Tuesday, 4 July 2017

ఇది సరిగ్గా 7 దశాబ్దాల మాట.
శ్రీఆనందమోహన్ (పూజ్య శ్రీ సద్గురు శ్రీ విద్యాప్రకాశానంద స్వాములవారు) శ్రీవ్యాసాశ్రమము(ఏర్పేడు, చిత్తూరు జిల్లా)లో పూజ్యశ్రీ సద్గురుమహర్షి శ్రీమలయాళ స్వాములవారి చరణ సన్నిధిని 12 సం|| తపశ్చర్యను నియమనిష్ఠలతో, అపక్వాహారదీక్షతో పూర్తి గావించుకొని సన్న్యాసస్వీకారమునకు గురుదేవులచే సుముహూర్తము నిశ్చయింపబడిన శుభసమయము –
అది, 1947 సర్వజిత్ నామ సంవత్సరం, ఆషాఢ శుద్ధ ఏకాదశి మొదలు గురుపూర్ణిమ వరకు, 5 దినములు పంచాహ్నిక విధానములో శాస్త్రీయముగా కాశీ వేదపండితుల వారి సమక్షమున దివ్యముగ అతి పవిత్రముగ జరుపబడినది.
ఈ సన్న్యాస క్రతువులో విశేషమేమనగా -తల్లిదండ్రులు ఇష్టపూర్వకముగ పుత్రునకు సన్న్యాసమిప్పించుటయే. శ్రీశంకరాచార్యులవారి నుండి మొదలు ఇప్పటివరకు తల్లి, తండ్రుల అనుజ్ఞ ఎవరికీ లభించలేదని, "ఇది జగత్ప్రసిద్ధి చెందిన సన్నివేశమనీ, ఇది సువర్ణాక్షరములతో లిఖించవలసిన విశేషమని, ఆనాటి సన్న్యాసక్రతువు అంతిమోపన్యాసములో గురుదేవులు శ్రీమలయాళ యతీంద్రులు భావావేశంతో ఆనందభాష్పములతో ప్రవచించారు. మరియు తమకు ఇటువంటి భాగ్యము కలుగనందున తల్లి, తండ్రులకు చెప్పకనే ఇల్లు వీడి వచ్చితినని" తెలిపినారు.
ఆనాటి సన్న్యాసస్వీకార కార్యక్రమమునకు శ్రీవ్యాసాశ్రమ భక్తకోటి అంతయు తరలివచ్చిరి. ఆ అపూర్వమైన సన్న్యాసస్వీకార కార్యక్రమమును తిలకించి హర్షప్రపూర్ణులై, పులకితగాత్రులైరి. ఇటువంటి సన్నివేశము
*న భూతో న భవిష్యతి* అన్నట్లుగా ఉన్నది - అని సంతసించిరి.
తనకు సాష్టాంగవందనమాచరించిన ఆనందమోహనుని శ్రీ మలయాళ సద్గురుదేవులు ఇలా ఆశీర్వదించారు-
లోకములో ఆధ్యాత్మికవిద్యను ప్రకాశింప జేయుచు *విద్యాప్రకాశానంద* అను సన్న్యాసనామముతో విరాజిల్లుము- అని ఆశీస్సులందించారు.
వారి సన్న్యాసస్వీకారం తదుపరి
3 సం||లకు శ్రీగురుదేవుల సమ్మతితో
శ్రీ విద్యాప్రకాశానంద స్వాములవారు
1950 సం|| జనవరి 20 న శ్రీకాళహస్తిలోని స్వర్ణముఖినదీతీరాన "శ్రీశుకబ్రహ్మఆశ్రమాన్ని" స్థాపించినారు.
తదుపరి *గీతామకరందము* మున్నగు అనేక వేదాంతగ్రంథ రచనలు, ఆధ్యాత్మిక ప్రచారము, 108 గీత జ్ఞాన యజ్ఞములు, గీతాసప్తాహములు, విగ్రహప్రతిష్టలు, వేదాంత భేరి మాసపత్రిక స్థాపన, అనేక గీతామందిర ఆవిష్కరణలు, వేదాంతసభలు, ఆధ్యాత్మిక సమావేశాలు, శ్రీకాళహస్తిలో కళాశాలలు నెలకొల్పుట, మరియు ఆశ్రమములో ఉచితత్రినేత్రవైద్యాలయ స్థాపన గావించారు.
శ్రీస్వాములవారి గీతాప్రసంగములలో కఠినమైన వేదాంతము పండిత పామర జనరంజకమై యొప్పినది. యోగవాసిష్ఠ రత్నాకరము(వసిష్ఠ గీత), గీతా మకరందం మొదలు మానస బోధ, తత్త్వసారం, అమృతబిందువులు, ఇంకను దాదాపు 40 గ్రంథములు, గీతోపన్యాసముల ఆడియోలు, వీడియోలు అందరిని మెప్పించినవి. జీవులు సంసారతాపత్రయముల నుండి విముక్తిని పొంది శాశ్వతశాంతిని, పరమానందమును బడయుటకు మార్గములను తెలిపెడి శ్రీగురుదేవుల గీతాబోధలు అజరామరములు; సార్వజన,సార్వకాలీన ఆనందదాయకములు.
ఓమ్

No comments: