Friday, 16 February 2018


ఈరోజు సచివాలయంలో రియల్ టైం గవర్నెన్స్ సెంటర్ లో రిలయన్స్ గ్రూప్ ప్రతినిధులతో సమావేశమయ్యాను. ఆ సంస్థ అధినేత ముఖేష్ అంబానీ ఇటీవల ఏపీ ప్రభుత్వం ఏర్పాటుచేసిన రియల్ టైం గవర్నెన్స్ సెంటర్ ను సందర్శించి, ఎంతగానో ప్రశంసించిన విషయం తెలిసిందే. ఈ సెంటర్ నుండి నేర్చుకోవాల్సింది ఎంతో ఉందని తమ అధినేత చెప్పారని, అందుకే ఈ సెంటర్ ను చూడమని తమను పంపించారని ఆ ప్రతినిధులు చెప్పారు. ఆ మాటలు విన్నాక ఎంతో సంతోషంగా అనిపించింది.
రాష్ట్రంలో అమలు చేస్తున్న రియల్ టైం గవర్నెన్స్ ద్వారా ప్రజల సమస్యలను రియల్ టైం లో తెలుసుకొని ఏవిధంగా పరిష్కరిస్తున్నదీ వారికి వివరించాను.
సర్టిఫికెట్ లెస్ గవర్నెన్స్ తీసుకురావాలన్న ప్రభుత్వ ప్రయత్నం గురించి తెలిపాను.
మిగిలిన దక్షిణాది రాష్ట్రాలతో పోల్చుకుంటే ఆంధ్రప్రదేశ్ లో తలసరి ఆదాయం తక్కువగా ఉంది. విభజన కారణంగా రాష్ట్రంలో నెలకొన్న సమస్యలను అధిగమించి 15 శాతం వృద్ధి సాధించాలి అని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఆంధ్రప్రదేశ్ 2022 నాటికి దేశంలో అభివృద్ధి చెందిన మొదటి మూడు రాష్ట్రాల్లో ఒక్కటి గానూ, 2029 నాటికి దేశంలో నెంబర్ వన్ స్థానంలోనూ, 2050 నాటికల్లా ప్రపంచంతోనూ పోటీ పడాలన్న లక్ష్యంతో ఏపీ ప్రభుత్వం పనిచేస్తోందని... ఇందులో భాగంగానే 7 మిషన్స్, 5 గ్రిడ్స్ ఏర్పాటు చేసుకొని పనిచేస్తున్నామని... రాష్ట్ర ప్రజలకు ఇంటర్నెట్ సదుపాయం ప్రాథమిక హక్కుగా మారబోతుందని రిలయన్స్ ప్రతినిధులకు వివరించాను.
ఫైబర్ గ్రిడ్ ఏర్పాటు చేసుకుని 149 రూపాయిలకే వైఫై, ఇంటర్నెట్, టెలివిజన్ సౌకర్యాలను అందిస్తున్నామని చెప్పాను. రియల్ టైం గవర్నెన్స్ సెంటర్ పనితీరును తెలుసుకున్న రిలయన్స్ ప్రతినిధులు ఇదొక విప్లవాత్మక పాలనా సంస్కరణ అని కొనియాడారు.

No comments: