భగవద్గీత సారాంశం 'నారాయణుడు'
అసలు భగవద్గీత కంతటికీ సమగ్ర సారమేమిటి అనేది అతి సులభంగా ఈ శ్లోకంలో చెప్పారు యామునాచార్యులు.
స్వధర్మజ్ఞాన వైరాగ్య సాధ్యభక్త్యేకగోచరః
నారాయణః పరం బ్రహ్మా గీతాశాస్త్రే సమీరితః
నారాయణః పరం బ్రహ్మా గీతాశాస్త్రే సమీరితః
భగవద్గీతకి సారాంశం నారాయణుడు అని ఒక్క అర శ్లోకంలో చెప్పేసారు గీతా సారాంశాన్ని. మరి ఎలాంటి నారాయణుడు అతడు, "స్వధర్మజ్ఞాన వైరాగ్య సాధ్యభక్త్యేకగోచరః" మేం నారాయణుని కోసం తపస్సు చేస్తాం, జపం చేస్తాం, యజ్ఞం చేస్తాం, యాగం చేస్తాం, మేం యోగం చేస్తాం. అంటే ఆయన యాగం వల్లనో యోగం వల్లనో లభించేవాడు కాదు. భక్తి వల్ల లభించు భగవంతుడు మనకి భగవద్గీతలో కనిపిస్తున్నాడు. భక్తి అంటే ఏమి ? ప్రేమ. ఎట్లాంటి ప్రేమ ? భగవంతుడి మీద నిష్కలంకమైన ప్రేమ. అంటే ప్రేమించి ఏమిస్తావు తిరిగి అడగకపోయేది ప్రేమ. మనం హోటలుకి వెళ్తే భోజనం పెట్టి ఇంత ఇవ్వు అనేది ప్రేమ కాదు. మూల్యం అడగకుండా ప్రతి ఫలాన్ని ఆశించకుండా చేసేదేదో దాన్ని ప్రేమ అంటాం. తల్లి తన పిల్లవాడిని వాడు రేపు పెద్దవాడై ఏదో ఉద్దరిస్తాడని ప్రేమ చేయదు. ప్రేమించ కుండా ఉండలేక తాను ప్రేమ చేస్తుంది, దాన్ని కదా మనం ప్రేమ అనేది. ఎదురు చూడక ప్రతిఫలం ఆశించక చేసేది ప్రేమ. అట్లాంటి ప్రేమతో ఎవడైతే భగవంతున్ని సేవిస్తాడో దాన్ని భక్తి అంటారు. అట్లాంటి ప్రేమకు లభించు తత్త్వం అనేది మనకు భగవద్గీతలో కనిపిస్తుంది.
"స్వధర్మజ్ఞాన వైరాగ్య సాధ్యభక్త్యేకగోచరః", ఆ భగవంతుని పై ఏర్పడ్డ ప్రేమ వల్ల మనకి ఇతరత్రమైన వాటి యంది రుచి తగ్గుతుంది. దాన్ని వైరాగ్యం అంటాం. ఆ భగవంతుని గురించి ఎంతేంత ఎంతెంత వింటుంటే అంతంత అంతంత తెలుస్తూ ఉంటుంది దాన్ని జ్ఞానం అంటాం. ఎంత తెలిస్తే ఆ భగవంతుని కోసం ఏదో ఒకటి చేద్దాం అని అనిపిస్తుంది. ఎదో ఒకటి చేద్దాం అని అనిపిస్తుంది దాన్ని ధర్మం అంటాం. ఆ చేసేప్పుడు భగవంతునికి నచ్చేట్టు చేయాలనిపిస్తుంది అందుకు ఆయన మనకి ఏది నియమించాడో దాన్ని స్వధర్మం అంటారు. ఇలా స్వధర్మంతో ఏర్పడ్డ జ్ఞానం వల్ల వైరాగ్యంతో ప్రేమకలిగితే ఆ ప్రేమకి లభించువాడు నారాయణుడు అంటే. ఇది భగవద్గీత చెప్పేది.
"నారాయణః పరం బ్రహ్మా గీతాశాస్త్రే సమీరితః", అంటే భగవద్గీతలో నారాయణుడే పరమ దైవము అని చెప్పబడి ఉంది. అదేంటి మాకు నారాయణుడు గొప్ప వాడని తెలుసును, అయితే భగవద్గీతలో ఎక్కడా నారాయణుడు అనే పేరు కనిపించదు కదా అంటే నారాయణ అంటే ఏమిటి తెలియాలి, పరం బ్రహ్మ అంటే ఏమిటి తెలియాలి. సంస్కృతంలో బ్రహ్మ అంటే పెద్దది, మిగతా వాటిని తనంతట చేయునది. బృహతి బ్రుంహయతి ఇతి బ్రహ్మ. అదే తనని మించినది మరొకటి లేనిది అయితే అది పరం బ్రహ్మ అంటారు. మరి ఈ పరం బ్రహ్మ ఎక్కడ ఉంటాడు ? అంటే భగవద్గీత చెప్పేప్పుడు మధ్యలో తన విరాట్ రూపాన్ని చూపించాడు. విశ్వరూపాన్ని పదకోండవ అధ్యాయంలో చూపించాడు. ఆ రూపంలో తాను అన్నింటా లోన ఉంటాడని పదవ అధ్యాయంలో చెప్పాడు. అన్నింటా బయట ఉంటా అంటే అన్నింటినీ తనలో కలిగి ఉన్నాను అనేది పదకొండవ అధ్యాయంలో చెప్పాడు. ఇలా లోన బయట ఉండేవాణ్ణి నారాయణుడు అంటారు. సంస్కృతంలో 'ర' అంటే నశించునవి. 'నర' అంటే నశించనివి. ఈ ప్రపంచంలో కనిపించేవి మార్పు చెందుతూ ఉంటాయి కానీ నశించవు. అందుకే వీటిని వస్తువు అంటాం, అంటే అవి ఎక్కడో ఎదో ఒక రూపంలో 'వసతి' ఉంటాయి, కానీ నశించడం అనేది జరగదు. కాబట్టి అలాంటి వస్తువులని కలిగిన ఈ ప్రపంచాన్ని నారములు అంటారు. అవి ఆయా స్థానాల్లో ఉంటున్నాయి. అయితే ఈ వస్తువులన్నీ స్వతంత్రముచే అలా ఉండటం లేదు. వీటిని మనం నియంత్రించటం లేదు. మరి ఎవరు వీటిని నియంత్రిస్తున్నారు ? కొంత పరిదిలో చూస్తే మనం కొన్ని వస్తువులని మార్పు చేస్తున్నాం. కానీ భూమి, గ్రహాలు, నక్షత్రాల మాటేమిటి ? అవి ఏమైనా వాటి ఇష్టం వచ్చినట్లు తిరుగుతున్నాయా. వాటి కదలిక చాలా క్రమ బద్ధంగా జరుగుతుంది. వాటికి స్థితి గతులకి ఒక కారణం అనేది ఉంటుంది. మనం చూసేదాన్ని కార్యం అంటారు. ఈ కార్యాలన్నింటికీ కారణమై వాటికి ఆధారమైన వాడిని నారములకి అయనము అంటారు. అయనం అంటే ఆధారం అని అర్థం. నార మరియూ అయన కలిపితే నారాయణ అయ్యింది. కనిపించే ప్రతీది నారాయణ అవుతుంది. ఆ పదం అనేది పుంలింగ శబ్దం అయ్యింది. కానీ నారాయణ అనేవాడు "న స్త్రీ న పుంమాన్ న షండః" స్త్రీత్త్వ పుంస్త్త్వ నపుంసకత్త్వ అనే వాటికి అతీతము నారాయణ అనే తత్త్వం. స్త్రీ, పురుష అనేవి కర్మ ప్రభావానికి లోబడినవి. నమ్మాళ్వార్ చెబుతారు, "ఆణల్లన్ పెన్నల్లన్ అల్లావలియుమల్లన్", మనం భగవంతుడు అని అయితే ఎవరిని పిలుస్తున్నామో ఆయన పురుషుడు కాదు, స్త్రీ కాదు, మరొకటేదో కాదు. మరి అతడు అని ఎందుకు అనడం ? అంటే శాసించడం అనేది పుంలింగ శబ్దం. దయ అనేది స్త్రీలింగ శబ్దం. భగవంతుడు లోకాన్ని శాసించువాడు కనుక పుంలింగ శబ్దాన్ని వాడుతాం. అందుకే ఆ పదం నారాయ'ణ' అయ్యింది. అది పుంలింగ శబ్దం అయ్యింది. నారాయణ అనే శబ్ధాన్ని మించి అర్థాన్ని ఇచ్చే పదం మరొకటి లేదు. ఆ నారాయణుడే అవతరించి కృష్ణుడై వచ్చినప్పుడు తనని ఆశ్రయించిన వారికి "మమ సాయుజ్యమాగతాః సర్గేపనోజాయతే ప్రళయేన విదంతిచ" తనతో సమానమైన స్థితిని ఇస్తాను అన్నాడు. తనంతట చేయువాన్ని బ్రహ్మ అంటాం కనుక నారాయణుడే పరంబ్రహ్మ. అతణ్ణి మించిన వాడు మరొకటి లేడు. ఇది సారాంశం. అన్నింటికి బయటా ఉంటాడు, అన్నింటా లోనా ఉంటాడు. నారాయణ అనేది భగవంతుని పేరు. భగవద్గీత సారాంశం నారాయణుడు.
జై శ్రీమన్నారాయణ
శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామివారి ప్రవచనం
శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామివారి ప్రవచనం
No comments:
Post a Comment