Thursday, 11 January 2018

ఆత్మసంయమయోగః 1 (అథ షష్ఠోధ్యాయః, శ్రీ భగవద్గీత)

శ్రీ భగవానువాచ :-
అనాశ్రితః కర్మఫలం
కార్యం కర్మ కరోతి యః,
స సన్న్యాసీ చ యోగీ చ
న నిరగ్నిర్న చాక్రియః.

శ్రీ భగవంతుడు చెప్పెను - ఎవడు చేయవలసిన కర్మములను ఫలాపేక్ష లేకుండ చేయునో, అతడే సన్న్యాసియు, యోగియునగును. అంతియే కాని అగ్ని హోత్రమును వదలినవాడు కాని, కర్మలను విడిచినవాడు కాని సన్న్యాసియు, యోగియు ఎన్నటికి కానేరడు.

యం సన్న్యాస మితి ప్రాహు
ర్యోగం తం విద్ధి పాణ్డవ,
న హ్యసన్న్యస్త సంకల్పో
యోగీ భవతి కశ్చన.

ఓ అర్జునా! దేనిని సన్న్యాసమని చెప్పుదురో, దానినే యోగమని యెఱుగుము. ఏలయనగా, (కామది) సంకల్పమును వదలనివాడు (సంకల్పరహితుడు కానివాడు) ఎవడును యోగికానేరడు.

ఆరురుక్షోర్ము నేర్యోగం
కర్మకారణముచ్యతే,
యోగారూఢస్య తస్యైవ
శమః కారణముచ్యతే.

యోగమును (జ్ఞానయోగమును, లేక ధ్యానయోగమును) ఎక్కదలచిన (పొందగోరిన) మునికి (మననశీలునకు) కర్మ సాధనమనియు, దానిని బాగుగ ఎక్కినట్టి మునికి ఉపరతి (కర్మనివృత్తి) సాధనమనియు చెప్పబడినవి. 

యదా హి నేంద్రియార్థేషు
న కర్మస్వనుషజ్జతే,
సర్వసంకల్ప సన్న్యాసీ
యోగారూఢస్తదోచ్యతే.

ఎవడు శబ్దాదివిషయము లందును, కర్మలందును, ఆసక్తి నుంచడో సమస్త సంకల్పములను విడిచి పెట్టునో, అపుడు మనుజుడు యోగారూఢుడని చెప్పబడును.

ఉద్ధరేదాత్మ నాత్మానం
నాత్మాన మవసాదయేత్‌,
ఆత్మైవ హ్యాత్మనో బంధు
రాత్మైవ రిపు రాత్మనః.

తన్నుతానే యుద్ధరించుకొనవలయును. తన్ను అధోగతిని బొందించుకొనగూడదు. (ఇంద్రియమనంబును జయించినచో) తనకు తానే బంధువున్ను (జయించనిచో) తనకు తానే శత్రువున్ను అగును.

బంధు రాత్మా త్మన స్తస్య
యేనాత్మైవాత్మనా జితః,
అనాత్మనస్తు శత్రుత్వే
వర్తేతాత్మైవ శత్రువత్‌.

ఎవడు (వివేకవైరాగ్యాదులచే) తన మనస్సును తాను జయించుకొనునో, అట్టి జయింపబడిన మనస్సు తనకు బంధువుపగిదినుండును. (ఉపకారముచేయును) జయించనిచో, అదియే శత్రువుపగిదినుండును. (ఆపకారము చేయును).

జితాత్మనః ప్రశాంతస్య
పరమాత్మా సమాహితః,
శీతోష్ణసుఖదుఃఖేషు
తథా మానావమానయోః.

మనస్సును జయించినవాడును, పరమశాంతితో గూడినవాడునగు మనుజుడు శీతోష్ణ, సుఖదుఃఖాదులందును, అట్లే మానావమానములందును పరమాత్మానుభవము చెక్కుచెదరకయే యుండును. (లేక అట్టివానికి శీతోష్ణాదులందును మనస్సు లెస్సగ ఆత్మానుభవమందే యుండును).

జ్ఞానవిజ్ఞానతృప్తాత్మా
కూటస్థో విజితేంద్రియః,
యుక్త ఇత్యుచ్యతే యోగీ
సమలోష్టాశ్మ కాంచనః

శాస్త్రజ్ఞాన, అనుభవజ్ఞానములచే తృప్తినొందిన మనస్సుగలవాడును, నిర్వికారుడును, ఇంద్రియములను లెస్సగ జయించినవాడును, మట్టిగడ్డా, ఱాయి, బంగారము, అను మూడిటిని సమముగ జూచువాడునగు యోగి యోగారూఢుడని (ఆత్మానుభవయుక్తుడని) చెప్పబడును.

సుహృన్మిత్రా ర్యుదాసీన
మధ్యస్థ ద్వేష్యబంధుషు,
సాధుష్వపి చ పాపేషు
సమబుద్ధిర్విశిష్యతే.

ప్రత్యుపకారమును గోరకయే మేలొనర్చువారి యందు, ప్రతిఫలముగోరి మేలుచేయువారియందు, శత్రువులందు, తటస్థులందు, మధ్యవర్తులందు, ద్వేషింపబడదగినవారియందు, (విరోధులందు) బంధువులందు, సజ్జనులందు, పాపులందు సమభావము గల్గి యుండువాడే శ్రేష్ఠుడు. 

No comments: