూత్ర విసర్జన చేయలేడు కదా! ఎవడో ఒకటు శివలింగమును పట్టుకుంటే బాగుండుని అని అనుకుని అటూ ఇటూ చూశాడు. ఆ శివలింగం శివుడన్న భావన రావణునికి లేదు. తేలికగా చూశాడు. అక్కడి సమీపంలో గల పశువులు కాసుకునే ఒక గొల్ల పిల్లవాడిని పిలిచి నేను మూత్ర విసర్జనకు వెళ్ళి వస్తాను ఈ శివలింగమును ఒకసారి పట్టుకుని ఉండవలసినది అని అడిగాడు. పిల్లాడి చేతిలో శివలింగమును పెట్టి మూత్ర విసర్జనకు వెళ్ళాడు. అది శివుడు. రావణాసురుడికి ఎలా బుద్ధి చెప్పాలా అని చూస్తోంది. ఆ శివలింగం చాలా బరువయిపోయింది. వాడు మోయలేక కింద పెట్టేశాడు. శివుడు రావణునితో ఇది నీ పురి చేర్చు. మధ్యలో దీనిని ఎక్కడయినా క్రింద పెట్టావో అక్కడ ఉండిపోతాను’ అని ముందరే చెప్పాడు. ఇప్పుడు ఆ గొల్ల పిల్లవాడు శివలింగమును చితాభూమి మీద పెట్టేశాడు. దీనిని చూసి రావణుడు పరుగుపరుగున వచ్చాడు. అతను వెంటనే ‘ఈశ్వరా, తీసుకు వెళ్ళమన్నావు, కానీ ఆ తెలివి నాయందు నిలబడక పోవడానికి కారణం కూడా నీవే. కాబట్టి ఇప్పుడ నా బుద్ధి మార్చవలసింది అని ప్రార్థన చేయలేదు. ఇదెంత దీనిని నేను ఎత్తుకు పోతాను అని కదపడానికి ప్రయత్నించాడు. అది కదలలేదు. ఆ శివలింగమును అక్కడే వదిలేసి లంకకు వెళ్ళిపోయాడు. వానికి ఒంట్లో బలం బాగా ఉంది. దేవతలందరూ వచ్చి రావణుడు అక్కడ వదిలి వెళ్ళిన ఆ శివలింగమునకు పూజలు చేయడం ప్రారంభించారు. రావణుడి బలం వలన చాలా ప్రమాదం రాగలదని దేవతలు భావించి దేవతలు నారదుని వద్దకు వెళ్లి రావణుడు సంపాదించిన బలం వానినే పాడుచేసేటట్లుగా చేయవలసినది అని కోరారు. నారదుడు వెళ్ళి ‘రావణా, నీవు కైలాసమునకు వెళ్ళి గొప్ప తపస్సు చేసి శంకరుడిని ప్రత్యక్షం చేసుకున్నావని ఎవరో చెప్పగా తెలిసింది. ఏమి చేశావో చెప్పవలసినది’ అని అడిగాడు. రావణుడు జరిగిన విషయం చెప్పాడు. అపుడు నారదుడు నీకు శివలింగమును ఇచ్చినట్లే ఇచ్చి దానిని నీకు కాకుండా చేసినవాడు కూడా శివుడే అయి ఉండవచ్చు కదా. దీనిని నిర్ధారించుకుందుకు నీవు ఒకసారి కైలాసమునకు వెళ్ళి నీ బలంతో కైలాసాన్ని కదిపి చూడు అప్పుడు నీకు యథార్థం తెలుస్తుంది. శంకరుడే కదిలిపోతే నీకు బలం బాగా ఉన్నట్లు. అప్పుడు ఇతరులమీదికి వెళ్ళు’ అన్నాడు. వెంటనే రావణుడికి అనుమానం వచ్చింది. ఇదేదో బాగుంది అని వెంటనే పుష్పకవిమానం ఎక్కి కైలాసపర్వతం దగ్గరకు వెళ్ళి కైలాస పర్వతమును కదపడం మొదలుపెట్టాడు. అలా కదిపేసరికి పార్వతీ పరమేశ్వరుల సింహాసనం కదులుతోంది. శంకరునికి కొంచెం కోపం వస్తే తప్ప దేవతల కార్యం నెరవేరదు. ఆయన మౌనంగా ఉంటాడేమోనని ఆ తల్లి కొంచెం చమత్కారంగా ‘మాట్లాడింది. అమ్మవారు శక్తి స్వరూపిణి. లోకమునకు అనారోగ్యం వస్తే బతికిస్తుంది. ఇప్పుడు లోకమును బతికించాలి. లోక కంటకుడిని చంపాలి. వాడు చావడానికి కారణం శివ ముఖతః రావాలి. అలా వచ్చేటట్లు ఆవిడ శివుణ్ణి మాట్లాడింది. ఆవిడ శివుణ్ణి రుద్రుడిని చేస్తుంది. రుద్రుడిని శివుడు చేస్తుంది. ఇప్పుడు లోకక్షేమం కోసం శివున్ని రుద్రుని చేస్తోంది. అబ్బా మీరు ఎంత గొప్ప శిష్యుడిని సంపాదించుకున్నా రండీ! మీరు వరాలు ఇచ్చిన రావణుడే వచ్చి కైలాస పర్వతాన్ని కదుపుతున్నాడు. ఎవరికైతే మీరు వరాలు ఇచ్చారో వాడికి ఇప్పుడు మీమీదకోపం వచ్చింది. వాడి బలానికి ఇప్పుడు మీరు నేనూ ఊగిపోతున్నాము. పాపం మీరుమాత్రం ఏం చేస్తారు లెండి?” అంది. ఆమె మాటలు వినేసరికి శివుడు రుద్రుడయ్యాడు. ఎవరు రావణుడికి బలం ఇచ్చారో ఆయనే శాపమును ఇచ్చాడు. ‘రావణా, ఇక కొద్దికాలంలో నీ మదం అణగిపోతుంది, ఇక్కడనుండి పో’ అన్నాడు. కైలాస పర్వతమును ఊపుతున్న రావణునికి ఈమాట వినపడింది. ఈశ్వరుని మాట నిజం అయింది. రావణుని పట్టుకున్న వాళ్ళందరూ నశించిపోయారు. రాముని ఆశ్రయించిన వాళ్ళందరూ రక్షించబడ్డారు. ఈ శివ వాక్యమును ఆధారం చేసుకునే తరువాత రావణునికి శాపములన్నీ వచ్చేశాయి. చివరకు రావణుని బలం తన వాళ్ళందరినీ చంపుకోవడానికి పనికొచ్చింది. రాముడు ఒక్కొక్క తల చొప్పున పది తలలు పడగొట్టేస్తుంటే ఆఖరున మండోదరి వచ్చి శివుడు ఏది చెప్పాడో అదే చెప్పింది. నీ ఒంటి పొగరు నిన్ను చంపింది. రాముడు నిన్ను చంపలేదు. ఏ మదం నీలో ప్రవేశించిందో అది నిన్ను చంపేసింది అని ఆవిడ చెప్పింది. ఇది ఆనాడు చితాభూమియందు వెలసిన వైద్యనాథుడన్న జ్యోతిర్లింగం ఏది ఉన్నదో ఆ జ్యోతిర్లింగం. ఆనాటి నుండి ఈనాటి వరకు వెళ్ళి దర్శించి నమస్కరించిన వాళ్ళందరికీ ఒక అనుగ్రహమును ఇస్తోంది. ఇదే వైద్యనాథుడంటే! భవము – అంటే సంసారమునండు కొట్టుమిట్టాడుతూ, కామక్రోధముల యందు తెరిపి లేకుండా తిరుగుతూ అహంకార మమకారములలో పడి సొక్కిపోకుండా సాత్త్వికోపాసనతో కూడిన ఈశ్వర భక్తిని క్రుపచేసి భవసాగరమునుండి మిమ్మల్ని ఉద్ధరిస్తుంది. ఇలా ఉద్ధరిస్తే ఒకడికి ఈశ్వరుడిని చేరడానికి కోటి జన్మలు పట్టవచ్చు. ఒక్క జన్మలో, ఒక్క గంటలో ఈశ్వరుని చేరిపోయిన మహాభక్తులు ఉన్నారు. కాబట్టి ఆ వైద్యనాథుని అలా దర్శించిన వారికి అటువంటి మహానుభావుడికి నమస్కరించిన వాడికి ఆయన అనుగ్రహం కలిగితే అతి తక్కువ కాలంలో ఉపాసన దిద్దబడుతుంది. అతి తక్కువ కాలంలో సత్త్వగుణం ఆవిర్భవిస్తుంది. ఆయన అనుగ్రహం లేకుండా ఆయనను రాజస తామసిక పూజలతో లొంగదీసుకోవాలన్న భావన మంచిది కాదు.
No comments:
Post a Comment