నిన్న సాయంత్రం పిఠాపురంలోని ఓ ధియేటర్లో #బాహుబలి మూవీ చూడడానికని వెళ్ళాను... టికెట్ కౌంటర్ దగ్గరకి వెళ్ళి ' బాల్కనీ టికట్ ఒకటి ఇమ్మని ' అడిగితే అతను టికట్ చింపి ఇస్తూ " 200 సార్ " అన్నాడు... సరేనని రెండొందలు తీసిచ్చి టికట్ తీసుకున్నాను... తీరా చూస్తే టికట్ పైన దాని రేట్ 40 రూపాయలుగా మాత్రమే ఉంది.
అది చూసి " దీనిపైన 40 రూపాయల ధరగా ఉంటే మీరేంటి నా దగ్గర 200 తీసుకున్నారు? " అని ప్రశ్నించాను నేనతనిని...
" గవర్న్మెంట్ రేట్లు పెంచుకోమని చెప్పింది సార్ ఈ సినిమాకి... మొన్నటి వరకూ ఒక్కో టికట్టూ 300కి అమ్మాము ... ఇప్పుడు నెలదాటిపోతోంది కదా అని 200 తీసుకున్నాము ,, అంతే సార్...!!! " అని ' ఇది చాలా రీజనబుల్ ఇష్యూ ' అన్నట్లు సమాధానం చెప్పాడు నాకు ఆ కౌంటర్లోని వ్యక్తి...
" నాకు తెలిసి గవర్న్మెంట్ కాకుండా హైకోర్ట్ కదూ ఈ తీర్పు జారీ చేసింది? అది కూడా 20 శాతమో, ముప్పై శాతమో టికట్ రేట్ పెంచుకోమని ఉత్తర్వులు ఇచ్చినట్లు గుర్తు. కానీ మీరేంటి దానికి విరుద్ధంగా ఐదు రెట్లు టికట్ ధరని పెంచి అమ్ముతున్నారిలా ? " అని అడిగాను నేను అంతే రీజనబుల్గా....
" లేదు సార్, గవర్న్మెంట్ మాకే వదిలేసింది ఆ చాయిస్ని ఎంతకి టికట్ని అమ్మాలి? అనే విషయమై,, హై బడ్జట్ సినిమా కదాండి? అందుకే ఈ రేటుకి అమ్ముతున్నాము మేము " అని ' చాలా నిజాయితిగా వ్యవరిస్తున్నాము ఈ విషయంలో' అనే ధోరణితో సమాధానమిచ్చాడు అతను నా ప్రశ్నకి..
" మరి అలాంటప్పుడు ' ఈ టికట్ ధర ఇంత ' అని వీటిపై మీరమ్మే ధర ఎందుకు ముద్రించలేదు ? ఇది సరైన విధానం కాదు కదా మరి ? " అన్నాను నేను..
" అవి పాత టికట్లు సార్... మిగిలిపోయినవి ఏం చేసుకోమంటారు? ఉత్తినే చెత్తకుప్పపై పారబోయమంటారా? పాడేయడం ఎందుకని ఇలా ఇక్కడ వాడేస్తున్నాం " అని కాస్త అసహన ధోరణిని,, ' ఈ విషయం ఇక్కడితో తెమిలిపోతే బాగుండును ' అనే భావాన్నీ తన మాటల్లో నింపుకుని మాట్లాడాడు అతను నాతో.
" ఆహా...!!! చాలా బాగుంది... మరి ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేటప్పుడు ఒక్కో టికట్టూ 40 రూపాయలకి మాత్రమే అమ్మామని పన్ను కడతారా మీరు? లేక ఈ రెండొందలూ మూడందలకీ అమ్మామనే కడతారా?
మీరే ధరకి అమ్మారో ప్రభుత్వానికేం తెలుస్తుంది ఈ చర్యవల్ల? అటు సరైన ధరని ప్రకటించకుండా సినిమా చూడడానికి వచ్చే ప్రేక్షకుడినీ,, ఇటు సరైన పన్ను చెల్లించకుండా గవర్నమెంట్నీ మోసం చేస్తున్నారు మీరు... ఇది సరైన విధానమైతే కాదు,, సరి చేసుకోండి " అని కాస్త మందలింపు ధోరణితో మాట్లాడానతనితో నేను...
మరి ఎందుకొచ్చిన గొడవనుకున్నాడో? లేక కళ్ళజోడు పెట్టుకొని సాఫ్ట్ కార్నర్లో మాట్లాడుతూ ఇలా లాజిక్గా మాట్లాడే ఈ వ్యక్తితో జాగ్రత్తగా ఉండడమే మంచిదిలే అని అనుకుని అనుకున్నాడో? లేక నేనలా చాలా విషయాలు తెలిసినట్లు మాట్లాడడం చూసి ఏ వినియోగదార్ల చట్టం ప్రకారం కేస్ బుక్ చేస్తానని భయపడ్డాడో ఏమో అతను తెలీదు కానీ కాస్త తగ్గుడు ధోరణిలోకి దిగి డమ్మున్నర కుడుచుకుంటూ " సరే సార్,, 40కే తీసుకోండి మీరు టికట్ని " అని మిగతా డబ్బులు నాకు తిరిగి చెల్లించేశాడు...
నవ్వొచ్చింది నాకు...
నాకు తెలిసినంతలో నా తర్వాత లైన్లో నించున్నవాళ్ళకి కూడా అతను నలభై రూపాయలకే టికట్లు ఇచ్చాడు.. ఆ తర్వాతి సంగతి నాకు తెలీదు కానీ కౌంటర్ని వదిలి నేనొచ్చేస్తూంటే నాపక్కనున్న వ్యక్తి ఒకాయన " మనమేం చెయ్యలేం సార్ ఈ విషయమై.... ఇది సామాన్యమైపోయింది మనందరికీ.. అందుకనే వాళ్ళిలా వాళ్ళకిష్టం వచ్చిన రేటుకి అమ్మేయగలుగుతున్నారు మనకి " అని అన్నాడు ...
"" అలా అని ఎందుకనుకోవాలండీ మనం? మనకున్న రైట్స్ని మనం క్వశ్చన్ చేయడం నేరమేమీ కాదు కదా? ఎవరో ఏదో అనుకుంటారేమో అనే సిగ్గూ ,, గొడవెందుకులే అనే సర్ధుబాటు ధోరణి మనం ప్రదర్శించడం వల్లే వీళ్ళిలా ఇంత నిర్భీతిగా వాళ్ళకిష్టం వచ్చిన రేట్లకి అమ్మగలుగుతున్నారు కౌంటర్ దగ్గరే మనకి టికట్స్ని ఇంతింతలా రేట్లు పెంచి....
మనం ధియేటర్కి ఎంటర్టైన్మెంట్ పొందడానికొచ్చాం కానీ ఇలా దోచుకోబడడానికి రాలేదు కదా? టికట్ అనే వ్యవస్థ ఒకటి ప్రేక్షకుడికీ ధియేటర్ వోనర్కీ మధ్య చెల్లింపు వ్యవహారంగా ఉన్నప్పుడు మనం దానినే పాటించాలి కానీ దానికి సమాంతరంగా మరో దోపిడీ వ్యవస్థని పోషించడమెందుకు?' పైగా అది సహజమే ' అని సర్దుకుపోవడం ఎందుకు?
మనమడిగిన దాంట్లో తప్పేమైనా ఉందా? లేదు కదా?? మరి మన తప్పేమీ లేనప్పుడు మన భావాలను స్వేచ్ఛగా వ్యక్తపరచి ప్రశ్నించడానికి ఎందుకు సంకోచించాలి మనం???
అందుకే ఆ కౌంటర్లో ఉన్న వ్యక్తిని గట్టిగా క్వశ్చన్ చేసేసరికి మన మాటలలోని నిజాయితీకి సమాధానం సరిగ్గా చెప్పలేక తత్తరపడి సరైన ధరకి టికట్లు ఇచ్చాడు మనకి...
నా సంగతి పక్కనెడితే మీరు మీ కుటుంబంతో వచ్చారు కదా? మొత్తం నలుగురు సభ్యులకి ఇలా ప్రశ్నించకుండా ఉండుంటే 800 రూపాయలు అప్పనంగా చెల్లించి సినిమా చూసేవాళ్ళు... ఇప్పుడు అదే సినిమాని మీరు కేవలం 160 రూపాయలు చెల్లించి ఆనందించగలరు...
తేడా ఉందంటారా లేదంటారా? అదేమీ చిన్న విషయం కాదు కదా?? అని నేనంటే ఒప్పుకోలు ధోరణితో నవ్వుతూ నా భుజం తట్టి వెళ్ళిపోయారాయన :)
No comments:
Post a Comment