గీతా మాహాత్మ్యము -1 వ భాగం
భగవన్ పరమేశాన
భక్తి రవ్యభిచారిణీ,
ప్రారబ్ధం భుజ్యమానస్య
కథం భవతి హే ప్రభో
భూదేవి విష్ణు భగవానుని గూర్చి యిట్లు ప్రశ్నించెను. ఓ భగవానుడా! పరమేశ్వరా! ప్రభూ! ప్రారబ్ధము అనుభవించువానికి అచంచలమైన భక్తి ఎట్లు కలుగగలదు?
ప్రారబ్ధం భుజ్యమానోపి
గీతాభ్యాసరత స్సదా
స ముక్తస్స సుఖీ లోకే
కర్నణా నోపలిప్యతే.
శ్రీ విష్ణువు చెప్పెను - ఓ భూదేవీ! ప్రారబ్ధ మనుభవించుచున్నను, ఎవడు నిరంతరము గీతాభ్యాసమందు నిరతుడై యుండునో అట్టివాడు ముక్తుడై కర్మలచే నంటబడక ఈ ప్రపంచమున సుఖముగ నుండును.
మహాపాపాది పాపాని
గీతాధ్యానం కరోతిచేత్,
క్వచిత్స్పర్శం న కుర్వంతి
నలినీదల మంభసా.
తామరాకును నీరంటనట్లు గీతాధ్యానముచేయు వానిని మహాపాపములుకూడ కొంచెమైనను అంటకుండును.
గీతాయాః పుస్తకం యత్ర
యత్ర పాఠః ప్రవర్తతే,
తత్ర సర్వాణి తీర్థాని
ప్రయాగాదీని తత్రవై.
ఎచట గీతాగ్రంథముండునో, మరియు ఎచట గీత పారాయణ మొనర్చబడుచుండునో, అచట ప్రయాగ మొదలగు సమస్తతీర్థములున్ను ఉండును.
సర్వే దేవాశ్చ ఋషయో
యోగినః పన్నగాశ్చయే,
గోపాలా గోపికావాపి
నారదోద్ధవ పార్షదైః
సహాయో జాయతే శీఘ్రం
యత్ర గీతా ప్రవర్తతే.
ఎచట గీతాపారాయణము జరుగుచుండునో, అచ్చోటికి సమస్త దేవతలు, ఋషులు, యోగులు, నాగులు, గోపాలురు, భగవత్పార్శ్వర్తులగు నారద, ఉద్ధవాదులు వచ్చి శీఘ్రముగ సహాయమొనర్తురు.
యత్ర గీతావిచారశ్చ
పఠనం పాఠనం శ్రుతమ్,
తత్రాహం నిశ్చితం పృథ్వి
నివసామి సదైవ హి.
ఓ భూదేవీ! ఎచట గీతను గూర్చిన విచారణ, పఠనము, బోధనము, శ్రవణము జరుగుచుండునో, అచట నేనెల్లప్పుడును తప్పక నివసించుదును.
గీతాశ్రయోహం తిష్ఠామి
గీతా మే చోత్తమం గృహమ్,
గీతా జ్ఞాన ముపాశ్రిత్య
త్రీన్లోకాంపాలయామ్యహవ్'.
నేను గీతనాశ్రయించుకొని యున్నాను. గీతయే నాకుత్తమమగు నివాస మందిరము. మరియు గీతా జ్ఞానము నాశ్రయించియే మూడు లోకములను నేను పాలించుచున్నాను.
గీతా మే పరమా విద్యా
బ్రహ్మరూపా న సంశయః,
అర్ధమాత్రాక్షరా నిత్యా
స్వనిర్వాచ్య పదాత్మికా.
గీత నాయొక్క పరమవిద్య. అది బ్రహ్మస్వరూపము. ఇట సంశయ మేమియును లేదు. మరియు నయ్యది (ప్రణవముయొక్క నాల్గవ పాదమగు) అర్థమాత్రాస్వరూపము. అది నాశరహితమైనది. నిత్యమైనది. అనిర్వచనీయమైనది.
చిదానందేన కృష్ణేన
ప్రోక్తా స్వముఖతోర్జునమ్,
వేదత్రయీ పరానంధా
తత్త్వార్థజ్ఞానమంజసా
సచ్చిదానందస్వరూపుడగు శ్రీకృష్ణపరమాత్మచే ఈ గీత స్వయముగ అర్జునునకు చెప్పబడినది. ఇది మూడు వేదముల సారము. పరమానంద స్వరూపము. తన్మాశ్రయించినవారికిది శీఘ్రముగ తత్త్వజ్ఞానమును కలుగజేయును.
యోష్టాదశ జపేన్నిత్యం
నరో నిశ్చలమానసః,
జ్ఞానసిద్ధిం స లభతే
తతో యాతి పరం పదమ్.
ఏ నరుడు నిశ్చలచిత్తుడై గీత పదు నెనిమిది అధ్యాయములను నిత్యము పారాయణము సలుపుచుండునో, అతడు జ్ఞానసిద్ధినిబొంది తద్ద్వారా పరమాత్మపదమును (మోక్షమును) బడయగల్గును.
No comments:
Post a Comment