Saturday, 18 August 2018

శ్రీమద్భగవద్గీతా జ్ఞాన మహా యజ్ఞము” - భాగము – 0176

VISHWESHWAR SARMA NAMILIKONDA·SUNDAY, AUGUST 19, 2018
శ్రీ మద్భగవద్గీత - భాష్య త్రయం (శ్రీ శాంకర, శ్రీ రామానుజ మరియు శ్రీ మధ్వాచార్య - భాష్య - విశ్లేషణ సహిత)
సాంఖ్య యోగో నమ ద్వితీయోధ్యాయః
శ్లో 42, 43 మరియు 44 తరువాయి భాగం:
తాత్పర్య నిర్ణయః (తరువాయి భాగం):
“యో న జానన్తి తం విష్ణుం యాథార్థేన వా సంశయాత్ | విజ్ఞాసవచ్చ నితరం శ్రద్ధావన్తః సుసాధవః || నిర్ణే తృణామభావేన కేవలం జ్ఞానవర్జితాః | తే యాజ్ఞికాః స్వగపభక్షయే యాన్తి మనుష్యతామ్ || యైర్నిశ్చితం పరత్వ తు విష్ణోః ప్రాయో న యాతనాం | బ్రహ్మహత్యాభిరపి యాన్తాధిక్యే చిరం న తు || విశేష ఏవం తేషాం తు తదన్యేషాం విపర్యయః | యే తు భాగవతాచార్యేః సమ్యగ్ యజ్ఞాది కుర్వతే || బహిర్ముఖా భాగవతోఽనివృత్తాశ్చ వికర్మణః | దక్షిణాతర్పితానాం తు హ్యాచార్యాణాం తు తేజసా || యాన్తి స్వర్గే తతః క్షిప్రం తామోఽన్ధం ప్రాప్నువన్తి చ | తదన్యే నైవ చ స్వర్గే యాన్తి విష్ణుబహిర్ముఖాః || ఇతి నారదీయో ||”
కొంతమంది అర్హత గల విశ్లేషకులు, చక్కని గ్రహణ శక్తి గల వారు, ఉత్తములు ఇత్యాది వారు తమలో గల సంశయ స్వభావము, వలన అనగా అసలు శ్రీ మహావిష్ణువు గొప్పవాడు అనే విషయంలో సంశయం గల వారు శ్రీ మహావిష్ణువు యొక్క గొప్పతనాన్ని ఎరుగకున్నారు. వీరు అజ్ఞానులనడం లో సందేహమే లేదు. ఇట్టి వారు స్వర్గాపేక్షతో కర్మలను ఆచరించి, ఇతర దేవతలను ఆరాధించి అవ్యవసాయాత్మికా బుద్ధితో కర్మలను ఆచరించి, స్వర్గప్రాప్తిని పొంది పునః వారు మానవ జన్మను దాల్చు చున్నారు. ఎవరు శ్రీ మహావిష్ణువును అనుష్టించు చున్నారో, ఆరాధించు చున్నారో లేదా ఆయన గొప్పతనాన్ని ఎరిగి ఉన్నారో వారికి జీవిత కాలమున ఏవిధమైన బాధలు, యాతనలు కూడా ఉండవు. వారు ‘బ్రహ్మహత్యాభిరపి యాన్తాధిక్యే చిరం న తు’ – అనగా బ్రహ్మహత్యాది పాతకాలు వారికి అంటుకోవు (అనగా శ్రీ మహా విష్ణువును ఆరాధించు వారు బ్రహ్మ హత్య చేసుకోవచ్చనే అర్థం కాదు. శ్రీ మహా విష్ణువు ను అనుష్టించు వారు సంపూర్ణ ‘వ్యవసాయాత్మిక’ బుద్ధి గల వారై ఉంటారు. వారికి కర్మల యందు సంపూర్ణ నిగ్రహము ఉంటుంది. బ్రహ్మ హత్యాది పాతకాలకు చెందిన దోష పరిజ్ఞానము వారిలో ఉంటుంది. కావున వారు అతి దుష్కర్మలను ఆచరించ జాలరు. కావున వారికి అట్టి పాపములు అంటుకోవు). ఒకవేళ వారు ఇట్టి దుష్కర్మను ఆచరించరు వారైనను అతి స్వల్ప కాలంలో వారు తమ తప్పులను గ్రహించు వారగుదురు. ఇది వారిలోని ప్రత్యేకత. అనగా శ్రీ మహా విష్ణువును ఆరాధించు వారు ఆగ్రహావేశాలకు లోనై తాత్కాలికంగా దుష్కర్మాచరణ వైపు మ్రొగ్గుచూపినను వారిలో తమను తాము నిగ్రహించుకొనే శక్తి ఉంటుంది. అలాకాక గురువు గారి సూచనల మేరకు లేదా గురువు గారి ద్వారా పలు విధములైన వైదిక కర్మలను ఆచరించుచు దాని ఫలాన్ని తత్సంబంధిత దేవతకు అర్పిస్తూ కూడా శ్రీ మహావిష్ణువుకు దాసుడై ఉన్నను అట్టి కర్మ ఫలాల వలన స్వర్గ ప్రాప్తిని పొందు చున్నారు. కాని కొంత కాలానికి పునః మానవ జన్మనేత్తి తిరిగి వచ్చు చున్నారు. లేదా చీకటి లోకాలకు తిరిగి వెళ్ళు చున్నారు. కాని సర్వం శ్రీ మహావిష్ణువుకు అర్పించు వారు, సదా శ్రీ మహా విష్ణువునే ధ్యానించు వారు, ఆయన వైపే సదా దృష్టి గల వారు స్వర్గ లోకాలకు చెందిన అతి తక్కువ సుఖాలను కూడా వారు అనుభవించక శ్రీ మహా విష్ణు సాన్నిధ్యమును పొందు చున్నారు అని నారద మహా పురాణము ఘోషించు చున్నది.
తరువాయి భాగం రేపు..................
“సర్వం శ్రీ కృష్ణ దివ్య చరణారవిన్దార్పణమస్తు”

No comments: