శ్రీ మద్భగవద్గీత గురించి
భగవద్గీతా కించిదధీతా
గంగా జలలవ కణికాపీతా|
సకృదపి యేన మురారి సమర్చా
క్రియతే తస్య యమేన స చర్చా||
శ్లోకం అర్ధం :
భగవద్గీతను ఏ కొద్దిగా అధ్యయనము చేసినను, గంగానదీ జలములోని ఒక బిందువునైనా త్రాగినను, ఒక్కసారి అయినను మనసా కర్మణా భగవంతుని పూజించినను చాలు. అలాంటివాడికి యముని వలన ఏ మాత్రమూ భయము ఉండదు(దీనర్థము చావు అంటే భయం పోతుందని).
|| వసుదేవసుత౦ దేవ౦ క౦సఛాణూర మర్ధన౦
దేవకీపరమాన౦ద౦ కృష్ణ౦ వ౦దే జగద్గురు౦ ||
భగవద్గీత సారం:
నీవు అనవసరంగా ఎందుకు దిగులుపడుతున్నావు? నీవు ఎవర్ని చూసి భయపడుతున్నావు? నిన్ను ఎవరు చంపగలరు? ఆత్మకు పుట్టుక గిట్టుకలు లేవు. జరిగినది మంచికోసమే జరిగింది. జరుగుతున్నదేదో మంచికోసమే జరుగుతోంది. జరగబోయేది మంచి కోసమే జరగబోతుంది. గతాన్ని గురించి మనస్సు పాడుచేసుకోవద్దు. భవిష్యత్తును గురించి దిగులుపడవద్దు. ఏమి నష్టపోయావని నీవు బాధపడుతున్నావు? నీతో కూడా నీవు ఏమి తెచ్చావు? ఏమి పోగొట్టుకున్నావు? నీవు ఏమి తయారుచేసావు? ఆ చేసినదేదో నాశనం అయింది. నీవు ఏమీ తీసుకురాలేదు. నీ దగ్గరున్న దాన్ని నీవు ఇక్కడే పొందావు. నీకు ఇవ్వబడినదేదో అది ఇక్కడే ఇవ్వబడింది. నీవు తీసుకున్నది ఈ ప్రపంచంనుండే తీసుకోబడింది. నీవు యిచ్చింది, ఈ ప్రపంచం నుండీ తీసుకున్నదే. నీవు వట్టి చేతులతో వచ్చావు. వట్టి చేతులతో పోతావు. ఈరోజు నీదైనది. గతంలో అది మరొకడిది. అదే ఆ తరువాత మరొకడిది అవుతుంది. నీవు దాన్ని నీ సొంతం అనుకుంటావు. దానిలో లీనమైపోతున్నావు. ఈ అనుబంధమే అన్ని దుఖాలకు మూలకారణం.
మార్పు అన్నది జీవితపు నియమం. ఒక్క క్షణంలో నీవు లక్షాధిపతివి ఆ తరువాత క్షణంలో నీవు బికారివి. ఈ శరీరం నీది కాదు. అంతేకాదు నీవి ఈ శరీరం కానే కావు. భూమి, నీరు, గాలి, నిప్పు, ఆకాశం ఇవి పంచభూతాలు. వీటితో నీ శరీరం ఏర్పడింది. చనిపోయిన తరువాత ఈ పంచభూతాలు అవి వచ్చిన చోటుకు వెనుతిరిగిపోతాయి. కానీ ఆత్మ అన్నది మరణం లేనిది. అది నిరంతరమైనది. అటువంటప్పుడు నీవు ఎవరివి? భగవంతుని శరణుజొచ్చు. అతడే అంతిమ ఆధారం. ఈ అనుభవాన్ని పొందిన వ్యక్తి భయం, దిగులు, నిరాశల నుండీ పూర్తిగా ముక్తుడై ఉంటాడు. నీవు చేసే ప్రతి ఒక్క పని అతడికి అర్పించు. ఈవిధంగా చేయడం వల్ల, కలకాలం నిలిచిపోయే సచ్చితానందాన్ని నీవు పొందుతావు.
No comments:
Post a Comment