Sunday, 26 March 2017



సూర్యనారాయణా!
సమస్త ప్రాణికోటికి జీవన శక్తిని, ఆరోగ్య భాగ్యాన్ని ప్రసాదించే ప్రత్యక్ష దైవం- సూర్యనారాయణుడు. ఆయనకు రవి, భాస్కరుడు, దినమణి, దివాకరుడు, ఆదిత్యుడు- ఇలా అనేక పేర్లు ఉన్నాయి. అవన్నీ సూర్యుడి ప్రాభవాన్ని తెలియజేస్తాయి.
సూర్య మహిమను 31 శ్లోకాల్లో ‘ఆదిత్య హృదయం’ పేరిట వాల్మీకి మనకు అందజేశారు. ఇది రామాయణం ‘యుద్ధకాండ’లో ఉంది. రామ రావణ యుద్ధాన్ని ఆకాశం నుంచి దేవతలు, మహర్షులు, గంధర్వులు ఉత్కంఠగా చూస్తుంటారు. వారిలో అగస్త్య మహర్షి ఉంటాడు. తపోశక్తితో పరమేశ్వరుడి అనుగ్రహం పొందిన రావణుణ్ని సంహరించడం ఎలా అని ఆలోచిస్తూ రాముడి వద్దకు వెళతాడు. వెళ్ళి ఆదిత్య హృదయాన్ని ఉపదేశించడంతో, దాన్ని రాముడు పఠించి యుద్ధంలో విజయం సాధిస్తాడు.
మహా భారతంలో భగవద్గీత, రామాయణంలో ఆదిత్య హృదయం- ఈ రెండూ యుద్ధరంగంలోనే ఆవిష్కారమయ్యాయి. సమర రంగంలో నాడు రాముడి విజయానికి సాయపడినట్లే, జీవన రంగంలో నేడు ప్రాణికోటికి ఆదిత్య హృదయం దోహదపడుతోంది.
సూర్య భగవానుడు చైతన్యానికి ప్రతీక. ఆయన- జ్ఞాన ప్రదాత, స్ఫూర్తి దాత. రాత్రి చీకటిని చూసి భయభ్రాంతులకు గురయ్యే లోకులకు తన వెలుగు కిరణాలతో అంతులేని ధైర్యాన్ని, ఉత్సాహాన్ని ప్రసాదిస్తాడు. అజ్ఞాన తిమిరంతో సమరం చేసే శక్తిని కలిగిస్తాడీ ప్రత్యక్ష భగవానుడు! ఉషోదయ కిరణాలతో లోకాన్ని స్పర్శించే ఆయనను దేవతలందరూ పూజిస్తారు. అంతటా నిండి ఉన్న సూర్యుడికి ఏ దిక్కున నిలిచి నమస్కరించినా, అది ఆయనకే చెందుతుంది. అందరినీ సమభావంతో చూసే స్వభావం ఆ కిరణాల్లో ఉంది. రాజాస్థానాల్లో ఉన్నవారికి, పూరిళ్లలో నివసించేవారికి సూర్యకిరణ కాంతి సమంగా లభిస్తుంది.
సూర్యస్తోత్రం చేసిన సత్రాజిత్తు, ఆయన అనుగ్రహంతోనే శ్యమంతక మణి పొందుతాడు. మహాభారతంలో పాండవులు అరణ్యవాసం చేస్తున్నప్పుడు, సూర్యుణ్ని ప్రార్థిం చడం ద్వారా ధర్మరాజుకు అక్షయపాత్ర లభిస్తుంది. ఆ తరవాత తన వద్దకు వచ్చిన అనేకమందికి దానితోనే ఆయన అతిథి సత్కారం చేసి ఆనందపరుస్తాడు. శ్రీకృష్ణుడి కుమారుడు సాంబుడు సూర్యోపాసన వల్లనే వ్యాధినుంచి విముక్తుడవుతాడు. ‘మయూర శతకం’ రచించిన అమర మహాకవి సూర్య స్తుతి కారణంగానే అంధత్వం నుంచి బయటపడ్డాడని పురాణగాథ చెబుతోంది.
శ్రీకాకుళం సమీపాన అరసవల్లిలో సూర్యనారాయణస్వామి పుణ్యక్షేత్రం ఉంది. మెరుగైన ఆరోగ్యం కోసం అనేకమంది ఆ క్షేత్రాన్ని దర్శించి సూర్య నమస్కారాలు చేస్తుంటారు. హర్షంతో తిరిగి ఇళ్లకు వెళుతుంటారు. అందుకే ఈ క్షేత్రానికి ‘హర్షవల్లి’ అనే పేరు వచ్చి, కాలక్రమంలో అరసవల్లిగా స్థిరపడింది.
కర్కాటకం నుంచి ధనుస్సు వరకు గల సూర్య సంచారాన్ని ‘దక్షిణాయనం’ అని, మకరం నుంచి మిథునం వరకు సంచారాన్ని ‘ఉత్తరాయణం’ అని పిలుస్తారు. హేమంత, శిశిర, వసంతాల్లో ఉత్తరాయణం ఉంటుంది. ఆహ్లాదకరమైన వేడి, చల్లని గాలితో అది ఆరోగ్యప్రదాయని అని పెద్దలు చెబుతుంటారు. మనిషిలోని సానుకూల దృక్పథానికి సూర్యుడే స్ఫూర్తి. ఉదయమే లేలేత సూర్యకిరణాల్లో నడవటం ఎంతో ఆరోగ్యకరమని వైద్యశాస్త్రం చెబుతుంది. ప్రతి రోజూ ఉదయాన్నే సూర్యుడికి అభిముఖంగా నిలిచి, ఆ కిరణ స్పర్శ మధ్య ఆదిత్య హృదయం పఠించడం ఎంతో మేలు చేస్తుందంటారు.
సూర్యుడు రానిదే, జన జీవితాల్లో వెలుగు లేదు. ఉత్సాహం ఉండదు. అసలు బతుకు బండే సాగదు. అందుకే ఆ చైతన్య రథసారథికి అనుదినం వందనాలు అర్పిద్దాం. సూర్యభగవానుడికి ఇష్టమైన ఆదివారం శుభోదయాన, ఆ స్వామి తొలి కిరణ స్పర్శ అనుభూతిలో తరిద్దాం!

No comments: