రాజవిద్యారాజగుహ్యయోగః 2 (అథ నవమోధ్యాయః, శ్రీ భగవద్గీత)
మయా ధ్యక్షేణ ప్రకృతిః
సూయతే సచరాచరమ్,
హేతునానేన కౌంతేయ
జగద్విపరివర్తతే.
ఓ అర్జునా! అధ్యక్షుడనై (సాక్షిమాత్రుడనై) యున్న నాచేత ప్రకృతి చరాచర ప్రపంచమునంతను సృజించుచున్నది. ఈ కారణముచేతనే జగత్తు ప్రవర్తించుచున్నది.
అవజానంతి మాం మూఢా
మానుషీం తనుమాశ్రితమ్,
పరం భావమజానంతో
మమ భూతమహేశ్వరమ్.
నాయొక్క పరతత్త్వమును ఎఱుంగని అవివేకులు సర్వభూత మహేశ్వరుడను ( లోకసంరక్షణార్థము) మనుష్యదేహమును ఆశ్రయించినవాడను నగు నన్ను అవమానించుచున్నారు. (అలక్ష్యము చేయుచున్నారు).
మోఘాశా మోఘకర్మాణో
మోఘజ్ఞానా విచేతసః,
రాక్షసీమాసురీం చైవ
ప్రకృతిం మోహినీం శ్రితాః.
(అట్టివారు) వ్యర్థములైన ఆశలుగలవారును, వ్యర్థములైన కర్మలు గలవారును, వ్యర్థములైన జ్ఞానము గలవారును, బుద్ధిహీనులును (అగుచు) రాక్షస సంబంధమైనదియు, అసురసంబంధమైనదియు నగు స్వభావమునే ఆశ్రయించుచున్నారు .
మహాత్మానస్తు మాం పార్థ
దైవీం ప్రకృతిమాశ్రితాః,
భజంత్యనన్యమనసో
జ్ఞాత్వా భూతాదిమవ్యయమ్.
ఓ అర్జునా! మహాత్ములైతే దైవీప్రకృతిని (దేవ సంబంధమైన స్వభావమును) ఆశ్రయించినవారలై నన్ను సమస్త ప్రాణులకును ఆదికారణునిగను, నాశరహితునిగను ఎరిగి వేఱొకదానియందు మనస్సు నుంచని వారలై నన్నే సేవించుచున్నారు.
సతతం కీర్తయంతో మాం
యతంతశ్చ దృఢవ్రతాః,
నమస్యంతశ్చ మాం భక్త్యా
నిత్యయుక్తా ఉపాసతే.
వారు ( పైనదెల్పిన దైవీ ప్రకృతిగలవారు) ఎల్లప్పుడు నన్ను గూర్చి కీర్తించుచు, దృఢవ్రతనిష్ఠులై ప్రయత్నించుచు, భక్తితో నమస్కరించుచు, సదా నాయందు చిత్తముంచినవారలై నన్ను సేవించుచున్నారు.
జ్ఞానయజ్ఞేన చాప్యన్యే
యజంతో మాముపాసతే,
ఏకత్వేన పృథక్త్వేన
బహుధా విశ్వతో ముఖమ్.
మఱికొందరు జ్ఞానయజ్ఞాముచే పూజించుచున్న వారై (తానే బ్రహ్మమను) అధ్వైత భావముతోను, ఇంక కొందరు (బ్రహ్మము వివిధ దేవతాదిరుపముననున్నది. ఆ దేవతలలో నేనొకనిని సేవించుచున్నాను) ద్వైతభావముతోను ఇట్లనేకవిధములగు (లేక వివిధరూపముల) నన్ను ఉపాసించుచున్నారు.
అహం క్రతురహం యజ్ఞః
స్వధాహమహమౌషధమ్,
మంత్రో హమహమేవాజ్య
మహమగ్ని రహంహుతమ్.
(అగ్నిష్టోమాదిరూప) క్రతువు నేనే, యజ్ఞము నేనే, పితృదేవతలకిచ్చు అన్నము నేనే, ఔషధము నేనే, మంత్రము నేనే, హవిస్సు నేనే, అగ్ని నేనే, హోమకర్మమున్ను నేనే.
పితా హమస్య జగతో
మాతా ధాతా పితామహః,
వేద్యం పవిత్ర మోంకార
ఋక్సామయజు రేవచ.
ఈ జగత్తునకు నేనే తండ్రిని, తల్లిని, సంరక్షకుడను (లేక కర్మఫలప్రదాతను), తాతను, మఱియు తెలిసికొనదగిన వస్తువును, పావనపదార్థమును, ఓంకారమును, ఋగ్వేద, యుజుర్వేద, సామవేదములను నేనే అయియున్నాను.
గతిర్భర్తా ప్రభుస్సాక్షీ
నివాసశ్శరణం సుహృత్,
ప్రభవః ప్రలయః స్థానం
నిధానం బీజమవ్యయమ్.
పరమలక్ష్యమును, భరించువాడును, ప్రభువును, సాక్షియు, ప్రాణులనివాసమును, శరణమొందదగినవాడును, హితమొనర్చువాడును, సృష్టి స్థితి లయ కర్తయు, నిక్షేపమును, నాశరహితమైన బీజమును (మూలకారణమును) నేనే అయుయున్నాను.
No comments:
Post a Comment