Saturday, 18 August 2018



శ్రీమద్భగవద్గీతా జ్ఞాన మహా యజ్ఞము” - భాగము – 0175



VISHWESHWAR SARMA NAMILIKONDA·SATURDAY, AUGUST 18, 2018


ఓం శ్రీ గణేశాయ నమః శ్రీ మాత్రే నమః శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః శుభ గ్రహాః


శ్రీ మద్భగవద్గీత - భాష్య త్రయం (శ్రీ శాంకర, శ్రీ రామానుజ మరియు శ్రీ మధ్వాచార్య - భాష్య - విశ్లేషణ సహిత)


సాంఖ్య యోగో నమ ద్వితీయోధ్యాయః


శ్లో 42, 43 మరియు 44 తరువాయి భాగం:


తాత్పర్య నిర్ణయః


“అవ్యవసాయబుద్ధిః కేషామ్ఋ యం వాచమవిపశ్చితః ప్రవదన్తి | తయాఽపహృతచేతసామ్ | బుద్ధిర్వ్యవసాయాత్మికత్వేన సమాధానే న వర్తతే | యథా వస్తు తథా జ్ఞానం తత్సామ్యాత్ సమమీరితం | విషమం త్వన్యథాజ్ఞానం సమధానం సమస్థితః || న తద్ భవత్యసద్వాక్యైర్విషమీకృతచేతసామ్ | స్వర్గాదిపుష్పవాధ్యేవ వచనం యదచేతసామ్ || న మన్యతే ఫలం మోక్షం విష్ణుసామీప్యరూపకమ్ | ఫలదం చ న మన్యన్తే తం విష్ణుం జగతః పతిమ్ భోగైశ్వర్యానుగత్యర్థే క్రియాబాహుల్యసన్తతామ్ | బహుసంసారఫలదామన్తే తమసి పాతినీం || యం వదన్తి దురాత్మానో వేదవాక్యవివదినః | తయా సమ్మోహితధియామ్ కథం తత్త్వజ్ఞతా భవేత్ || ఇతి చ |”


ఈ విధమైన ‘అవ్యవసాయ బుద్ధి’ అనగా స్థిరత్వము లేని బుద్ధి ఎవరికి ఉంటుంది? ‘తయా అపహృత చేతసామ్’ – అనగా అజ్ఞానుల మాటలను వినువారు, అసాధ్యమైన మరియు అవాస్తవమైన మాటల మాయలో పడిపోయిన వారు అగుదురు. వీరి మనస్సు ఏఒక్కనాడు కూడా సంతృప్తి చెందదు. ‘యథా వస్తు తథా జ్ఞానం’ వారి పనులు మరియు ఆలోచనలు ఏవిధంగా ఉంటాయో అదే విధంగా వారి తెలివితేటలు మరియు జ్ఞానము కూడా ఉంటుంది. వారి తెలివి పలు విధములుగా చంచలమై ఉంటుంది అదే విధంగా వారి సంతృప్తి కూడాను. వారు ఏఒక్కదాని వలన కూడా సంపూర్ణ సంతృప్తిని చెందరు. వీరిలో సరియైన ఆలోచనలు రావు. వీరు సదా తప్పుడు ఆలోచన ద్వారా ప్రభావితం అవుతారు. ఇట్టి వారు స్వర్గాన్ని గూర్చి మాత్రమే మాట్లాడు వారు, ఇట్టి స్వర్గము పుష్ప సమానమైనదని వారి జ్ఞానము గ్రహించ జాలదు. వీరు మోక్షాన్ని మరియు శ్రీ మహా విష్ణు సాన్నిధ్యాన్ని ప్రధానమైన ఫలముగా భావించరు. ‘ఫలదం చ న మన్యన్తే తం విష్ణుం జగతః పతిమ్’ - అంతే కాదు సమస్త జగత్తుకు ఆధారభూతమైన శ్రీ మహా విష్ణువు సర్వ కర్మ ఫల దాత గా కూడా భావించరు. అనగా కర్మ ఫలాన్ని ప్రసాదించే వాడు శ్రీ మహావిష్ణువు అని వారు గ్రహించ జాలరు. ‘భోగైశ్వర్యానుగత్యర్థే క్రియాబాహుల్యసన్తతామ్’ శారీరిక సుఖాలను అనుభవించుటకు, రాజ్య అధికార ప్రాప్తికి ఇత్యాది ఐహికమైన వాంఛ లకు గాను వారు సమయానుసారంగా వైదిక కర్మలను ఆచరిస్తూ ఉంటారు. అనగా వారి ప్రధాన ఆశయం ‘సుఖాలు అనుభవించడం మరియు రాజ్యాధికారం’. ‘బహుసంసారఫలదామన్తే తమసి పాతినీం’ - ఇట్టి కర్మాచరణ వలన వారు నిరంతరం ‘జన మరణాలు’ అనే విష వలయంలో చిక్కుకొని జన్మిస్తూ – మరణిస్తూ ఉంటారు. అనగా జన్మించిన మొదలు కామ్యాపెక్షతో కర్మలను ఆచరిస్తాడు. మరణ సమయం వరకు కూడా వారి కోరికలు తీరవు. మరణిస్తాడు. తిరిగి అవే కోరికలతో పునః జన్మించి కోరికల సాధనకు గాను కర్మలను ఆచరిస్తూ ఉంటారు. ఇట్టి విషవలయం నిరంతరం కొనసాగుతూ ఉంటుంది. ఇట్టి వారు మరణానంతరం చీకటి లోకాలో ప్రవేశిస్తారు. అదే అజ్ఞానాంధకారం. ‘యం వదన్తి దురాత్మానో వేదవాక్యవివదినః’ - వీరి మనస్సులు దురాలోచన గల అజ్ఞానుల మాటలతో ప్రభావితమై ఉంటాయి. వారు వేదాలలో సూచించిన దాన్ని వక్రీకరించి చెప్తారు. ‘తయా సమ్మోహితధియామ్ కథం తత్త్వజ్ఞతా భవేత్’ - అలాంటి వారి మాటలలో పడ్డవారు జ్ఞానాన్ని ఏవిధంగా పొంద గలరు? వారు అజ్ఞానాంధకారం లోనే ఉంటారు.


“ఇష్టాపూర్త మన్యమానా వరిష్ఠం నన్యచ్ఛేయో వేదయన్తే ప్రమూఢాః | నాకస్య పృష్ఠే సుకృతే తేఽనుభూత్వా ఇమం లోకం హీనతరం వ విశన్తి || ఇతి చార్థవర్ణీయశృతిః | వేదవాదరతో న స్యాన్న పాపణ్డీ న హైతుకీ || ఇతి హే భాగవతే ||”


‘కోరిన కోరికలు నెరవేరడం’ – ఇదే చాల మందిలో ప్రధానమైనది. దీన్ని మించి మరియొక మహత్కార్యం వీరికి లేదు. దీన్ని మించిన గొప్ప కూడా ఏమీ లేదు. వీరు ఈ మయా లోకంలోనే ఉంటారు. వీరు ఇది ఒక మాయ అని కూడా గ్రహించ జాలరు. ‘నాకస్య పృష్ఠే సుకృతే తేఽనుభూత్వా ఇమం లోకం హీనతరం వ విశన్తి || ఇతి చార్థవర్ణీయశృతిః’ అనగా స్వర్గంలో సుఖాలను అన్నిటినీ అనుభవించిన పిమ్మట వారు పునః పృథ్వీ పైకి తిరిగి వస్తారు. అంతే కాదు ఇంతకంటే కూడా హీనమైన లోకాలను చేరవచ్చు కూడాను. ఈ విధంగా అధర్వణవేద శృతులందు పేర్కొన బడినది. అందుకే వేదాలను వక్రీకరించే వారి మాటలలో పడరాదు. ఒకవేళ పడ్డామో ఆ విధంగా విభేదించిన వారి మాటలకూ బలికాక తప్పదు అంతే కాదు పాపాన్ని కూడా సంక్రమించు కొన్న వారమౌతాము అని భాగవత పురాణము ఘోషించు చున్నది.


తరువాయి భాగం రేపు..................

No comments: