ఆత్మసంయమయోగః 2 (అథ షష్ఠోధ్యాయః, శ్రీ భగవద్గీత)
యోగీ యుఞ్జీత సతత
మాత్మానం రహసి స్థితః,
ఏకాకీ యతచిత్తాత్మా
నిరాశీరపరిగ్రహః.
ధ్యానయోగము నభ్యసించు యోగి ఏకాంతప్రదేశమున ఒంటరిగ నున్నవాడై మనస్సును, దేహేంద్రియములను స్వాధీనమొనర్చుకొని, ఆశలేనివాడై, ఒరుల నుండి ఏమియు స్వీకరింపక ఎల్లప్పుడును మనస్సును ఆత్మయందే నెలకొల్పుచుండవలెను. (లయమొనర్చు చుండవలెను) .
శుచౌ దేశే ప్రతిష్ఠాప్య
స్థిరమాసన మాత్మనః,
నాత్యుచ్ఛ్రితం నాతినీచం
చేలాజినకుశోత్తరమ్.
తత్రైకాగ్రం మనః కృత్వా
యతచిత్తేంద్రియక్రియః,
ఉపవిశ్యాసనే యుఞ్జ్యా
ద్యోగమాత్మ విశుద్ధయే.
పరిశుద్ధమైన చోటునందు మిక్కిలి ఎత్తుగా నుండనిదియు, మిక్కిలి పొట్టిగా నుండనిదియు, క్రింద దర్భాసనము, దానిపై చర్మము (జింకచర్మము, లేక పులిచర్మము), దానిపైన వస్త్రముగలదియు, కదలక యుండునదియునగు ఆసనము (పీఠము)ను వేసికొని దానిపై గూర్చుండి, మనస్సును, ఏకాగ్రపఱచి ఇంద్రియమనోవ్యాపారములను అరికట్టి (స్వాధీన పఱచుకొని) అంతఃకరణశుద్దికొఱకు (పరమాత్మ) ధ్యానము నభ్యసింప వలయును .
సమం కాయశిరోగ్రీవం
ధారయన్నచలం స్థిరః,
సంప్రేక్ష్య నాసికాగ్రం స్వం
దిశశ్చానవలోకయన్.
ప్రశాంతాత్మా విగతభీ
ర్బ్రహ్మచారి వ్రతే స్థితః,
మనస్సంయమ్య మచ్చిత్తో
యుక్త ఆసీత మత్పరః
(ధ్యానము చేయువాడు) శరీరము, శిరస్సు, కంఠము, సమముగ (తిన్నగ) నిలిపి కదలక, స్థిరముగ నున్నవాడై దిక్కులను జూడక, నాసికాగ్రమును వీక్షించుచు, ప్రశాంతహృదయుడై, నిర్భయచేతస్కుడై బ్రహ్మచర్య వ్రతనిష్ఠ గలిగి, మనస్సును బాగుగ నిగ్రహించి, నాయందు చిత్తముగలవాడై, నన్నే పరమగతిగ నమ్మి, సమాధి (ధ్యాన) యుక్తుడై యుండవలెను.
యుఞ్జన్నేవం సదాత్మానం
యోగీ నియతమానసః,
శాంతిం నిర్వాణపరమాం
మత్సంస్థామధిగచ్ఛతి.
మనోనిగ్రహముగల యోగి ఈ ప్రకారముగ ఎల్లప్పుడును మనస్సును ఆత్మధ్యానమందు నిలిపి, నాయందున్నట్టిదియు (నా స్వరూపమైనదియు) ఉత్కృష్ట మోక్షరూపమైనదియు, (పరమానందరూపమైనదియు) నగు శాంతిని బొందుచున్నాడు.
నాత్యశ్నతస్తు యోగోస్తి
న చైకాంత మనశ్నతః,
న చాతిస్వప్నశీలస్య
జాగ్రతో నైవ చార్జున.
అర్జునా! ఈ ధ్యానయోగము అధికముగ భుజించువానికిని, బొత్తిగా భుజింపనివానికిని, అట్లే అధికముగ నిద్రించువానికిని, (బొత్తిగా నింద్రించక) ఎల్లప్పుడు మేలుకొని యుండువానికిని కలుగనే కలుగదు.
యుక్తాహార విహారస్య
యుక్త చేష్టస్య కర్మసు,
యుక్తస్వప్నావబోధస్య
యోగో భవతి దుఃఖహా.
మితమైన ఆహారము, విహారముగలవాడును, కర్మలందు మితమైన ప్రవర్తనగలవాడును, మితమైన నిద్ర, జాగరణము గలవాడునగు మనుజునకు యోగము (జనన మరణాది సంసార) దుఃఖములను బోగొట్టునదిగ అగుచున్నది.
యదా వినియతం చిత్త
మాత్మ న్యేవావతిష్ఠతే,
నిస్స్పృహస్సర్వకామేభ్యో
యుక్త ఇత్యుచ్యతే తదా.
ఎపుడు మనస్సు బాగుగనిగ్రహింపబడినదియై ఆత్మ యందే స్థిరముగ నిలుచునో, మఱియు ఎపుడు యోగి సమస్తములైన కోరికలనుండి నివృత్తుడగునో, అపుడే యాతడు యోగసిద్ధిని బొందినవాడని (సమాధియుక్తుడని) చెప్పబడును.
No comments:
Post a Comment