Tuesday, 21 August 2018


ఆగష్టు 22 తేదీ

1922: "అల్లూరి సీతారామరాజు" నేతృత్వంలో చింతపల్లి పోలీస్ స్టేషన్‌పై దాడి జరిగింది.
బ్రిటిషు పాలకులను ఎదిరించి సాయుధ పోరాటం చేసిన మన్యం ప్రాంత విప్లవ వీరుడు "అల్లూరి సీతారామరాజు".
భారత స్వాతంత్ర్య చరిత్రలో అల్లూరి సీతారామరాజు (జూలై 4, 1897 - మే 7, 1924) (Alluri Sitaramaraju) ఒక మహోజ్వల శక్తి. ఇతడు జరిపిన సాయుధ పోరాటం స్వాతంత్ర్య ఉద్యమంలో ఒక ప్రత్యేక అధ్యాయం. సాయుధ పోరాటం ద్వారానే స్వతంత్రం వస్తుందని నమ్మి, దాని కొరకే తన ప్రాణాలర్పించిన యోధుడు. కేవలం 27 ఏళ్ళ వయసులోనే నిరక్షరాస్యులు, నిరుపేదలు, అమాయకులు అయిన అనుచరులతో, చాలా పరిమిత వనరులతో బ్రిటీషు సామ్రాజ్యమనే "మహా శక్తి"ని ఢీకొన్నాడు.
గంటందొర, మల్లుదొర, మొట్టడం వీరయ్యదొర, కంకిపాటి ఎండు పడాలు, సంకోజి ముక్కడు, వేగిరాజు సత్యనారాయణ రాజు (అగ్గిరాజు - భీమవరం తాలూకా కుముదవల్లి గ్రామం), గోకిరి ఎర్రేసు (మాకవరం), బొంకుల మోదిగాడు (కొయ్యూరు) వంటి సాహస వీరులు 150 మంది దాకా ఇతని అజమాయిషీలో తయారయ్యారట. పోలీసు స్టేషన్లపై దాడి చేసి ఆయుధాలు ఎత్తుకెళ్ళడంతో "విప్లవం" ప్రారంభమైంది. 1922 ఆగస్టు 19న మహారుద్రాభిషేకం చేసి చింతపల్లి పోలీసు దోపిడీకి నిశ్చయించుకొన్నారు.
చింతపల్లి
1922 ఆగష్టు 22న మన్యంలో తిరుగుబాటు ప్రారంభం అయింది. 'రంపచోడవరం' ఏజన్సీలోని 'చింతపల్లి పోలీసు స్టేషను'పై 300 మంది విప్లవ వీరులతో రాజు దాడిచేసి, రికార్డులను చింపివేసి, తుపాకులు, మందుగుండు సామాగ్రిని తీసుకువెళ్ళారు. మొత్తం 11 తుపాకులు, 5 కత్తులు, 1390 తుపాకీ గుళ్ళు, 14 బాయొనెట్లు తీసుకువెళ్ళారు. ఏమేం తీసుకువెళ్ళారో రికార్డు పుస్తకంలో రాసి, రాజు సంతకం చేశాడు. ఆ సమయంలో స్టేషనులో ఉన్న పోలీసులకు ఏ అపాయమూ తలపెట్టలేదు. తిరిగి వెళ్ళేటపుడు, మరో ఇద్దరు పోలీసులు కూడా ఎదురుపడ్డారు. వారి వద్దనున్న ఆయుధాలను కూడా లాక్కున్నారు.
- Wikipedia

No comments: