Thursday, 11 January 2018

అక్షరపరబ్రహ్మయోగః 1 (అథ అష్టమోధ్యాయః, శ్రీ భగవద్గీత)

అర్జున ఉవాచ:-
కిం తద్బ్రహ్మ కిమధ్యాత్మం
కిం కర్మ పురుషోత్తమ,
అధిభూతం చ కిం ప్రోక్త
మధిదైవం కిముచ్యతే.

అధియజ్ఞః కథం కోత్ర
దేహేస్మి న్మధుసూదన,
ప్రయాణకాలే చ కథం
జ్ఞేయోసి నియతాత్మభిః

అర్జును డడిగెను - పురుష శ్రేష్ఠుడవగు ఓ కృష్ణా! ఆ బ్రహ్మమేది? ఆధ్యాత్మ మెయ్యది? కర్మమనగా నేమి? అదిభూతమని యేది చెప్పబడినది? అధిదైవమని దేనిని చెప్పుదురు? ఈ దేహమందు అధియజ్ఞుడెవడు? అతనిని తెలిసికొనుట ఎట్లు? ప్రాణప్రయాణ సమయమందు నియమితచిత్తులచే మీరెట్లు తెలిసికొనబడ గలరు?

శ్రీ భగవానువాచ :-
అక్షరం బ్రహ్మ పరమం
స్వభావోధ్యాత్మ ముచ్యతే,
భూతభావోద్భవకరో
విసర్గః కర్మ సంజ్ఞితః‌.

శ్రీ భగవానుడు చెప్పుచున్నాడు_ ఓ అర్జునా! సర్వోత్తమమైన (నిరతిశయమైన) నాశరహితమైనదే బ్రహ్మమనబడును. ప్రత్యగాత్మభావము ఆధ్యాత్మమని చెప్పబడును. ప్రాణికోట్లకు ఉత్పత్తిని గలుగజేయు (యజ్ఞాది రూపమగు) త్యాగపూర్వకమైన క్రియ కర్మమను పేరు కలిగియున్నది. 

అధిభూతం క్షరోభావః
పురుషశ్చాధిదైవతమ్‌,
అధియజ్ఞోహమేవాత్ర
దేహే దేహభృతాం వర.

దేహధారులలో శ్రేష్టుడవగు ఓ అర్జునా! నశించు పదార్థము అధిభూత మనబడును. విరాట్పురుషుడు లేక హిరణ్యగర్భుడే అధిదైవత మనబడును. ఈ దేహమందు నేనే (పరమాత్మయే) అధియజ్ఞుడనబడును.

అంతకాలే చ మామేవ
స్మరన్ముక్త్వా కలేబరమ్‌,
యః ప్రయాతి స మద్భావం
యాతి నాస్త్యత్ర సంశయః.

ఎవడు మరణకాలమందుగూడ నన్నే స్మరించుచు శరీరమును విడిచిపోవుచున్నాడో, అతడు నా స్వరూపమును పొందుచున్నాడు. ఇట సంశయ మేమియును లేదు.

యం యం వాపి స్మరన్‌ భావం
త్యజత్యంతే కలేబరమ్‌,
తం తమేవైతి కౌంతేయ
సదా తద్భావభావితః‌.

అర్జునా! ఎవడు మరణకాలమున ఏయే భావమును (లేక రూపమును) చింతించుచు దేహమును వీడునో వాడట్టి భావముయొక్క స్మరణచే గలిగిన సంస్కారము గలిగియుండుట వలన ఆయా రూపమునే పొందుచున్నాడు. 

తస్మాత్సర్వేషు కాలేషు
మా మనుస్మర యుధ్య చ,
మయ్యర్పిత మనోబుద్ధి
ర్మామే వైష్యస్య సంశయః.

కాబట్టి ఎల్లకాలమునందును నన్ను స్మరించుచు (నీ స్వధర్మమగు) యుద్ధమును గూడ జేయుము. ఈ ప్రకారముగ నాయందు సమర్పింపబడిన మనోబుద్ధులు గలవాడవైనచో నీవు నన్నే పొందగలవు. ఇట సంశయము లేదు. 

అభ్యాసయోగయుక్తేన
చేతసా నాన్యగామినా,
పరమం పురుషం దివ్యం
యాతి పార్థానుచింతయన్‌.

ఓ అర్జునా! అభ్యాసమను యోగముతో గూడినదియు, ఇతర విషయములపైకి పోనిదియునగు మనస్సుచేత, అప్రాకృతుడైన (లేక, స్వయంప్రకాశ స్వరూపుడైన) సర్వోత్తముడగు పరమపురుషుని మరల మరల స్మరించుచు మనుజుడు అతనినే పొందుచున్నాడు .

కవిం పురాణ మనుశాసితార
మణోరణీయాంస మనుస్మ రేద్యః,
సర్వస్య ధాతార మచింత్య రూప
మాదిత్యవర్ణం తమసః పరస్తాత్‌.

ప్రయాణకాలే మనసా చలేన
భక్త్యా యుక్తో యోగబలేన చైవ,
భ్రువోర్మధ్యే ప్రాణమావేశ్య సమ్యక్‌
స తం పరం పురుషముపైతిదివ్యమ్‌‌.

ఎవడు భక్తితో గూడికొనినవాడై, అంత్యకాలమునందు యోగబలముచే (ధ్యానాభ్యాస సంస్కార బలముచే) ప్రాణవాయువును భ్రూమధ్యమున (కను బొమ్మల నడుమ) బాగుగ నిలిపి, ఆ పిదప సర్వజ్ఞుడును, పురాణపురుషుడును, జగన్నియామకుడును, అణువుకంటెను మిగుల సూక్ష్మమైనవాడును, సకల ప్రపంచమునకు ఆధారభూతుడును (సంరక్షకుడును) చింతింపనలవికాని స్వరూపముగలవాడును, సూర్యుని కాంతివంటి కాంతిగలవాడును (స్వయంప్రకాశ స్వరూపుడును), అజ్ఞానాంధకారమునకు ఆవలనుండు వాడునగు పరమాత్మను నిశ్చలమనస్సుచే ఎడతెగక చింతించునో, ఆతడు దివ్య స్వరూపుడైన సర్వోత్తముడగు ఆ పరమాత్మనే పొందుచున్నాడు. 

No comments: