ఆత్మసంయమయోగః 4 (అథ షష్ఠోధ్యాయః, శ్రీ భగవద్గీత)
యుఞ్జన్నేవం సదాత్మానం
యోగీ విగతకల్మషః,
సుఖేన బ్రహ్మసంస్పర్శ
మత్యంతం సుఖ మశ్నుతే.
ఈ ప్రకారముగ మనస్సు నెల్లప్పుడును ఆత్మయందే నిలుపుచు దోషరహితుడగు యోగి బ్రహ్మానుభవ రూపమైన పరమ సుఖమును సులభముగ పొందుచున్నాడు.
సర్వభూతస్థ మాత్మానం
సర్వభూతాని చాత్మని,
ఈక్షతే యోగయుక్తాత్మా
సర్వత్ర సమదర్శనః.
యోగముతో గూడుకొనిన మనస్సుగలవాడు (ఆత్మైక్యము నొందిన యోగి) సమస్త చరాచర ప్రాణికోట్ల యందును సమదృష్టిగలవాడై తన్ను సర్వభూతములం దున్నవానిగను, సర్వభూతములు తనయందున్నవిగను చూచుచున్నాడు.
యో మాం పశ్యతి సర్వత్ర
సర్వం చ మయి పశ్యతి,
తస్యాహం న ప్రణశ్యామి
స చ మే న ప్రణశ్యతి.
ఎవడు సమస్త భూతములందును నన్ను చూచుచున్నాడో మఱియు నాయందు సమస్త భూతములను గాంచుచున్నాడో అట్టివానికి నేను కనబడకపోను. నాకతడు కనబడకపోడు.
సర్వభూతస్థితం యో మాం
భజత్యేకత్వమాస్థితః,
సర్వథా వర్తమానోపి
స యోగీ మయి వర్తతే.
ఎవడు సమస్త భూతములందున్న నన్ను అభేదబుద్ధి (సర్వత్ర ఒకే పరమాత్మయను భావము) గలిగి సేవించుచున్నాడో, అట్టియోగి ఏవిధముగ ప్రవర్తించుచున్న వాడైనను (సమాధినిష్ఠయందున్నను లేక వ్యవహారము సల్పుచున్నను) నాయందే (ఆత్మయందే) ఉండువాడగుచున్నాడు.
ఆత్మౌపమ్యేన సర్వత్ర
సమం పశ్యతి యోర్జున,
సుఖం వా యది వా దుఃఖం
స యోగీ పరమోమతః.
ఓ అర్జునా! సమస్త ప్రాణులయందును సుఖముగాని, దుఃఖముగాని తనతోడ పోల్చుకొనుచు (తన ఆత్మవంటివే తక్కిన ఆత్మలనెడి భావముతో) తనవలె సమానముగ ఎవడు చూచునో, అట్టియోగి శ్రేష్ఠుడని తలంపబడుచున్నాడు .
అర్జున ఉవాచ:-
యోయం యోగస్త్వయాప్రోక్త
స్సామ్యేన మధుసూదన,
ఏతస్యాహం న పశ్యామి
చఞ్చలత్వాత్థ్సితిం స్థిరామ్.
అర్జునుడు చెప్పెను. ఓ కృష్ణా! మనోనిశ్చలత్వముచే సిద్ధింపదగిన ఏ యోగమును నీవుపదేశించితివో దానియొక్క స్థిరమైన నిలుకడను మనస్సుయొక్క చపలత్వము వలన నేను తెలిసికొనజాలకున్నాను.
చఞ్చలం హి మనః కృష్ణ
ప్రమాథి బలవద్దృఢమ్,
తస్యాహం నిగ్రహం మన్యే
వాయోరివ సుదుష్కరమ్.
కృష్ణా! మనస్సు చంచలమైనదియు, విక్షోభమును గలుగ జేయునదియు, బలవంతమైనదియు, దృఢమైనదియునుగదా! కావున అద్దానిని నిగ్రహించుట; గాలిని అణచిపెట్టుటవలె మిగుల కష్టసాధ్యమైనదని నేను తలంచుచున్నాను.
శ్రీ భగవానువాచ:-
అసంశయం మహాబాహో
మనూదుర్నిగ్రహం చలమ్,
అభ్యాసేన తు కౌంతేయ
వైరాగ్యేణ చ గృహ్యతే.
శ్రీ భగవానుడు చెప్పెను:- గొప్పబాహువులుగల ఓ అర్జునా! మనస్సును నిగ్రహించుట కష్టమే. మఱియు మనస్సు చంచలమైనదే. ఇచట ఏలాటి సంశయము లేదు. అయినను అభ్యాసముచేతను వైరాగ్యముచేతను అది నిగ్రహింపబడగలదు.
అసంయతాత్మనా యోగో
దుష్ప్రాప ఇతి మే మతిః,
వశ్యాత్మనా తు యతతా
శక్యోవాప్తు ముపాయతః.
నిగ్రహింపబడని మనస్సుగలవానిచేత యోగము (బ్రహ్మైక్యము) పొందశక్యముకానిది అని నా అభిప్రాయము. స్వాధీనమైన మనస్సుగల్గి ప్రయత్నించువానిచేతనో, ఉపాయముచే నది పొందశక్యమైయున్నది.
No comments:
Post a Comment