Sunday, 28 May 2017

ఒకసారి భోజరాజుకు వింత కోరిక కలిగింది.తను మరణిస్తే కాళిదాసు తనని గురించి ఏమి
చెప్తాడో నని.కాళిదాసును అడిగాడు మహాకవీ నేను మరణించి నట్టుగా భావించి
కీర్తి శేషుడైన భోజరాజు అని శ్లోకాలు చెప్పండి.బ్రతికి ఉండగానే విని సంతోషిస్తాను. అని
అడిగాడు.రాజు కోరిక పిచ్చిగానూ అమంగళకరం గానూ అనిపించింది. ఆ మాటే కుండ బద్దలు కొట్టినట్టు చెప్పాడు.యిలాంటి శ్లోకాలు చెప్పమని మీరు అడగ కూడదు,,
నేను చెప్పకూడదు.క్షమించండి అన్నాడు.రాజు కోపంతో ఊగిపోయాడు.కవీంద్రా యిది 
నా ఆజ్ఞ ధిక్కరించితే దేశబహిష్కారమే శిక్ష మీకు తెలుసుగదా!అని బెదిరించాడు.బెదిరిస్తే భయపడి చెప్తాడేమోనని .కానీ కాళిదాసు చలించ లేదు.అదే మీ ఆజ్ఞ అయితే దాన్ని ధిక్కరించడం తప్ప నాకు మరో మార్గం లేదు.అన్నాడు.
అయితే నేను మీకు దేశబహిష్కార శిక్ష వేస్తున్నాను.అన్నాడు.బెదిరిస్తే కాళిదాసు శ్లోకం
చెప్తాడేమో నని...కానీ కాళిదాసు లేచి సభ విడిచి వెళ్ళిపోయాడు.ఎవరు చెప్పినా
వినిపించుకోకుండా తన వేశ్య విలాసవతి తో బాటు నగర విడిచి వెళ్లి పోయాడు.
యిలా జరుగుతుందని ఊహించని రాజు దిగులు పడి పోయాడు.కాళిదాసు లేకుంటే
ఆయనకు ఒకరోజు కూడా గడవదు.కొద్దిరోజులు గడిచాయి.యిక ఉండబట్టలేక
కాళిదాసును వెతకడానికి తానే బయల్దేరాలని నిశ్చయించు కున్నాడు.కాళిదాసు ఏకశిలా
నగరం లో వున్నట్టు ఎవరో నమ్మకంగా చెప్పారు.భోజరాజు గడ్డాలు,మీసాలూ పెంచి
యోగి వేషం లోకాళిదాసు ను వెతకడానికి బయల్దేరి ఏకశిలా నగరానికి చేరుకున్నాడు.
.వెతకగా వెతకగా ఒక వీధిలో కాళిదాసు కనపడ్డాడు.యోగి వేషం లో వున్న రాజు
మహాకవీ అభివాదాలు.అంటూ నమస్కరించాడు.కాళిదాసు మారువేషం లో నున్న రాజును గుర్తించలేదు.ప్రతి నమస్కారం చేస్తూ యోగీశ్వరా!తమది ఏదేశం?అని
అడిగాడు.నేను ధారనగరంనుండి వస్తున్నాను. అన్నాడు.అలాగ భోజరాజుగారు ఎలా ఉనారు?అని ఆత్రంగా అడిగాడు కాళిదాసు.
ఇంకెక్కడి భోజరాజు?ఆయన చనిపోయి నెల పైనే అయింది.అందుకే భోజరాజు లేని నగరం లో ఉండలేక నేను నగరం వదిలి వచ్చేశాను. అన్నాడు యోగి వేషములో వున్న
భోజరాజు. ఆ మాట వింటూనే కాళిదాసు విద్యుద్ఘాతం తగిలిన వాడిలా వీధిలోనే
కూలబడి పోయాడు.అయ్యో అని దుఃఖించాడు.అప్రయత్నంగా ఆయన నోటినుండి ఒక
శ్లోకం వెలువడింది.
అద్యధారా నిరాధారా, నిరాలంబా సరస్వతీ
పండితా: ఖండితాః సర్వే భోజరాజా దివంగతే .
అర్థము:--ఈ రోజు ధారానగరం నిరాధార నగరం అయిపొయింది.వాగ్దేవికి ఆలంబన
లేకుండా పోయింది.భోజరాజు దివంగతుడు కావడం తో పందితు లందరికీ చావు దెబ్బ
తగిలింది. భోజరాజు కోరిక తీరింది.కానీ కాళిదాసు వాక్శుద్ధి ప్రభావమో ఏమో అకస్మాత్తుగా రాజు మొదలు నరికిన వృక్షం లా కూలిపోయి ప్రాణాలు విడిచాడు.నివ్వెర పోయిన కాళిదాసు రాజును గుర్తించి మహారాజా!యెంత పని చేశారు?మారువేషం తో నన్ను
మోసగించబోయి మీరే చనిపోయారా? మీ చావుకు నేనే కారణ మయ్యానా?
అని కొంతసేపు రోదించాడు.వెంటనే కర్తవ్యం స్ఫురించి దుఖం దిగమ్రింగి భువనేశ్వరీ దేవిని ధ్యానించి తన శ్లోకాన్ని కొంచెం మార్చి చదివాడు
అద్య ధారా సదాధారా సదాలంబా సరస్వతీ
పండితాః మండితాః సర్వే భోజరాజే భువంగతే
అర్థము:-- ఈ రోజు ధారా నగరానికి చక్కని ఆధారం దొరికింది.సరస్వతీ దేవికి చక్కని
ఆలంబన దొరికింది.
భోజరాజు భూలోకం లో అవతరించ గానే, పండితులందరూ సత్కరించ బడినారు..శ్లోకం
పూర్తికాగానే భోజరాజు సజీవుడై లేచి కూర్చున్నాడు.రాజూ, కవీ యిద్దరూ గాధంగా కౌగలించుకున్నారు.
ఆ మర్నాడే బయల్దేరి ధారా నగరానికి తిరిగి వెళ్ళిపోయారు..
------------------------------------------------------

No comments: