తన సేనలు ఓడిపోయి పారిపోవడం చూసిన శ్రీహరి సమరాటోపంతో భూభారం వహించే దిగ్గజాల తొండాలతో సమానము లైన తన బాహుదండాలు సారించి విజృంభించాడు. బ్రహ్మాండభాండం బద్దలయ్యేలా పాంచజన్య శంఖం పూరించాడు. ఆ శంఖధ్వని పెళపెళ మనే పిడుగుల మ్రోత వలె వినబడింది; అతను ధరించిన నెమలిపింఛం ఇంద్రధనస్సు వలె కనబడింది; మెచ్చదగిన హస్తలాఘవం చేత బాణములు అల్లెత్రాటి యందు సంధించడం, లాగడం విడవడం తెలియరాకుండా ఉంది. మండలాకారంతో సూర్యమండల ప్రభవలె తేరిచూడరానిదై అతని శార్జ్గమనే ధనుస్సు క్రొత్తమెరుపు వలె తేజరిల్లింది; దిగ్గజాల చెవులకు వెరపు కలిగించే అతని ధనుష్టంకారాలు ఘుమఘమ ధ్వనులతో సహింపరానివై ఉరుముల చప్పుళ్ళుగా ఒప్పాయి; రథానికి కట్టిన గుఱ్ఱాల గిట్టల తాకిడికి లేచిన ధూళి మూలాన ఏర్పడ్డ చీకటి అంధకారమై తోచింది; అతని సాటిలేని యుద్ధసన్నాహా నైపుణ్యానికి పరవశించి నిక్కి చేతులెత్తి నాట్యం చేస్తున్న నారదమహర్షి హస్తవిన్యాసాలే, మిక్కిలి సంబరంతో తాండవనృత్యం సలిపే నెమళ్ళుగా నెగడాయి; అందమైన ఆయన రథచక్రాల రవళికి జంకి ఏనుగుల కుంభస్థలాలపై ఒరుగుతున్న వీరులు, మదించిన నెమళ్ళ క్రేంకారాలకు ఉలికిపడి తరుణుల కుండల వంటి కుచాల మీద వ్రాలే కాముకులుగా దీపించారు; నానా దేశాల రాజుల నెత్తురు ద్రావు కోరికతో పరవశములై పెనుబొబ్బలు పెట్టు పిశాచబృందాలు, “వర్షం వర్షం” అని పలవరించే చాతకాలుగా ద్యోతకము అయ్యాయి; అమోఘ యుద్ధప్రేరకు డయిన బలరాముడు వర్షానికి కారణమైన మందమారుతము అయ్యాడు; ఘోర విలయ సమయం లోని కారుమబ్బు వలె ప్రకాశించే శరీరచ్ఛాయ కల కమలనాభుడు శత్రువులకు సంబంధించిన రథ, గజాశ్వ పదాతుల దేహాలనే భూము లందు పుంఖానుపుంఖంగా లెక్కింపరాని పలురకాలైన దివ్యబాణములు అనే వర్షం కురిపించాడు; అలా అతడు శరవర్షం కురిపించే టప్పుడు శస్త్రాస్త్రముల రాపిడికి పుట్టిన నిప్పురవ్వలు వానకాలంలోని మిణుగురు పురుగులుగా నెగడినాయి; బాణాలచే చెదరిన వీరుల కిరీటములందు తాపబడిన పద్మరాగమణి ఖండాలు ఆరుద్ర పురుగుల మాదిరి ఉన్నాయి; గొప్ప తూపులచే చీల్చబడిన మదగజ కుంభాలలోని ముత్యాలు వడగండ్లుగా ఉన్నాయి; తీవ్రములైన అర్ధచంద్రబాణాలచే కాళ్ళు ఖండింపబడగా “కృష్ణా! కృష్ణా! నిలు నిలు” మని పలుకుతూ నేలపై కూలుతున్న శరీరాలు సేద్యగాండ్ర చేతులలోని గండ్రగొడ్డళ్ళచే నరకబడి కూలుతున్న పెనువృక్షాలుగా ఉన్నాయి; వాడి బల్లెములచే భగ్నములైన గుహలవంటి నోళ్ళ నుంచి రాలుతున్న దంతముల సమూహం మొల్లపూల గుత్తులుగా ఉన్నాయి; నిశిత బాణాలు నాటిన శరీరాలుకలవై క్రొత్తగాయాలనుండి పిలపిల నెత్తురు ప్రవహింపగా తిరగలేక ప్రాణాలు విడిచే ఏనుగులు సెలయేళ్ళతో కూడిన కొండలుగా ఉన్నాయి; కర్కశము లైన శరీరాలచే ఖండింపబడిన బాహుదండాలతో కలసి నేలపై పడిన వజ్రమయ కంఠాభరణాలు పాముపడగలతో కూడిన మొగలిపూలయ్యాయి; ప్రళయకాల మందలి సముద్రతరంగ ఘోషకు సాటివచ్చే భేరి స్వనాలు దారుణ మైన కప్పల బెకబెక ధ్వనులు అయ్యాయి; భీషణము లయిన బాణములచే కోయబడిన గుఱ్ఱముల ఏనుగుల మనుష్యుల మెదడులు రొంపులు అయి సొబగు మీరాయి; భయంకరమైన నెత్తురు వెల్లువలు ప్రవహించాయి; ఆ ప్రవాహంలో బాహువులు పాములుగా, తలపుఱ్ఱెలు తాబేళ్ళుగా, తలవెంట్రుకలు నాచుగా, చేతులు చేపలుగా, గుఱ్ఱాలు మొసళ్ళుగా, ఏనుగులు దీవులుగా, తెల్లగొడుగులు నురుగులుగా, వింజామరలు రాయంచలుగా, చితికిపోయిన అయిన ఆభరణాలలోని రత్నాల పొడులు ఇసుకతిన్నెలుగా అతిశయించాయి
No comments:
Post a Comment