Friday, 5 January 2018

రాజవిద్యారాజగుహ్యయోగః 3 (అథ నవమోధ్యాయః, శ్రీ భగవద్గీత)

తపామ్యహమహం వర్షం
నిగృహ్ణామ్యుత్సృజామిచ,
అమృతం చైవ మృత్యుశ్చ
సదసచ్చాహమర్జున.

ఓ అర్జునా! నేను (సూర్యకిరణములచే) తపింపజేయుచున్నాను. మఱియు వర్షమును కురిపించుచున్నాను. వర్షమును నిలుపుదల చేయుచున్నాను. మరణరాహిత్యమున్ను (మోక్షమున్ను) మరణమున్ను నేనె. అట్లే సద్వస్తువున్ను, అసద్వస్తువున్ను నేనే (అయియున్నాను).

త్రైవిద్యా మాం సోమపాః పూతపాపా
యజ్ఞై రిష్ట్వా స్వర్గతిం ప్రార్థయంతే,
తే పుణ్యమాసాద్య సురేంద్రలోక
మశ్నంతి దివ్యాందివి దేవభోగాన్‌.

మూడు వేదముల నధ్యయనము చేసినవారును, కర్మకాండను సకామభావముతో నాచరించువారును, సోమపానము గావించిన వారును, పాపకల్మషము తొలగినవారునగు మనుజులు యజ్ఞములచే నన్ను పూజించి స్వర్గముకొరకై ప్రార్థించుచున్నారు. వారు (మరణానంతరము) పుణ్యఫలమగు దేవేంద్రలోకమును బొంది, అట్టి స్వర్గమందు దివ్యములగు దేవ భోగములు ననుభవించుచున్నారు .

తే తం భుక్త్వా స్వర్గలోకం విశాలం
క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి,
ఏవం త్రయీధర్మమనుప్రపన్నా
గతాగతం కామకామా లభంతే.

వారు (అట్టి స్వర్గాభిలాషులు) విశాలమగు స్వర్గలోకము ననుభవించి పుణ్యము క్షయింప తిరిగి మనుష్యలోకమున జన్మించుచున్నారు. ఈ ప్రకారముగ ( సకామముగ) వేదోక్త కర్మమును అనుష్ఠించునట్టి ఆ భోగభిలాషులు రాకడపోకడలను (జనన మరణములను) పొందుచున్నారు.

అనన్యాశ్చింతయంతో మాం
యే జనాః పర్యుపాసతే,
తేషాం నిత్యాభియుక్తానాం
యోగక్షేమం వహామ్యహమ్‌‌.

ఎవరు ఇతరభావములు లేనివారై నన్నుగూర్చి చింతించుచు ఎడతెగక ధ్యానించుచున్నారో, ఎల్లప్పుడు నా యందే నిష్ఠగలిగియుండునట్టి వారియొక్క యోగ క్షేమములను నేను వహించుచున్నాను.

యే ప్యన్య దేవతాభక్తా
యజంతే శ్రద్ధయాన్వితాః,
తేపి మామేవ కౌంతేయ
యజంత్యవిధిపూర్వకమ్‌.

ఓ అర్జునా! ఎవరు ఇతర దేవతలయెడల భక్తి గలవారై శ్రద్ధతోకూడి వారి నారాధించుచున్నారో, వారున్ను నన్నే అవిధిపూర్వకముగ (క్రమము తప్పి) ఆరధించుచున్న వారగుదురు.

అహం హి సర్వయజ్ఞానాం
భోక్తా చ ప్రభురేవ చ,
న తు మామభిజానంతి
తత్త్వేనాతశ్చ్యవంతి తే‌.

ఏలయనగ సమస్త యజ్ఞములకు భోక్తను, ప్రభువు (యజమానుడు) ను నేనే అయియున్నాను. అట్టి నన్ను వారు యథార్థముగ తెలిసికొనుటలేదు. ఇందు వలన జారిపోవుచున్నారు. పునర్జన్నను బొందుచున్నారు).

యాంతి దేవవ్రతా దేవాన్‌
పితౄన్‌ యాంతి పితృవ్రతాః,
భూతాని యాంతి భూతేజ్యా
యాంతి మద్యాజినోపిమామ్‌.

దేవతల నారాధించువారు దేవతలను, పితృదేవతల నారధించువారు పితృదేవతలను, భూతముల నారాధించువారు భూతములను, నన్నారాధించువారు నన్ను పొందుచున్నారు.

పత్రం పుష్పం ఫలం తోయం
యో మే భక్త్యా ప్రయచ్ఛతి,
తదహం భక్త్యుపహృత
మశ్నామి ప్రయతాత్మనః.

ఎవడు నాకు భక్తితో ఆకునుగాని, పువ్వునుగాని, పండునుగాని, జలమునుగాని సమర్పించుచున్నాడో, అట్టి పరిశుద్ధాంతఃకరణుని యొక్క (లేక, పరమార్థ యత్నశీలునియొక్క) భక్తిపూర్వకముగ నొసంగబడిన ఆ పత్రపుష్పాదులను నేను ప్రీతితో ఆరగించుచున్నాను. (అనుభవించుచున్నాను)

యత్కరోషి యదశ్నాసి
యజ్జుహోషి దదాసి యత్‌,
యత్తపస్యసి కౌంతేయ
తత్కురుష్వ మదర్పణమ్‌‌.

ఓ అర్జునా! నీ వేదిచేసినను, తినినను, హోమ మొనర్చినను, దానముచేసినను, తపస్సు చేసినను దానిని నాకర్పింపుము. 

No comments: